*💎 నేటి ఆణిముత్యం 💎*
అరయ నాస్తియనక యడ్డు మాటాడక:
అరయ నాస్తియనక యడ్డు మాటాడక
తట్టువడక మదిని తన్నుకోక
తనది గాదనుకొని తా బెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినురవేమ!
*తాత్పర్యం:*
లేదని చెప్పకుండా, అడ్డంగా మాట్లాడకుండా, సంశయం లేకుండా, ఇస్తున్నది తనదనే భావన లేకుండా ఇచ్చేదే నిజమైన దానం.
పుణ్యకార్యాల్లో దానానికి మన సాంప్రదాయాల్లో ప్రాముఖ్యతనిచ్చారు కాబట్టి గుడిలోంచి వస్తూనే బయట ఉన్న బిచ్చగాళ్ళందరికీ ఇవ్వటం కోసం ప్రత్యేకంగా చిల్లర తెచ్చుకుని చేతిలోపట్టుకుని ఇచ్చుకుంటూ పోతారు కొంతమంది. ఇవ్వకపోతే ధర్మం బాబూ అంటూ మీ ధర్మాన్ని మీకు గుర్తు చేస్తారు వాళ్ళు. జేబులోంచి తీసి ఇచ్చినా, ఎదటివాళ్ళ మీద జాలి, దయ లేకపోయినా వాళ్ళకి ఇచ్చేస్తే దూరంగా వెళ్ళిపోతారు కదా అని ఈసడించుకుంటూ ఇచ్చేవాళ్ళు మరికొంతమంది. అన్నిటికన్నా ముఖ్యమైంది మరొకటుంది-
ఒక పెద్ద మనిషి తన ఆస్తినంతా దానధర్మాలకిచ్చి గురువుగారి ఆశ్రమానికి పోయి, "స్వామీ నేను అంతా ఇచ్చేసాను" అని చెప్పాడట. ఏమిటీ, అని గురువుగారు అడిగితే, "నేను నా ఇల్లు, ఆస్తి, డబ్బు దస్కం, సంపదనంతా అందరికీ పంచిపెట్టేసా"నని చెప్పాడట. ఏమిటీ ,అని మళ్లీ అడిగారట గురువుగారు. మళ్లీ ఓపిగ్గా అంతా చెప్పాడట. గురువుగారు మళ్ళీ మళ్ళీ అడిగితే అలాగే తన సంపదనంతా ఇచ్చేసానని చెప్తూ పోతే, చివరకు ఆ గురువుగారు, "నాయనా నేను, నాది, ఇచ్చాను, అనే భావనలు పొయ్యేంత వరకూ నీకు ఆ ఫలితం దక్కదు" అని చెప్పారట. అలాగే వేమనాచార్యులు కూడా, ఈ పద్యంలో, "తనది కాదనుకొని తను పెట్టునదే పెట్టు" అని చెప్పారు.
"ఈ బిచ్చగాళ్ళదంతా వ్యాపారం. వీళ్ళు చాలా దాచుకునుంటారు. అందులోంచి వడ్డీలకు కూడా తిప్పుతుంటారు" అని అంటూ ఒకతను వాళ్ళను తప్పించుకుంటూ పోతుంటే, అతని మిత్రుడు చెప్పాడట "చూడు, నువ్వన్నట్టు వీళ్ళకి ఎంతో సంపద ఉన్నా, ఇలాంటి బట్టలు వేసుకుని, ఇలాంటి చోట కూర్చుని, ఇలా ప్రతి అడ్డమైన వాళ్ళ ముందూ చేయిజాచి అడుగుతున్నారే, అందుకోసమైనా జాలిపడి ఇవ్వవచ్చు" అని అన్నాడట.
అన్నిటికన్నా ప్రధానమైంది ఒకటుంది. అది అద్వైత భావనలో వస్తుంది. ఏ సంపదా ఎవరిదీ కాదు. వీటన్నిటికీ కర్త దేవదేవుడే. అందుకే 'కలవాడు' అని రెండు అర్థాలతో చెప్తారు. 'కలవాడు' అంటే సంపద కలగినవాడు అని అర్థం. మరో అర్థంలో, "అసలు ఉన్నదంతా ఆ చైతన్యమే. మరేమీ లేదు. మనకి కనిపిస్తున్నదంతా ఆయన రూపాంతరమే" అని తెలుసుకున్నప్పుడు 'ఇది నాది నేను ఇస్తున్నాను' అనే భావన రాదు. ఈ లోపులో, ఆ ఙానం సంప్రాప్తించే లోపులో ఇలాంటి పద్యాలే మనకు మార్గదర్శనమిస్తూ, మన చేతలను సరిదిద్దుతుంటాయి.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
No comments:
Post a Comment