*అవతార్ మెహర్ బాబా - 64*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*పశ్చిమ దేశాలకు ప్రయాణం*
15.02.56వ తేదీ నుండి ప్రారంభించిన ఏకాంతవాసంలోనే ఒక నెల విరామం తీసుకొని బాబా పశ్చిమ దేశాలలో పర్యటించడానికి వెళ్ళారు. పాశ్చాత్య ప్రేమికుల కోరికను మన్నించారు. 16.07.56వ తేదీన బాబా ఆదీ. కె. ఇరానీ, డా. నీలు, ఈరుచ్, మెహెర్జీ అను నలుగురు మండలి సభ్యులతో బొంబాయి లో శాంతాక్రూజ్ విమానాశ్రయంలో బయలుదేరి 17.07.56 సాయంత్రం లండన్ లో దిగారు. పలువురు బాబా ప్రేమికులు బాబాకు స్వాగతం పలికారు. లండన్ లో బాబా ప్రేమికుల సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొని తన పని అంటే ఏమిటో తెలియజేసే ప్రసంగ పాఠం వారికిచ్చారు. 01.03.54 తేదీన రాజమండ్రిలో బాబా కార్యకర్తల సమావేశంలో ఇచ్చిన సమావేశాన్ని ఇది తలపిస్తుంది. వారి అభిప్రాయ భేదాలను బాబా సరిచేసారు. రెండు రోజులు లండన్ లో ఉండి అక్కడికి వచ్చిన పలువురు ప్రేమికులకు, దర్శనార్థులకు వ్యక్తిగతం గాను, సామూహికంగాను దర్శనాలిచ్చి 19వ తేదీ సాయం కాలం లండన్ నుండి బయలుదేరి బాబా అమెరికా వెళ్ళారు.
ఎందరో ప్రేమికులు బాబాకు స్వాగతం చెప్పడానికి న్యూయార్క్ విమానాశ్రయా నికి వచ్చారు. 1952 తర్వాత అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత బాబా అమెరికాకి వచ్చారు. ఇది ఆయన అమెరికాకు రావడం ఐదవసారి. ఐక్యరాజ్య సమితికి వచ్చిన యూక్రేనియా దేశపు ప్రతినిధి ఒకరు విమానాశ్రయంలో బాబా తన ప్రేమికులను కలిసే దృశ్యాన్ని చూచి 'ఆయన ఎవరు? ఆధ్యాత్మిక నాయకుడా! కస్టమ్స్ కార్యాలయం నుండి రాగానే ఒక్కొక్కరుగా అందరినీ పలకరించి కలిసాడే! ఎంత ఆశ్చర్యము. నా జీవితం లో చూచిన గొప్ప వారందరిలోను ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని నేను చూడలేదు' అని చెప్పాడు.
సూఫీయిజమ్ బృందానికి ఆధిపత్యం వహించిన ఐ. వి. డ్యూస్, మిర్టిల్ బీచ్ కేంద్రానికి బాధ్యత వహించిన ఎలిజబెత్ పాటర్సన్ లు బాబా పర్యటనకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆతిధ్య సంఘానికి అధ్యక్షురాలైన మేరియన్ ఫోర్ హీమ్ బాబా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసింది. 23.07.56 వరకు న్యూయార్క్ లో ప్రేమికులకు, వ్యక్తిగతంగా సామూహికం గాను దర్శనాలిచ్చి బాబా 24.07.56వ తేదీన మిర్టిల్ బీచ్ కి ప్రయాణమై వెళ్ళారు. న్యూయార్క్ లో పత్రికా విలేఖరులతో సమావేశం జరిపారు. మిర్టిల్ బీచ్ సెంటర్ లో బాబా 6 రోజులు గడిపి అందరికి తన సహవాస భాగ్యాన్ని కలుగజేసారు. ఒక రోజు ఎన్.బి.సి. టి.వి. వారికి బాబాతో సంభాషణ ఏర్పాటు చేసారు. ఆ రోజు కార్యక్రమాన్ని వారు ఫిల్మ్ తీసారు.
మిర్టిల్ బీచ్ నుండి బాబా లాస్ ఏంజిల్స్ వెళ్ళి ఒక రోజు మెహెర్ మౌంట్ లో సహవాస కార్యక్రమం ఏర్పాటు చేసారు. లాస్ ఏంజిల్స్ నుండి బాబా శాన్ ఫ్రాన్సిస్ స్కోకు వెళ్ళారు. అక్కడ బాబా ప్రేమికులకి క్రొత్తవారికి తన దర్శనం ఇచ్చారు. ప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు. అమెరికాలో ఆయన గడిపిన రోజుల్లో ఎన్నో సందేశాలు ఇచ్చారు. ఎందరి హృదయాలనో తన ప్రేమతో ప్రభావితం చేసారు.
శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరి బాబా 09.08.56 తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ లో దిగారు. ఇది ఆస్ట్రేలియాకు బాబా తొలి రాక. బాబా బీకన్ హిల్స్ పైన నిర్మించిన మెహెర్ ఎబోడ్ అనే కేంద్రంలో సమావేశమై న అందరినీ కలుసుకొన్నారు. పిల్లలతో కొంతసేపు ఆడుతూ గడిపారు. అక్కడి నుండి బాబా మెల్బోర్న్ పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రేమికులు ఓబ్రయన్ దంపతుల గృహాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా దర్శనం కోసం తపించే ప్రేమికులకు తన దర్శనభాగ్యం కలుగజేశారు. బాబా ప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు. మెల్బోర్న్ నుండి మళ్ళీ సిడ్నీకి వెళ్ళి అక్కడి నుండి 17.08.56 తేదీన బొంబాయికి చేరుకొని అక్కడి నుండి సతారాకు వెళ్ళారు. 1956 సంవత్సరంలో బాబా మస్తుల సాంగత్యం కోసం అనేక పర్యటనలు చేసారు.
📖
*రెండవ మోటారు ప్రమాదం*
అమెరికాలో బాబాకు 24.05.52 తేదీన 'ఓహాయ్' వద్ద కారు ప్రమాదం జరిగింది. ఆయన తన రక్తాన్ని అమెరికా భూమిపై చిందించారు. 02.12.56 ఆదివారం నాడు భారత భూభాగంపై రెండవ ప్రమాదం జరిగింది. బాబా పూనాకు వెళ్ళి మళ్ళీ సతారాకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఈరుచ్ కారు నడుపుతున్నాడు. ఈరుచ్ బాబాను కారులో చాలా దూర ప్రయాణాల కు తీసుకొని వెళ్ళి 10,000 మైళ్ళకు పైగా కారు నడిపి సమర్థుడైన డ్రైవర్ అనిపించుకున్నాడు.
సతారాకు 14 మైళ్ళ దూరంలో ఉడతారా అనే గ్రామ సమీపానికి మామూలు వేగం తోనే కారు వచ్చింది. రోడ్డు పైన ఎదురుగా మనుషులు గాని ఇతర వాహనాలు గాని ఏవీ అడ్డుగా రాలేదు. ఏకారణం లేకుండానే కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన కట్టిన వంతెన గోడకు ఢీకొంది. ఆ కారులో ఆసీనుడైన బాబా ఇచ్ఛ ప్రకారమే జరిగే దానికి ఏ కారణం కావాలి? కారు ఆ ప్రక్కనే గల గోతిలో పడిపోయింది. అప్పుడు సమయం సాయంత్రం గం. 5.15 ని.లు. ఆ తర్వాత ఆ దారిలో పూనా వెళ్తున్న ఒక వ్యక్తి తన కారులో బాబాను, విష్ణుమాస్టర్ ని సతారాకు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన లారీలో ఈరుచ్, పెండు మరియు డా. నీలును సతారాలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. నీలు ఈ ప్రమాదంలో మరణించాడు. అతని కోరిక ప్రకారం అతడు బాబాతో ప్రయాణం చేస్తూ బాబా సాన్నిధ్యంలో మరణించాడు. ఈరుచు, పెండూకు బాగా గాయాలయ్యా యి. బాబాకు తలకు, ముఖానికి గాయాలు అయ్యాయి. నాలుక తెగిపోయింది. కుడి తొడపై భాగంలోని ఎముక విరిగిపోయింది. సతారాలో చేయవలసిన చికిత్స చేసి తర్వాత పూనాకు తీసుకొని వెళ్ళారు. తనను భరించే బాధ గురించి బాబా ఇలా చెప్పారు.
'మానవులు వారి కర్మ ప్రకారం పడవలసి నంత బాధపడతారు. కొందరు ఇతరులకై బాధపడతారు. సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు'. ప్రమాదాలు గాని ఇతర కారణాల వల్ల గాని అవతారుడైన బాబా శారీరకం గాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను మానవ శ్రేయస్సు కోసమే బాధపడతాడనేది స్పష్టం. బాబా తనకు తగిలిన గాయాలవల్ల కలిగే బాధను గురించి చెప్పుతూ 'హంగేరీ ప్రజలు ఈ మధ్యన ఎంతో బాధపడ్డారు. చాలామంది గాయపడి చూసే దిక్కులేక రోడ్డుపై పడిపోయి ఉన్నారు. మందులిచ్చేవారు. వారికోసం బాధపడేవారు, వారిని ప్రేమించే వారు ఎవరూ దగ్గర లేరు. నేను పరుపుపై పడుకొని యున్నాను. సేవలు చేయడానికి సన్నిహిత ప్రేమికులంతా ఉన్నారు. నా పరిస్థితి వారితో పోలిస్తే ఎంతో నయం' అన్నారు.
ఈ సమయంలోనే ఒకసారి బాబా విరిగిన తుంటి ఎముక వద్ద ఒక సర్కిల్ ఆకారంలో వ్రేలితో సూచించి, 'ఈ చోటులోనే నేటి విశ్వం యావత్తు పడే బాధ కేంద్రీకృతమై ఉంది. నేననుభవించే విశ్వవ్యాప్తమైన బాధకిది బాహ్యంగా కనపడే స్వల్ప 'సంఘటన మాత్రమే' అని చెప్పి ' అయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే
అది నేను కావాలనుకున్నట్లుగానే జరిగింది' అన్నారు.
పూనాకు వెళ్ళే సమయంలోనే బాబా ప్రమాదం జరిగే స్థలం వద్ద కారు ఆపి ఆ స్థలాన్ని కొంతకాలం క్రిందట తాము క్రికెట్ ఆడిన స్థలమని తన మండలి వారికి చూపించారు. కాని ప్రమాదం జరిగిన తర్వాత గాని అసలు విషయం వారికి తెలియలేదు. ఆ తర్వాత డిసెంబర్ మాసం 21. 27 తేదీలలో బాబాకు ప్రీతిపాత్రులైన గాడ్గే మహారాజ్, ఆలీషా అనే మస్తు మృతి చెందారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment