*_కలిసి పుట్టారు_*
*_కలిసే బ్రతకండి.!_*
_______________________
_నాన్న వెళ్లారు.._
_అమ్మ అనుసరించింది.._
_అంతకు ముందే ఇంట్లో_ _పెద్దోళ్ళు ఒకరి వెంట ఒకరుగా_
_మాయమైపోయారు_
_మమతలను పంచి.._
_ముద్రలను మిగిల్చి.._
_జ్ఞాపకాలను వదిలి..!_
_పిల్లలు ఉన్నంత కాలం_
_అమ్మానాన్న ఉండరు.._
_కానీ ఆ ఇద్దరూ ఉన్నప్పుడు_
_మనం ఉన్నాం.._
_ఆ మనమే సంతానం.._
_ఒకే రక్తం..ఒకే ఇంటి పేరు.._
_అదే ఇల్లు..అదే అనుభూతి!_
_అన్నయ్య..తమ్ముడు.._
_అక్క..చెల్లి.._
_ఇవే వరసలు.._
_వీళ్లే వారసులు.._
_కలిసి పుట్టేది ఆ నలుగురే.._
_నీ నిండు జీవితంలో_
_ఎందరైనా రానీ.._
_ఇంకెందరైనా పోనీ..._
_కడదాకా నిలిచి ఉండే_
_బంధం రక్తసంబంధం..!_
_నువ్విక్కడ ఉన్నా.._
_నీ కన్నా ముందు_
_బొడ్డూడిన_
_అన్న భాగ్యనగరి నడిబొడ్డులో.._
_నీకు బిగుతైపోయిన బట్టలు_
_సంబరంగా తొడుక్కున్న_
_తమ్ముడు అమెరికాలో_
_మగపిల్లల మధ్య_
_మహారాణిలా.._
_మద్దిమద్దిలో మగరాయుడిలా_
_మీతోనే కబడ్డీ.._
_గూటీబిళ్ల ఆడిన.._
_తనకు తోడు లేక_
_మీతో చింతపిక్కలు..._
_తొక్కుడు బిళ్ళ ఆడించిన_
_చెల్లి పెళ్లయి అత్తారింట్లో.._
_ఎవరెక్కడ ఉన్నా_
_ఆ అమ్మ నోముఫలాలే,._
_ఆ నాన్న కలల పంటలే.._
_అదే పేగు..ఒకే తీగ..!_
_మాట పట్టింపులు.._
_ఆస్తి వివాదాలు.._
_శత్రువుల్లా_
_సరిహద్దు గొడవలు.._
_పద్దతి నచ్చలేదని అన్నలు_
_మొగుడు వద్దన్నాడని_ _చెల్లెళ్ళు.._
_రాకపోకలు మానేస్తే.._
_పలకరింపులు వదిలేస్తే.._
_ఒకనాటి అన్నదమ్ములు_ _దాయాదులైపోతే..._
_అన్నాచెల్లెళ్ళు ఆగర్భ_ _శత్రువులుగా మారిపోతే.._
_అక్కడ స్వర్గంలో_
_అమ్మ కంట్లో కలత.._
_నాన్న గుండెలో నలత!_
_మరోజన్మ ఉంటుందేమో.._
_కాని..మరోసారి అదే ఇంట్లో.._
_అదే అమ్మానాన్నల_
_కడుపున పుట్టేవా.._
_ఇలా ఆప్యాయంగా_
_రాఖీ కట్టేవా.._
_ఈ జన్మలోనే ఈ వరస.._
_ఇంతటి గొప్ప బంధాల్ని_
_ఎన్నటికీ కానీయకు కురస..!_
*తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా..*
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
No comments:
Post a Comment