Wednesday, April 9, 2025

 ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథ.

       *********

మక్కెన రామసుబ్బయ్య పౌండేషన్ మరియు సాహితీకిరణం ఆధ్వర్యంలో నిర్వహించిన  సింగిల్ పేజీ కథల పోటీలో బహుమతి పొందిన కథ .(2021)


'అందరూ హిరణ్యాక్షులే!..'

                    ***
రచన: 
ద్విభాష్యం రాజేశ్వరరావు

              ***
మార్చి, 20వ తేదీ. రాత్రి ఏడు గంటలయింది.  మా కాలుష్య నియంత్రణా మండలి జోనల్ ఆఫీస్ లోని  స్టాఫ్ అందరూ ఆరు గంటలకే  వెళ్ళిపోయారు.  'ఆఫీస్ ఇంచార్జ్' అయిన నేను ఒక్కణ్ణీ మాత్రం ఇంకా నా సీటులోనే కూర్చుని, రేపు 'ప్రపంచ అటవీ దినోత్సవం' సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడవలసిన ప్రసంగం తయారు చేసుకుంటున్నాను.
అంతలో హఠాత్తుగా కరెంటు పోయింది .అంతా చిమ్మ చీకటి అయిపోయింది! మా ఆఫీసు కొత్తగా ఈ మధ్యనే ఈ బిల్డింగ్ లో కి మారటం వల్ల జనరేటర్ సదుపాయం ఇంకా లేదు. 

అంతలోనే ఏదో చిన్న అలికిడి.. నా ఎదురుగా  తెల్లని బట్టల్లో ఒక  ముదుసలి స్త్రీ ఆకారం! "ఎవరు నువ్వు ?ఇక్కడికి ఎలా వచ్చావు?"  కాస్త భయంగానేఅడిగాను. 
"నువ్వు నన్ను గుర్తు పట్టలేదా నేను ధరిత్రీ మాతను.."అంది, వణికే స్వరంతో.ఆ ఆకారాన్ని  చూస్తూ ఉంటే నేను ఏదో మత్తులోకి వెళ్లిపోయినట్లుగా అనిపించింది.
" అయ్యో తల్లీ! నువ్వా భూ మాతా..   అలా దీర్ఘ రోగిలా ఉన్నావేమిటి?" అంటూ ఆందోళనగా అడిగాను.
"నేను ఎంతో కాలంబతకను! త్వరలోనే చచ్చిపోతాను!" అంది గద్గద స్వరం తో.
 "అయ్యో తల్లీ! నువ్వు అంత మాటనకు. నిన్ను బతికించుకునేందుకు మేం చేయవలసింది అంతా చేస్తున్నాం ...."అంటూ ఇంకా ఏదో అనబోయేంతలో  "చెయ్యవలసిన నాశనం అంతా చేశారు ... ఇంకా నిత్యమూ చేస్తూనే ఉన్నారు కదా...ఇంకా ఏం చేస్తారు?.. నాకు ఊపిరి  పీల్చుకోటానికి  పరిశుభ్రమైన గాలి దొరకటం లేదు. దాహం తీర్చుకోటానికి కలుషితం కాని నీరు దొరకటం లేదు.తినడానికిరసాయనాలు లేని తిండి దొరకడం లేదు. నా తాపాన్ని తగ్గించి  వాతావరణ సమతుల్యతను కాపాడే చెట్లు రోజు రోజుకి మాయమైపోతున్నాయి.  నావేడిని  నేనే భరించలేక పోతున్నాను . అలనాడు పురాణకాలంలో ఆ దుర్మార్గుడు హిరణ్యాక్షుడు నన్ను చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడు! కానీ ఇవాళ నా మీద బతుకుతున్న మీరందరూ కూడా హిరణ్యాక్షులే!!" అంటూ వలవలా రోదించింది. "తల్లీ! నువ్వలా ఏడవకు నిన్ను పూర్తిగా రక్షించుకునే అన్ని ప్రయత్నాలు నా వంతు నేను చేస్తాను.పర్యావరణాన్ని నాశనం చేసే ఏ రకమైన పరిశ్రమకు ఇకమీదట అనుమతులు ఇవ్వను గాక ఇవ్వను, నన్ను నమ్ము!" అంటూ భూమాతకు నమస్కరించాను.

అంతలోనే కరెంట్ వచ్చింది. నా ఎదురుగా ఎవరూ లేరు! కళ్ళు నులుపుకొని ఇటూ అటూ చూశాను! అంతా ఓ కలలా అనిపించింది!! అంతలోనే, పదివేల ఎకరాల్లో పచ్చని అటవీ భూమిలో, బాక్సైట్ ఖనిజం తవ్వుకునే మైనింగ్ ప్రాజెక్టుకి అనుమతులు జారీ  చేయవలసిన ఫైలు నా ఎదురుగా టేబుల్ మీద ఉన్న సంగతి నాకు గుర్తుకొచ్చింది. ఆ వేలాది ఎకరాల్లో ని వ్రృక్ష సముదాయమే కాకుండా అక్కడి కి వేయబోయే ముఫై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం లో మరికొన్ని వేల చెట్లు తొలగించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును అనుమతి ఇస్తూ సంతకం పెట్టకూడదని అనుకున్నాను.

అంతలోనే ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి "హలో.." అన్నాను. అవతల్నుండి " నేను  మంత్రి గారి పేషీ నుండిసెక్రటరీ రామ్మూర్తి ని  మాట్లాడుతున్నాను. 'బాక్సైట్ ఖనిజం మైనింగ్ కు సంబంధించిన ఫైలు సంతకం అయిందా? లేదా?' అని  మంత్రిగారు కనుక్కో మన్నారు ." అంటూ వినిపించింది.
" నమస్కారం సర్ !  'ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్' ఫైలు చూస్తే అక్కడ  ఆ ప్రాజెక్టుకి అనుమతినివ్వడం ఏమాత్రం సముచితం కాదని, కొన్నివేల వృక్షాలు నాశనమయ్యే పరిస్థితి ఉందని, అందులో పేర్కొన్నారు సార్..
కాబట్టి ..." అంటూ నసిగాను , కాస్త భయపడుతూనే. 
"ఆ ప్రాజెక్ట్  ఎవరిదో తెలుసునా.. మన మంత్రిగారి  వియ్యంకుడిది..ఫైలు క్లియర్ చేస్తూ సంతకం పెట్టిన కవరింగ్ లెటర్ కాపీ రేపు ఉదయం పదోగంటకల్లా నా మెయిల్లో ఉండాలి.లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోగలరనుకుంటాను"అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడి ఫోన్ కట్ చేశాడాయన.
కొంత సేపు అప్రతిభుడనై ఉండిపోయాను. తర్వాత మెల్లగా టేబుల్ మీదిమైనింగ్ ఫైల్ అందుకుని 'ధరిత్రీ మాతా.. నన్ను క్షమించు! నేనూ మరో హిరణ్యాక్షుడినే!' అని గొణుక్కుంటూ, ఫైల్ తెరిచి వణికే చేతితో 'ప్రాజెక్టు క్లియర్ డ్' అని రాసి సంతకం చేశాను!!

**********************

No comments:

Post a Comment