ఇంతకు మించి ఈ దినాన శుభాకాంక్షలు ఎందుకట ?
మహిళా దినోత్సవం.
ఎప్పట్లానే తెల్లారింది.
పాపం సూరీడు కూడా తూర్పునే ఉదయించాడు.
రాత్రి తాగొచ్చిన మొగుడు
తెల్లార్లూ చేసిన యుద్ధానికి
కళ్ళూ, ఒళ్ళూ మండిపోతున్నా ..
అమ్మగార్లు ఆలీసెమైతే ఊరుకోరని
అదరాబదరా పాచి పనులకు పరుగెత్తింది లచ్చిమి.
వాకిట్లో బొచ్చుకుక్క,
పడకింట్లో మొగుడూ
రెండూ స్టేటస్ సింబల్ గా ఫీలయ్యే
మహిళా శిరోమణి, పేదల పెన్నిధి,
ఉమనాఫ్ ది ఇయరూ ఇలా కొని తెచ్చుకున్న బిరుదులూ
కొత్తగా అమెరికానుండి తెప్పించిన ప్లాటినం నగలూ తగిలించి
ఎర్రని లిప్స్టిక్ పెదాలను ముద్దుగా మరోమారు అద్దం లో చూసుకొని
క్లబ్బులో మహిళా దినోత్సవ సెలెబ్రేషన్స్ కోసం రేంజ్ రోవరు కారెక్కింది అవని.
నాలుగింటికే లేచి అందరి అవసరాలూ చూసి
బడికి పోయే పిల్లలకీ,
ఆఫీసులకు పోయే మొగుడికీ, తనకీ బాక్సులు సర్ది, పిల్లలను స్కూల్ బస్సులెక్కించి మొగుణ్ణి లేపి కాఫీ ఇచ్చి, టిఫిను టెబుల్ మీద పెట్టి కాఫీ గుక్కతో సరిపుచ్చుకుని ఉరుకులు పరుగులతో సిటీ బస్సెక్కింది మైధిలి.
ఏసీ రూముల్లో అర్ధరాత్రి వరకూ ఆగకుండా పనిచేసి
పగలూ రాత్రీ, ఎండావానా, రుతువులూ కాలం మరిచిపోయి
మధ్యహ్నం దాకా నిద్దరోయి
స్విగ్గీలో పిజ్జా తెప్పించుకుని తినేసి కాల్ కి ఆదరాబాదరాగా అటెండయ్యింది స్వాతి.
పొద్దుపొద్దుటే పొద్దుపొడుపు తోనే లేచి అంతర్జాలపు మాయా నగరిలో తిరుగుతూ
అన్ని తలవాకిళ్ళ తలుపులు తడుతూ శుభోదయాలూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలూ చెబుతూ, అక్కయ్య,చెల్లెమ్మా, పిన్నమ్మా, పెద్దమ్మా మిత్రమా లాంటి కబుర్లతో ...
ఓ మహిళా..ఆహా! ఓ పడతీ ఓహో! ఓ సుదతీ ఓహోహో! అంటూ నాలుగు కవితలు వదిలి, జ్వరంతో మూలుగుతూ పడుకుని ఉన్న పెళ్ళాన్ని "దేభ్యం మొహవా..ఏవిటా మూలుగు ? లేచి తొందరగా కాఫీ కలిపి చావు" అంటూ మహిళా దినోత్సవాన్ని సుసంపన్నం చేస్తున్నాడో పెద్దమనిషి.
మొదటి బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఖరీదైన సెంటు కొట్టుకుని, రెండో బాయ్ ఫ్రెండ్ చేత షాపింగ్ చేయించిన టిస్సాట్ వాచ్ పెట్టుకుని, మూడో బాయ్ ఫ్రెండి ఇచ్చిన గూగుల్ సెల్ చేత పట్టుకుని నాలుగో బాయ్ ఫ్రెండుని వెతకడానికి చూపుల గాలం సిద్ధం చేసుకుని,"అమ్మా ! ఫ్రెండింటిదాకా వెళ్ళొస్తా" అని అమ్మ అనుజ్ఞ తీసుకుని మరీ బైలుదేరింది అనన్య.
భయం భయంగా..పుస్తకాలు చేత పుచ్చుకుని అదిరే గుండెలతో, వణికే కాళ్ళతో బస్టాప్ వైపుగా నడక సాగించింది శ్రీలక్ష్మి. వారం రోజులుగా ప్రేమించమంటూ వెంటపడుతున్న కలవారి అబ్బాయి కౌశిక్ కళ్ళలో కనబడుతున్నాడామెకు. నిన్న సాయంత్రం ఎదురుపడి ..."ఏం వేషాలేస్తున్నావా ? అందగత్తెనని పొగరా ? రేపు ఏ సంగతీ చెప్పకపోతే అందాల మొహం కాల్చిన అప్పడంలా చేసేస్తా" నంటూ అతగాడు జేబులోనుంచి తీసి చూపించిన యాసిడ్ బాటిల్ గుర్తొస్తోంది ఆమెకు. అమ్మాకూ, నాన్నకు చెబితే చదువు మానేయమంటారేమోనన్న భయం మరి.
అమ్మా! నువ్వే స్కూలుకి వచ్చి దింపు. లేకపోతే నేను బడికి వెళ్ళనే. తల్లిని పట్టుకుని ఏడుస్తోంది ఏడేళ్ళ పిల్ల నవ్య. నేను ఫాక్టరీకి వెళ్ళాలి. పక్కింటి అన్న రోజూ దింపుతున్నాడుగా వెళ్ళు గదమాయిస్తోంది తల్లి. ఫాక్టరీ బాయిలర్ పేలి మొగుడు చనిపోతే దొరికిన ఏకైక జీవనాధారం. ఆలీసెమైతే ఆ కాస్తా పోతుందేమోనని భయం. నవ్వుతూ వాకిట్లో నిలబడ్డ పక్కింటి అన్న తనను ఎక్కడెక్కడ తడుముతున్నాడో.. వేటిని చిదుముతున్నాడో తల్లితో చెప్పడానికి చేతకాక ఏడుస్తూ తల్లితో తన్నులు తింటోంది నవ్య.
పత్తి చేలో కలుపు తీస్తూ "పురిటికి వచ్చిన బిడ్డకి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటగా" అని ఎక్కెసెక్కాలాడుతున్న సాటివాళ్ళకు "అవునొదినా మళ్ళీ లచ్చిందేవే" అని నవ్వుతా సమాధానమిచ్చినా బిడ్డ పుట్టి మూణ్ణెలయినా చూడటానికి రాని అల్లుణ్ణి తలుచుకుని నిట్టూరుస్తూ. తను చేసిన పనే మగాడు చేస్తే నాలుగొందలూ, ఆడ కూలీకి మూడొందలూ ఇచ్చిన కాంట్రాక్టరుని ఏమీ అనలేక ఇచ్చిన డబ్బు పుచ్చుకుని గమ్మున వెనుదిరిగింది రాములమ్మ.
ఖరీదైన కార్లలో బిలబిల మంటూ ఆశ్రమంలోకి దిగిపోయి, అక్కడి ముసలీ ముతకా అందరినీ కావలించుకుని, తలా రెండు పళ్ళూ, బిస్కెట్ పాకెట్లూ చేతిలో పెట్టి, సెల్ఫీలు తీసుకుంటూ సెలెబ్రేటింగ్ విమెన్స్ డే అంటూ ఫేస్ బుక్కుల్లోకీ, వాట్స్అప్ లోకీ వాళ్ళ దాతృత్వపు గొప్పదనాన్ని పంచుతున్న మహిళా బృందాన్ని చూస్తూ ఓ మూలన భయంగా తలొంచుకుని కూర్చుంది సరస్వతమ్మ. సంఘంలో గొప్పవాడూ, దానశీలి అని పేరు తెచ్చుకున్న తన కొడుకు తనను ఇక్కడ పడేశాడని ఎవరికైనా తెలిస్తే.. కొడుకు పరువు పోతుందేమోనని ఆలోచిస్తూ ఉంది ఆ పెద్దావిడ.
ఎప్పట్లా సూరీడు పడమటే అస్తమించాడు.
పగలంతా స్లమ్ ఏరియాల్లో తిరిగి, మహిళా సాధికారత గురించి మాట్లాడి ఫోటోలకు పోజులిచ్చి అలిసిపోయి, తాజ్ బంజారాలో సఖులతో లంచ్ చేసి, చెరిగిపోయిన మేకప్ మళ్ళీ వేసుకోవటానికి కాస్త విరామం తీసుకుని, సాయంత్రం క్లబ్బులో గృహ హింస గురించీ, మహిళల గొప్పతనం గురించీ మాట్లాడి అలిసిపోయి షాంపేన్ తో గొంతు తడుపుకుంది అవని.
దారిలో తెగిపోయిన చెప్పు చేతిలో పెట్టుకు నడుస్తూ పొద్దున ఇల్లూడుస్తూ టివీలో తను చూసిన మహిళా దినోత్సవం గుర్తొచ్చి నిట్టూర్చింది లచ్చిమి. ఈ ఒక్కనాడన్నా తనకు సెలవిచ్చింది లేదు, చాకిరీ తప్పింది లేదు అనుకుంటూ.
ఆఫీసులో కనిపించిన వాళ్ళందరూ "హాపీ ఉమన్స్ డే మేడం" అంటే చిరునవ్వుతో థాంక్యూ చెప్పి కేకులు కట్చేసి సంబరాలు జరిపి ఆఫీసు పని ముగించి ఇంటికొచ్చి పడి, కాసిని కాఫీ తాగి పిల్లల హోంవర్కులు చూసుకుని వంటపనిలో పడిపోయింది మైధిలి.
బాయ్ ఫ్రెండు బైకు ముందు వీధిలోనే ఆపించి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తున్న అనన్యని తల్లి "ఇంత లెటయ్యిందేం?" అని గద్దిస్తే.. ముగ్గురు కుర్రాళ్ళు వెంటబడ్డారనీ తప్పించుకొచ్చేసరికి తలప్రాణం తోకకు వచ్చిందనీ కబుర్లు చెబుతోంది.
పిల్ల ఎంతకీ ఇంటికి రాలేదని ఏడుస్తూ పోలీస్ స్టేషనుకు వెళ్ళిన తల్లిదండ్రులకు. "ఏం చిన్నపిల్ల కాదుగా ఎవడితోనో పొయుంటుంది" అని సమాధానం ఇస్తున్నాడు ఇన్స్పెక్టరు.
ఫాం హౌస్ లో కాళ్ళూ చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి ఫ్రెండ్స్ తో ఆ పిల్లను సామూహికంగా ఎంజాయ్ చేస్తున్నాడు కలవారబ్బాయి కౌశిక్.
శిధిలమైన పాత బంగళాలో చిదిమివేయబడ్డ పసితనం ప్రాణాలు కోల్పోయి "ఇంక ఈ భూమిమీద నన్ను ఆడపిల్లగా పుట్టించకు దేవుడా" అని దేవుని పాదాలచెంత పడి ఏడుస్తోంది. చిట్టితల్లి కనపడక అందరిళ్ళకూ తిరుగుతూ మా పాపను చూశారా అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతోంది ఆ కన్నతల్లి. తోడుగ పక్కింటి "అన్న" కూడ సాయం వచ్చాడు పాపం.
అంతరిక్షంవరకూ అభివృద్ధి చెందిన ఆడజాతి అంటూ నాలుగు పుస్తకాలు చూసి ఒక గొప్ప వ్యాసం రాసేసి స్రీ జాతికి తను చేసిన గొప్ప మేలు గురించీ, దానికి వచ్చిన లైకులూ కామెంట్ల గురించీ తలుచుకుని తన జబ్బలు తనే చరుచుకున్నాడు అంతర్జాల స్త్రీ సముద్ధరణ పండితుడొకడు.
ఆడబిడ్డ పుట్టిందని మూణ్ణెల్లయినా రాలేదని బాధపడుతున్న బిడ్డకి, ఏం బాధ పడమాక కాయకష్టం చేసుకుని పిల్లలని పెంచుకుందాం. మీ అయ్య లేకపోయినా కాయకష్టం చేసి నిన్ను పెంచుకోలా.. అట్టాగే నీకు నేను తోడుగా ఉంటా అని కూతుర్ని భుజం తట్టి ఓదారుస్తోంది రాములమ్మ.
మరునాడు మామూలుగానే తెల్లారింది. సూర్యుడు తూర్పునే ఉదయించాడు. న్యూసు పేపర్లలోనూ, టీవీల్లోనూ అద్భుతంగా జరిగిన మహిళా దినోత్సవ సంబరాలు అంటూ హెడ్ లైన్స్ వచ్చాయి.
*పద్మజ* *కుందుర్తి* .
No comments:
Post a Comment