Wednesday, August 13, 2025

 *నిజమైన మరణం కంటే ముందుగానే మరణ భయం మనల్ని చంపేస్తుందని మనకు తెలుసా?*


*జీవించడంలోని కళ...కథ*


ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. తన స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అతను వ్యాపారం చేసేవాడు. పడ్డ శ్రమ ఫలించడంతో అతను బాగా సంపాదించాడు, త్వరలోనే అతని పేరు నగరంలోని పెద్ద వ్యాపారులలో లెక్కించబడ సాగింది. ఒక రాజభవనాన్ని నిర్మించుకుని, అంగరంగ వైభవంగా, తన కుటుంబ సమేతంగా నివసిస్తూ, అతని  జీవితం ఇలా చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంది.

ఒక రోజు, అతని బంధువులలో ఒకరు మరొక నగరం నుండి వచ్చాడు. సంభాషణ మధ్యలో, తన నగరం యొక్క అత్యంత సంపన్నమైన వ్యాపారి మరణించాడని అతను చెప్తూ, ఆ అభాగ్యుని ఆస్తులు, లక్షల విలువ చేసే ఆస్తి అంతా కూడా పనికిరాకుండాపోయిందని చెప్పాడు.

ఈ విషయం అతను చాలా మామూలుగా ప్రస్తావించాడు, కానీ అది వ్యాపారి మనస్సును తీవ్రంగా కదిలించింది. ఆ వ్యాపారిలాగే తాను కూడా ఏదో ఒకరోజు చనిపోతానని అనుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచి మృత్యుభయం అతన్ని వెంటాడడం ప్రారంభించింది. 
మృత్యువు వస్తుందని, తనని తీసుకెళ్లిపోతుందని, సంపాదించినదంతా  ఇక్కడే ఉండిపోతుందన్న ఈ ఆలోచన అతని మనసును వదలలేదు. ఆ ఆందోళన కారణంగా వ్యాపారి కృశించిపోవడం ప్రారంభించాడు.

చూసేవాళ్ళకి తనకి ఏ లోటు లేకపోయినట్లనిపించినా, తనలోని బాధ మాత్రం ఎవరికీ చెప్పుకోలేనిది. క్రమంగా, మరణం గురించిన ఆలోచన అతని శరీరాన్ని ఆక్రమించడం ప్రారంభించింది, దీనివల్ల వ్యాపారవేత్త చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఎంత వైద్యం చేయించినా జబ్బు తగ్గకపోగా ఇంకా ముదిరిపోయింది. 

ఒకరోజు అతని ఇంటికి ఒక సాధువు వచ్చాడు. వ్యాపారి సాధువు పాదాల వద్ద ఏడుస్తూ కూర్చుని తన బాధలన్నింటినీ వివరించాడు.
వ్యాపారి కష్టాలు విన్న తర్వాత ఆ వ్యాధికి కారణమేమిటో అర్థం చేసుకుని, సాధువు నవ్వాడు. "నీ జబ్బుకి నివారణ చాలా తేలిక", అని అన్నాడు.

వ్యాపారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయ్యింది. అతను అసహనంగా ఇలా అడిగాడు, "మహాశయా, ఆ నివారణ ఏమిటి?"
సాధువు ఇలా చెప్పాడు.. "చూడండి,రాబోయే ఏడు రోజులు మీరు ఒక మంత్రాన్ని పఠించండి.
*జీవితం ఒక అమూల్యమైన బహుమతి.నేను ప్రతీ క్షణం దానిని జీవిస్తాను*

ఏడు రోజులు, ఉదయం, సాయంత్రం, వీలైనప్పుడల్లా మీ మనస్సులో దీన్ని పునరావృతం చేయండి. మీరు ఎంత ఎక్కువ పునరావృతం చేస్తే, మీరు అంత త్వరగా బాగుపడతారు. నేను వచ్చే వారం మళ్ళీ వస్తాను."

ఏడు రోజుల తర్వాత సాధువు అక్కడికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ముఖఛాయ  ప్రకాశవంతంగా మారిపోయి, అతను ఆనందంతో ఉన్నట్లు గమనించాడు.

సాధువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు: "మహాశయా, మీరు నన్ను రక్షించారు! మీ మంత్రం నాపై చాలా ప్రభావం చూపింది. అసలైన మృత్యువు వచ్చిన రోజు మాత్రమే నేను చనిపోతానని అర్థం చేసుకున్నాను. దాని కంటే ముందు ప్రతీ క్షణం, నేను కేవలం మనస్ఫూర్తిగా జీవిస్తాను. మీ నిర్దేశించిన చికిత్సలో ఇంద్రజాలం ఉంది."

సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, 
*"మన ఆలోచనలలో మాయాజాలం ఉంది, మనకు జీవించాలనే ఆలోచన ఉంటే, మన జీవితంలోని ప్రతి క్షణం ఉల్లాసంగా మారుతుంది,  మనం మరణం గురించి ఆలోచించినట్లయితే, మనం నిజంగా మరణం సమీపించక ముందే చాలాసార్లు చనిపోతాం".*

*ప్రతి క్షణం మన ఆలోచనలను దైవత్వంతో అనుసంధానం చేస్తే, ప్రతి క్షణం మనం దైవత్వం వైపుకు వెళ్తాం. ఇది జీవించడంలో ఉన్న కళ. మన ఆలోచనలే మన విధిని సృష్టిస్తాయి.*
*మన దైనందిన ఆలోచనల ద్వారా మన విధిని సృష్టిస్తాం - అవి మనల్ని ఆకర్షించి, వికర్షించే మన కోరికలు, మన ఇష్టాయిష్టాలు. *దాజీ...హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం*

No comments:

Post a Comment