*_“సప్తపది” సినిమా.. ఇందులో నవరసభరితమైన సంగీతం ఉంటుంది. అంతకంటే మించి సామాజిక మార్పు కోసం నిర్మించిన ఒక అద్భుతమైన సినిమా..!!!_*
==================
*ఇంత గొప్ప విప్లవాత్మక సినిమా మరొకటి లేదేమో ! విప్లవం అంటే నరకటం, నరికించుకోవటం కాదు. ఆలోచనల్లో పరివర్తన తీసుకుని రావటం. వినూత్న ఆలోచనా విధానం వైపు సమాజాన్ని నడిపించటం. నిశ్శబ్దంగా, రణగొణ ధ్వనులు లేకుండా సామాజికంగా తెచ్చే మార్పుల్ని విప్లవం అంటారు. విశ్వనాథ్ సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైన సినిమా 1981 లో వచ్చిన ఈ సప్తపది సినిమా. శంకరాభరణం vs సప్తపది..లో నా ఓటు మాత్రం సప్తపదికే...!*
*అసలీ కథను ఆలోచించిన విశ్వనాథ్ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆయన ఆలోచనలు మాటల రూపంలో తర్జుమా చేసిన జంధ్యాలను ఇంకా ఎక్కువగా అభినందించాలి.*
*భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే మాంగల్యబంధాన్ని పక్కన పెట్టి ప్రేమించిన వ్యక్తికి కట్టబెట్టటం అనే ఆలోచన అసాధారణమైన ఆలోచన. ఆ భావాలను మాటల్లో కమ్యూనికేట్ చేయడమంటే కత్తి మీద సామే..! ఆ సామును విశ్వనాథ్, జంధ్యాల అద్భుతంగా చేసారు.*
*ఈ సినిమాను మలుపు తిప్పటంలో రెండు సీన్లు కీలకం. భార్యలో అమ్మవారిని చూస్తున్న మనమడు, మనుమరాలిని ప్రేమించిన దళితుడి వద్దకు పంపటం మీమాంస, తర్జనభర్జన సీన్ యాజులు, రాజు గారి మధ్య. రాజు గారి పాత్రలో అల్లు రామలింగయ్య డైలాగ్ డెలివరీ, నటన సూపర్బ్.*
*శంకర విజయం లోని ఆదిశంకరుడు, ఛండాలుడు తారసపడ్డప్పుడు వారిద్దరి సంభాషణ, ఛండాలుడి కాళ్ళకు శంకరుడు నమస్కరించడం.. డైలాగులు, సీన్ చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది.*
*ఇక రెండవ సీన్ క్లైమాక్సులో మనుమరాలిని పడవ ఎక్కించి ప్రేమికుడితో పంపే ముందు గ్రామస్తులతో జరిగే సంవాదం. ఆ సంవాదంలో యాజులు గారు వర్ణ వ్యవస్థ గురించి, వివాహ ఉద్దేశం గురించి వివరించడం చాలా గొప్పగా చిత్రీకరించారు. విశ్వనాథ్ గారే మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.*
*హిందీలో కూడా విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు. కానీ, హిందీలో ప్రేమికుడితో పంపేందుకు యాజులు గారు ప్రయత్నిస్తుంటే... గ్రామస్తులు గొడవపడి ప్రేమికుడిని కర్రలతో కొట్టి చంపేస్తారు. హీరోయిన్ కూడా చనిపోతుంది. అలా కథను విషాదాంతం చేశారు. బహుశా ఉత్తర భారత ప్రేక్షకులు పునర్వివాహ ఆలోచనని ఆమోదించరనేమో ! హిందీలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, జె.వి. సోమయాజులు నటించారు.*
*ఈ సినిమా విజయంలో మరో ప్రధాన వ్యక్తి శ్రీ కె.వి. మహదేవన్. వారు పాటలకు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతం. అలాగే శేషు నృత్య దర్శకత్వం, కస్తూరి ఫొటోగ్రఫీ... వీటన్నింటిలో ఏది గొప్ప అంటే చెప్పటం కూడా కష్టమే. ప్రతీ పాట, ప్రతీ నృత్యం కళాఖండమే.*
*_"ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః"_ శ్రీ దుర్గా సూక్తాన్ని పెట్టడం, ఆ సూక్తాన్ని ఎలాంటి ఉఛ్ఛారణ, స్వర దోషాలు లేకుండా బాలసుబ్రమణ్యం, జానకమ్మ గార్లు కలసి పాడటం, ఆ సూక్తాన్ని నృత్యరూపంలో చిత్రీకరించటం ప్రతిదీ అద్భుతమే.*
*_"భామనే సత్యభామనే"_ అంటూ కథానాయకి సత్యభామ రూపంలో ఒడియాలు పెట్టడం. విశ్వనాథుడికే చెల్లింది.*
*_"నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ..."_ పాట, నృత్యం చిత్రీకరణను మరచిపోలేం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో షూట్ చేయబడింది. ఒక్కోపాట ఒక్కో మణిపూస.*
*_గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలనా"_ అని సాగే వేటూరి వారి సాహిత్యం అంతా వేదాంతమే. మనిషి అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలోని వేదాంతసారం అంతా ఈ ఒక్క పాటలో ఉంటుంది.*
*అలాగే మరో పాట. _"ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది. మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది."_ ఎంత సంస్కారవంతమైన సాహిత్యం !?*
*_"వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి..," "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం..," "మరుగేలరా ఓ రాఘవా"_ పాటల శ్రావ్యత అనిర్విచనీయం.*
*ఒక్కో పాట మీద ఒక్కో యం. ఫిల్. థీసిస్ వ్రాయవచ్చు. హేట్సాఫ్ టు వేటూరి, విశ్వనాథ్, మహదేవన్, శేషు, బాలసుబ్రమణ్యం, యస్ జానకి, సుశీలమ్మలు. ఈ సినిమా గురించి ఎంత వ్రాసినా తృప్తి కలగదు. ఈ సినిమాలోని నృత్యాల గురించి వ్రాయాలంటే.. నాట్యాచార్యులకు మాత్రమే సాధ్యం అవుతుంది.*
*జె వి సోమయాజులు, అల్లు రామలింగయ్య, రమణమూర్తి, గీరీష్, రవికాంత్, సబిత, డబ్బింగ్ జానకి, సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు. మనమడిగా నటించిన రవికాంత్ అమలాపురంలో తెలుగు లెక్చరరుగా పనిచేసేవారు. గిరీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చారు. సబిత హైదరాబాద్.. అబిడ్సులోని స్టాన్లీ మహిళా కళాశాల విద్యార్ధిని. ఈ సినిమా మా గుంటూరు జిల్లాలోని అమరావతి పుణ్యక్షేత్రంలో షూట్ చేశారు.*
*ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వర్షించాయి. శంకరాభరణం లాగా డబ్బులు వచ్చి ఉండకపోవచ్చు. కమర్షియల్ గా కూడా విజయవంతమైన సినిమాగానే చెప్పవచ్చు.*
*ఓ సినిమా ప్రయోజనం ఆ సినిమా విడుదల అయ్యాక ఓ యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండాలి. మన బుర్రల్ని వెంటాడుతూ ఉండాలి. అలాంటి సినిమా ఈ సప్తపది.*
*ప్రతీ సాంప్రదాయవాది, ప్రతీ ఛాందసవాది, ప్రతీ అభ్యుదయవాది, ప్రతీ ఆలోచనాపరుడు.. తప్పక చూడవలసిన సినిమా. _It's a marvellous message-oriented , revolutionary, musical, visual, literary splendour._ ప్రతీ తెలుగు వాడు గర్వించదగ్గ సినిమా.*
==================
*_{"Telugu Cinima Abhimani".. అనే Facebook group నుండి సేకరించినది: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment