Sunday, February 16, 2020

బిల్వమంగళుడు. (లీలాశుకుడు ).

బిల్వమంగళుడు. (లీలాశుకుడు ).
🕉🌞🌎🏵🌼🚩

బిల్వమంగళుని జీవితంలో యెన్నో కుదుపులు. మరెన్నో మలుపులు. ఆయన పూర్వజన్మ కూడా యెంతో ఆశ్చర్యం కొలుపుతుంది. మననం చేసుకుందాం, రండి.

బిల్వమంగళుడు పూర్వజన్మలో గొప్ప సన్యాసి. శ్రీకృష్ణునికి అమితభక్తుడు. శ్రీకృష్ణునితో భావైక్యము పొందినవాడు. అయన అనేక భాగవత సప్తాహాలు చేస్తుండేవాడు, సన్యాసిగా వుంటూ. ఆసమయంలో వచ్చిన భక్తులకు కష్టం కలుగకుండా, శ్రీకృష్ణ ప్రసాదాన్ని తయారు చేయించి పంచిపెడుతూ వుండేవాడు.

అలాంటి ఒక సమయంలో, సప్తాహం జరుగుతుండగా, మధ్యలో ఆయన వద్ద వున్న ధనం అంతా ఖర్చు అయిపొయింది. ఇంకా ధనం కావలసి వచ్చింది. ఎక్కడ తనకు సంపద దొరుకుతుందా, భక్తులను సేవించడానికి అని వెదుకసాగాడు. కొద్దిదూరం అలా వెదుకుతూ వెళ్లగా, యవ్వనంలో 18 వ యేట చనిపోయిన ఒక రాకుమార్తె శరీరాన్ని దహనం చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు దుఃఖంతో కార్యక్రమం పూర్తి కాకుండానే వెళ్లిపోయారు. ఆమె దేహం మీద యెంతో విలువైన వజ్రాలతో కూడిన బంగారునగలు ఆయనకు కనిపించాయి. ' ఈబాలిక శరీరంతో ఆ ఆభరణాలు దగ్ధమైతే యేమి ప్రయోజనము ? నేను తీసుకుని కృష్ణభక్తులను సంతృప్తి పరుస్తాను, యివి అమ్మగా వచ్చిన ధనంతో ' అని ఆమె పార్థివశరీరంపై చేయి వేయబోయాడు. అంతలో సన్యాసి నివ్వెరబోయేటట్లుగా, ' అగు మహానుభావా ! ఇవి నీవు తీసుకోకూడదు. నీకు సంపద కావలసివస్తే, నాతండ్రి యీ రాజ్యానికి రాజు కాబట్టి, ఆయన వద్దకు వెళ్లి ధనం అడుగు. ఆయనకు నమ్మకం కలిగేట్లుగా, నా శయన మందిరంలో తలగడ వద్ద వున్న పెట్టెలో, అఖండసంపద వున్నదని చెప్పు. ఆ ధనాన్ని కృష్ణుని భక్తులకు ఉపయోగించు. ' అని చెప్పింది .

ఆ విధంగానే సన్యాసి, మహారాజుకు జరిగినదంతా చెప్పాడు. చనిపోయిన రాకుమార్తె చెప్పినట్లుగానే, ఆమె శయనాగారంలో పెట్టెలో సంపద వుండడం చూసి, సన్యాసి మాటలు నమ్మి, మన:స్ఫూర్తిగా ఆ సంపదనంతా సన్యాసికి యిచ్చివేశాడు.

భాగవత సప్తాహంలో ఆ సొమ్మునంతా ఖర్చుచేసాడు, సన్యాసి. అయినా యింకా ధనం కావలసి వచ్చింది. అప్పుడు మళ్ళీ రాకుమార్తె శవం వద్దకు వెళ్లి, ఆమె వంటిమీద వున్న వజ్రాల కంఠహారాన్ని తీసుకున్నాడు. అక్కడనుండి లేవగానే, రాకుమార్తె ఆత్మ, ' ఓ సన్యాసీ ! నీవు చాలా తప్పు చేసావు. నీవు చేసినది శ్రీకృష్ణ భక్తుల కోసమే అయినా, నీ తప్పు నేను క్షమించలేక పోతున్నాను. నీవు చేసిన యీపాపానికి మళ్ళీ మానవజన్మ ధరించి, కాముకుడవై, నీతిమాలిన జీవితం అనుభవిస్తావు. ఇదే నాశాపం. ' అని కోపంగా శపించింది.

తరువాతి జన్మలో ఆ సన్యాసి బిల్వమంగళునిగా జన్మించి స్త్రీలోలుడు అయ్యాడు. ఆ రాకుమారి చింతామణి అనే వేశ్యగా జన్మించింది. ఆమెయే ఆయన గురువుగా చివరకు మోక్షమార్గం చూపించింది .

ఆ సన్యాసి దక్షిణభారత దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చింతామణి అనే వేశ్య యొక్క గాఢమైన ప్రేమలో పడ్డాడు. ఆమెతో తన దేహవాంఛలు తీర్చుకుంటూ, ఆమెలేనిదే బ్రతకలేననే స్థితికి వచ్చాడు. భార్యాబిడ్డలను తృణీకరించాడు. యావదాస్తిని పోగొట్టుకున్నాడు.

ఆయన యెంతగా చింతామణి వ్యామోహంలో కొట్టుకుపోతున్నాడంటే, ఒకనాడు, అతి పెద్ద తుఫాను వాతావరణంలో, తన తండ్రిగారి శ్రార్ధ కర్మలు ఆచరించీ, ఆచరించగానే, చింతామణి పొందుకోరి, విరహం తట్టుకోలేక, ఆమె యింటికి చేరడానికి ఒక నదిని దాటవలసి వస్తే, ఆ తుఫానులో కొట్టుకువస్తున్న, ఒకశవాన్ని, అది శవమని కూడా ఆలోచింపకుండా, దానినే ఆలంబనగా చేసుకుని ఆవలి ఒడ్డుకువెళ్లి, అక్కడ చింతామణి యింటి ద్వారాలు మూసివుండడంతో, గోడ ప్రక్కనుండి, ఇంకొక ఆధారంతో అది తాడు అనుకుని, దానితో, ఆమె వుండే పైఅంతస్తుకు చేరుకున్నాడు. అయన గోడ యెక్కడానికి చేసుకున్న ఆధారం, నల్లత్రాచు. అదికూడా గమనించే స్థాయిలో లేడు బిల్వమంగళుడు.

ఆసమయంలో, కామంతో రగిలిపోతున్న బిల్వమంగళుని చూసి, చింతామణి, ' నీవు నా రక్త మాంసాలతో కూడిన యీదేహం మీద యింత వ్యామోహం పెంచుకున్నావు. నీ ప్రాణాలను లెక్క చేయకుండా, తుఫానులో ఇంత సాహసం చేసి నా పొందు కోసం వచ్చావు. నా మీద చూపిస్తున్న యీ వ్యామోహంలో సహస్రపాలు అయినా, ఆ గోవిందుని మీద చూపించితే, నీకు జన్మ సార్ధకం అవుతుంది. నీవు వెంటనే బృందావనం వెళ్లి ఆశ్రీకృష్ణుని దర్శించి, అలౌకిక ఆనందం అనుభవించు. ' అని దిశా నిర్దేశం చేసింది చింతామణి.

అ విధంగా బయలుదేరిన బిల్వమంగళునిలో యింకా కామపు పాలు నశించలేదు. దారిలో, తాను బయలుదేరిన లక్ష్యం మర్చిపోయి, ఒక బ్రాహ్మణ స్త్రీతో, తన కామం తీర్చుకున్నాడు. తాను చేసినపనికి తానే సిగ్గుపడి, యే స్త్రీతో అయితే, ఆయన ఆనందించాడో, ఆమె తలకు పెట్టుకునే, పదునైన పరికరంతోనే, తన కళ్ళు ఊడబెరుక్కున్నాడు, బిల్వమంగళుడు, యిక తన జీవితంలో, మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా, మాంసనేత్రాలు విసర్జించి, కనులముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు ఆ కఠోర నిర్ణయం తీసుకుని అంధత్వాన్ని ఆహ్వానించాడు.

బిల్వమంగళుడు బృందావనం చేరిన తరువాత, కృష్ణ కర్ణామృతం రచించి గానం చేసాడు. రాధాకృష్ణుల బృందావనలీలలను కడు రమ్యంగా వర్ణించాడు. కాలాంతరమున, సోమగిరి అనే మహాస్వామి వద్ద దీక్ష పుచ్చుకుని, లీలాశుకునిగా నామాంతరం చెంది, రాధాకృష్ణుల సేవలో తపించి తరించాడు. వారి లీలలు వర్ణిస్తూ వీణావాదనలో మైమరుస్తుంటే, యితర యేవాద్యాలు అవసరం లేకుండా పోయేవి.

బృందావనంలో బిల్వమంగళునికి ( లీలాశుకునికి ) కృష్ణ పరమాత్మ స్వయంగా, ప్రతిరోజూ, ప్రసాదం తినిపించి, సురక్షితమైన ప్రదేశంలోకి తీసుకువెళ్లి వదిలేవాడు. అయితే, ఒకరోజు తనను నడిపిస్తున్న వ్యకి మధుర మనోహరంగా వేణువు వాయిస్తుంటే, సర్వం మరచిపోయి వినసాగాడు, లీలాశుకుడు. వెంటనే, ఆనందం పట్టలేక, కృష్ణుని చేయి పట్టుకున్నాడు లీలాశుకుడు, ఆప్యాయంగా,ఇక వదలను అన్నట్లు, నీవెవరో నాకు తెలిసిపోయింది, అనే భావనతో.

లీలామానుష విగ్రహుడైన, గోవిందుడు కూడా, ఒక్కసారి, లీలాశుకుని హస్తాన్ని స్పృజించి, మధురంగా నవ్వుతూ, అక్కడనుండి, పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. బిల్వమంగళుడు ( లీలాశుకులు ) యెంతో ఆనందంగా, ' గోవిందా ! నీవెవరో నాకు తెలిసిపోయిందిలే ! నా చేతిని వదిలినీవు పరుగెత్తినా, నా గుండెలలో నుండి నిన్ను వెళ్లనీయనుగా ! ' అంటూ ఆయనకీర్తనలు పాడుకుంటూ మురిసిపోసాగాడు.

కాలాంతరమున, లీలాశుకులు ఎన్నో కీర్తనలు వ్రాసారు. అన్నింటిలో రాధాకృష్ణ ప్రేమను ఆవిష్కరించారు.

భోగిని యోగిగా చేసిన యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారాలు

🕉🌞🌎🏵🌼🚩

No comments:

Post a Comment