Thursday, April 10, 2025

****మిత్రమా 'భద్రం!'

 మిత్రమా 'భద్రం!'
1.మన తెలుగు వాళ్లలో 
చాలామందికి 'పొట్టలు, జేబులు నింపుకోవడం ఎట్లా?'అనే ఆలోచనే తప్ప ఆత్మీయత,ఆప్యాయత,మన సంస్కృతి,సంప్రదాయాల మీద,అమ్మ భాష మీద శ్రద్ధ లేదు.నామకః బుర్ర ఉన్నదే తప్ప హృదయం లేదు.
2.అమ్మాయి గర్భిణిగా ఉండగానే పుట్టబోయే పాపనో,బాబునో అమెరికాకు పంపడం ఎట్లా? అనే ఆలోచనలోనే ఉన్నారు.
3.ఈ ధోరణే ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహం (క్రేౙ్) పెరగడానికి ప్రధాన కారణం.
4.మనదేశంలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన ప్రతి ఒక్కరు అమెరికాకో,మరో దేశానికో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకో గలగడం సాధ్యమేనా?
5.నూరు మందిలో నలుగురో, ఐదుగురో పోగలిగితే వాళ్ల కోసం 95 మంది ఎందుకు ఈ పరాయి భాషతో కుస్తీ పట్టాలి?బాధలుపడాలి?
6.మా తరం,మీ తరం కనీసం పదవ తరగతి వరకు హాయిగా తెలుగులో చదువుకొని ఇప్పుడు ఆంగ్లంలో కూడా నిరాఘాటంగా మాట్లాడగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం కదా!
7.40,50 ఏళ్ల క్రితం మన రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడిన వాళ్లు, వివిధ సంస్థలను స్థాపించిన వాళ్ళు నూటికి నూరు మంది తెలుగు మీడియంలో చదువుకున్నవాళ్లే కదా!
8.దేశంలో,మన రాష్ట్రంలో నిరుద్యోగం ఉన్నమాట వాస్తవం.దానిని పరిష్కరించుకోవడానికి ఇక్కడి ప్రభుత్వాలను మనం నిలదీయాలి తప్ప వలసలు ఎంత కాలం పోగలం? ఎక్కడికని పోగలం?
9.ట్రంప్ ప్రస్తుత చర్యల సందర్భంలో ఈ విషయాన్ని మరింత లోతుగా, విస్తృతంగా  మనం చర్చించాలి.
10.అంతరిక్ష యాత్రికులు కల్పనా చావ్లా,సునీతా విలియమ్స్,మాజీ ఉపాధ్యక్షురాలు,ఇటీవలే అధ్యక్షురాలిగా పోటీ చేసిన కమలా హారిస్,అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుని  భార్య (తెలుగు!)మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు- అని మనం ౘంకలు గుద్దుకుంటున్నాం కదా!
11.భారతీయ మూలాలు- అని ఎందుకు చెప్పాలి?అది మన గుర్తింపు, అస్మిత, రికగ్నిషన్,ఐడెంటిటీ.
12.ఇతర రాష్ట్రాలకు వెళితే 'మేము తెలుగు వాళ్ళం' అని చెప్తాం.ఇతర దేశాలకు వెళితే 'మేము భారతీయులం' అని చెప్తాం.అదీ మన గుర్తింపు.
13.అందువల్ల మన పిల్లలకు తెలుగు నేర్పకుండా "మేము తెలుగు వాళ్ళం" అని చెప్పుకోవడం అసంబద్ధమైన విషయం కదా!
14.విదేశాలలో-ముఖ్యంగా అమెరికాలో-మన తెలుగుతో సహా అన్ని దేశాల,ప్రాంతాల ప్రజలు వాళ్ళ వాళ్ళ భాషలను,సంగీతాన్ని, నృత్యాలను వాళ్ల పిల్లలకు నేర్పిస్తున్నారు.
15.కానీ "తెలుగదేల యన్న దేశంబు తెలుగు..", ''చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా", 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్'
అని ప్రశంసలు పొందిన మన అమ్మ భాష మాత్రం మన గడ్డమీదనే నిరాదరణకు గురి 
కావడాన్ని మనం ఎట్టి పరిస్థితులలోనూ  సహించవద్దు. 
16.ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలతోనూ యుద్ధం చేయాలి,ప్రజలనూ చైతన్య పరచాలి.మనం చేయవలసింది ద్విముఖ, త్రిముఖ పోరాటం కాదు బహుముఖ పోరాటం. 
17.ఉపాధ్యాయుల, పట్టభద్రుల ప్రతినిధులుగా/ ఎమ్మెల్సీలుగా గెలుస్తున్న వారు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను
అనుమతిస్తున్న ప్రభుత్వాల విధానాలను, వాళ్ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధాన్ని ఎండ గట్టాలి.
18.ఆ సంస్థలలో పనిచేసే వాళ్లు చాలీచాలని జీతాలతో బ్రతుకులను ఈడుస్తున్న మన తమ్ముళ్లు,చెల్లెళ్లు.ఆ విద్యాసంస్థల్లో చేరుతున్న పిల్లల తల్లిదండ్రులు పుస్తే, పోగు అమ్మి ఫీజులు కడుతున్నారు. 
19.మనం చెమటోడ్చి చెల్లిస్తున్న డబ్బులతో అందమైన భవనాలు,సకల సౌకర్యాలు కల్పించుకున్న నిర్వాహకులను చూసి మనం మురిసి పోతున్నాం.కొండొకచో వారితో మాట్లాడడానికి భయపడుతున్నాం కూడా. 
20.మన పిల్లలను ఆత్మహత్యలకు గురి చేస్తున్న, పాఠాలను అర్థం చేయించకుండా, ప్రశ్నించే అవకాశం లేకుండా బట్టీ పట్టించే అక్కడి విధానాలను, "తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడవద్దు" వంటి వేధింపులను ప్రశ్నించకుండా, ఆ భవనాలు మన కష్టార్జితం అని కూడా  మరిచిపోతున్నాం. 
21.అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ,ప్రతిచోట మన అమ్మ భాషను కాపాడుకోవలసిన అవసరాన్ని గొంతెత్తి వినిపించాలి.
22.ఈ మన ప్రయత్నం అంతా మనం మన ఉద్యోగాలను కాపాడుకోవడానికి కానే కాదు.మన గుర్తింపును,మన అమ్మ భాషను కాపాడుకోవడానికే,ఆ అమ్మ కన్నీళ్లను తుడవడానికే,ఆమెను ఆనందంగా ఉంచడానికే-అని స్పష్టం చేయాలి.
23.మనం సంస్కృతానికి, హిందీకి వ్యతిరేకం కాదు. వాటిని గౌరవిస్తాం,ప్రేమిస్తాం. కానీ ముందు మన అమ్మ భాష. తర్వాతనే ఏవైనా.
24.కన్నతల్లి కన్నీళ్లను తుడవలేని వాడు 'పినతల్లికి పిండం పెడతా'నంటే ఎట్లా
నమ్ముతాం? 
25.స్వదేశీ,విదేశీ- ఏ భాష అయినా సరే-ఇతర భాషలను మనపై రుద్దడంలో ఆధిపత్య ధోరణి,మన గుర్తింపును ధ్వంసం చేయాలన్న కుట్ర కూడా దాగి ఉంది.
26.జయాప జయాలతో నిమిత్తం లేకుండా,విస్తృత ప్రజానీకంతో కలిసి మన పోరాటం మనం చేద్దాం.
27.పోరాడితే పోయేదేమీ లేదు-పరభాషా దాస్యం,తల వంచుకోవడం తప్ప.
-మోతుకూరు నరహరి

No comments:

Post a Comment