Friday, February 14, 2020

🎒మన పాఠశాలలో..!!

🎒మన పాఠశాలలో..!!
====================

"ఏంటి సర్..సిలబస్ అయిపోవచ్చిందా?"
అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసా..

ఎదురుగా హెడ్డుమాస్టర్..
కళ్ళజోడు సవరించుకుంటూ..

"లేదు సర్,ఇంకా ఒక లెషన్ ఉంది"
కొంచెం తటపటాయిస్తూ నా సమాధానం.

"మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు"
అని మా హెడ్డుమాస్టర్ కొంచెం గంభీరంగానే అడిగారు.

"సమాజంలో విలువలు" కోసం చెప్తున్నా సర్..!
అని
"సర్" కళ్ళలోకి కొంచెం గర్వంగా చూస్తూ..చెప్పా
ఆ మాటకు మా హెడ్డు గారు కొంచెం చిరాకుగా మొహం పెట్టి
"అవన్నీ నీకు ఎవరు చెప్పామన్నారయ్యా?"
అని పిల్లల వైపు ఒకసారి తేరిపారా చూసి బయటకు రమ్మన్నారు.
వెళ్లి ఆయన ఎదురుగా నిల్చున్నా..

నన్ను ఒకసారి పైకి కిందకి చూసిన ఆయన
కొంచెం మెల్లిగా మాట్లాడుతూ..

"నీకేమైనా పిచ్చా?"

"ఈ రోజుల్లో పేరెంట్స్ వచ్చి మా వాడికి మార్కులు ఎందుకు తగ్గాయి అని అడుగుతారు కానీ..
"విలువలు,క్రమశిక్షణ ఎంతవరకు నేర్పించారు?"అని అడగరయ్యా!!

"పోనీ ప్రోగ్రెస్ రిపోర్టులో విలువలు, క్రమశిక్షణ కాలమ్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా??"

"ఈ రోజుల్లో వాటితో పెద్ద పనిలేదయ్యా"

అని చెప్పి..నాకు ఆయన మరింత దగ్గరగా వచ్చి

"ముందు సిలబస్ కంప్లీట్ చేసి,మన బడుద్దాయిలకి నాలుగు ప్రశ్నలు ఇచ్చి కంటస్థ పెట్టించు.విలువలదేముంది బాబూ..!అవి మనం నేర్పించకపోయినా ఎవడూ అడగడు"అన్నారు.

ఆ మాటకు నా మొహంలో వస్తున్న మార్పులు గమనించినట్టున్నారు..మా హెడ్డుమాస్టర్.
వెంటనే..ఇలా అన్నారు.

"ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి కత్తి మీద సాము లాంటిదయ్యా!"

నాకు అర్ధం అయ్యీ..అవనట్టుగా ఉండి అలానే చూస్తున్నాను.

ఆయన నా వైపే చూస్తూ..

"అవునయ్యా..!ఈ రోజుల్లో మనం వాళ్ళకి చదువు మాత్రమే చెప్పగలం.
"జ్ఞానం"ఇవ్వడానికి మన దగ్గర టైం లేదు.

"జ్ఞానం" ఇవ్వాలంటే

"క్రమశిక్షణ" కావాలి...అది నేర్పించాలంటే

"దండన" కొన్నిసార్లు తప్పకపోవచ్చు.

కానీ...ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా..!?

ఎంతమంది విద్యార్థులని రోజూ చూడటంలేదు

ఒకడు కన్నాలున్న పాంటుతో వస్తాడు
ఇంకొకడు సగం
గొరిగి మధ్యలో వదిలేసిన హెయిర్ స్టైల్ తో వస్తాడు.
"అదేమిట్రా?" అంటే
మా నాన్న చేయించాడు అంటాడు.
మరొకడేమో..
నిన్ను..నన్నూ.. గుద్దుకుంటూ పోతాడు.

"అది తప్పురా"
అని కొంచెం గద్దిస్తే చాలు
సాయంకాలానికి వాడి తల్లిదండ్రులు
"గేట్"ముందు ధర్నాకు దిగుతారు.

పోనీ..వాళ్ళకే ఏదో సర్దిచెపుదాం అంటే..

"డబ్బులు కడుతున్నాము..గుద్దితే కొంచెం సర్దుకుపోలేరా??" అని మనల్నే ప్రశ్నిస్తారు.

"పిల్లవాడికి మొదటి సమాజం పాఠశాల"

సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకునేది ఇక్కడే..!

కానీ...

"విద్యార్థి చేసిన ఏ చిన్న తప్పుకు కూడా పాఠశాల లో దండన లేదు కాబట్టే వాడు పెద్దయ్యాక సమాజంలో తప్పు చేయడానికి భయపడటం లేదు."

విచిత్రం ఏమిటంటే..!!

చేసిన తప్పుకు పాఠశాలలో దండన లేదు కానీ
సమాజంలో మాత్రం ఉంటుంది.
పాపం అది తెలుసుకునే సరికే..వాడు తల్లిదండ్రుల చేయి దాటిపోతాడు.

"మా వాడిని ఎందుకు దండిచావయ్యా?"
అని "జిల్లా జడ్జి గారి"ని అడగలేరు కదా..
తప్పుకు శిక్ష పడాల్సిందే కదా..

అదే పాఠశాల లో సరిఅయిన

"శిక్షణ"

జరగడానికి..వీళ్లందరూ సహకరిస్తే..ఆ
"శిక్ష"లు పడవు కదా..

అని చెప్పి,కొంచెం ఆలోచించి మళ్లీ ఇలా అన్నారు.

"నాకు కూడా మంచి సమాజం స్థాపన కోసం
క్రమశిక్షణ కలిగిన విద్యార్థులని తయారు చేయాలని ఉందయ్యా..!"

"చదువంటే మార్కులు కాదు,క్రమశిక్షణ మరియు విలువలతో కూడిన జ్ఞానం అని ప్రతి పేరెంట్ తెలుసుకున్నపుడు..తప్పకుండా మనం మంచి సమాజ స్థాపన కోసం పాఠశాలలోనే పునాది వేద్దాం"

అని చెప్తూ..ఆయన గది వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.

నేను ఆయన్నే తదేకంగా చూస్తూ..నిల్చుండిపోయాను.

"సైనిక పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులని బెత్తం దెబ్బలతో అయినా "క్రమశిక్షణ" నేర్పించి
వారిని ఉత్తములుగా తీర్చిదిద్దిన
"హెడ్ మాస్టర్ శంకరరావు గారు"
ఈ రోజు మార్కుల కోసం ఆలోచించడం ఏంటో..!!"

"హ్మ్మ్..ఏదైనా తల్లిదండ్రులకి కావాల్సింది ఈ రోజుల్లో మార్కులే కదా..!!"

అని మా ఆఫీస్ బాయ్ లింగరాజు అంటున్న
మాటలు నా చెవికి అస్పష్టంగా వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment