Tuesday, April 8, 2025

 **ఇద్దరు స్నేహితులు ఎడారిలో నడుస్తున్నారు. సాత్విక్ - సాకేత్ వారి పేర్లు. ఇద్దరి మధ్యా ఏదో చర్చ తారాస్థాయికి చేరింది. 

సాకేత్ చెపుతున్న దాన్ని సాత్విక్ ఖండించాడు. సాకేత్ అభిప్రాయంతో ఏకీభవించనన్నాడు. కోపం వచ్చింది సాకేత్ కి, లాగి లెంపకాయ కొట్టాడు.

సాత్విక్ కి చెంప అదిరిపోయింది.
 కన్నీళ్ళొ చ్చాయి అతనికి. అయినా సాకేత్ ని ఏమీ అనలేదు. 

🌿పైగా ఇసుకలో ఇలా రాసాడు.
"నా ప్రాణ స్నేహితుడు నన్ను కొట్టాడు."

కాస్సేపటికి కోపాలు, బాధలు తగ్గి మళ్ళీ ఇద్దరూ నడక సాగించారు.

ఒయాసిస్సు దగ్గరికి చేరారు. నడిచి నడిచి అలసిపోయి ఉన్నారేమో! 

ఒయాసిస్సుని చూస్తూనే ఇద్దరికీ స్నానం చేయాలనిపించింది. ఒకరి మీద ఒకరు నీరు చిమ్ముకుంటూ సరదాగా సంతోషంగా స్నానం చేయసాగారు. 

సాకేత్ మీద నీరు చిమ్ముతూ వెనక్కి వెనక్కి నడిచి ఊబిలోకి దిగిపోయాడు సాత్విక్.

పైకి వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. 

సాకేత్ అప్పుడు సాత్విక్ చేయి అందుకున్నాడు. ఊబిలోంచి పైకి లాగి, రక్షించాడతన్ని. 

🌿ఒయాసిస్సు నుంచి బయటకి వచ్చి, అక్కడో రాయి ఉంటే దాని మీద ఇలా చెక్కాడు సాత్విక్.

"నా ప్రాణ స్నేహితుడు నన్నీ రోజు రక్షించాడు."

ఇందాక ఇసుకలో రాసిందీ, ఇప్పుడీ రాయి మీద చెక్కిందీ చూసాడు సాకేత్. అప్పుడడగలేదు కాని, ఇప్పుడడిగాడు. 

👉"అక్కడ ఇసుకలో రాసి, ఇక్కడ రాయి మీద ఇలా రాయడంలో నీ ఉద్దేశం?"

🌿"ఉద్దేశం ఏమిటంటే... మనల్ని బాధించిన వారి గురించి ఇసుకలోనే రాయాలి. ఎందుకు రాయాలంటే క్షమించడం అనే గాలికి ఆ అక్షరాలు చెరిగిపోతాయి. ఏదీ గుర్తుండదు. హాయిగా ఉంటుందప్పుడు. 

🌿అదే మనల్ని కాపాడిన వారి గురించి రాయి మీదే రాయాలి. గుర్తుండిపోవాలెప్పుడూ. ఎలాంటి కాలానికీ, గాడ్పులకీ కృతజ్ఞతనే ఈ శిలాక్షరాలు చెరిగిపోకుండా ఉంటాయి." అన్నాడు సాత్విక్. 

సాకేత్ అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు.🍁

No comments:

Post a Comment