Sunday, March 1, 2020

శ్రాద్ధ కర్మ

పితృకార్యం అనే మాటలోకే అమ్మకు సంబంధించినటువంటి కార్యం కూడా ఇమిడిపోతుంది. తల్లికానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు తప్పకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తల్లిదండ్రి శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏ రోజు శరీరాన్ని విడిచి పెట్టారో ఆరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఇంటి పురోహితుడు గుర్తుంచుకోవలసిన విషయం కాదు. బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తిథి మధ్యాహ్న కాలంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవతారాధనకు అయితే సూర్యోదయానికి చూస్తారు. నైమిక్తికాలలో మారుతుంది. మాస శివరాత్రి అయితే చతుర్దశి అర్థరాత్రి పరివ్యాప్తమై ఉండాలి. పితృకార్యానికి వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథి సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఉన్నప్పుడు ఆ తిథి కూడా ఉంది అన్న విషయాన్ని రూడం చేసుకుని పితృకార్యాన్ని నిర్వహించాలి. పితృకార్యాన్ని నిర్వహించేటప్పుడు కానీ, దానియందు పరమ శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యం. శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటంటే ‘సా శ్రద్ధా కవితా సిద్ధిః యయావ స్థూప లభ్యతే’ – ఇది శాస్త్రం చేత చెప్పబడింది కాబట్టి గురువు గారి చేత నిర్ధారింప బడి అది శాస్త్రవిహితం చేయాలి అని చెప్పబడింది కాబట్టి ‘శాస్త్రస్య గురు వాక్యస్య సత్య బుద్ధ్యాsవధారణా! సా శ్రద్ధా కవితా సిద్ధిః’ – ఇది శాస్త్రము, గురువుగారు చెప్పారు కాబట్టి నేను ప్రమాణంగా తీసుకుని చేస్తాను. ఈమాట ఎందుకు అన్వయం అవుతుంది అంటే అమ్మ/నాన్నగారు బ్రతికి ఉండగా పెట్టిన అన్నం అమ్మ/నాన్న తింటుంటే కనపడుతుంది. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పెట్టిన అన్నం/నీళ్ళు అమ్మకి/నాన్నకి వెడుతున్నాయని దేనిచేత విశ్వాసం పొందాలి? అంటే ప్రమాణ వాక్కు చేత. ఏది ప్రమాణం? - శాస్త్రం ప్రమాణం. ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ’. కొన్ని కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి. నేను ఇక్కడ కూర్చుని డిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనియార్డర్ కడితే ఈ డబ్బు వెతుక్కుని పట్టుకెళ్ళి మా అబ్బాయికి ఇస్తారు. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా మూడు తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధ కర్మ చేత వాళ్ళకి అందుతుంది. వాళ్లకి దాహం వేస్తుంది. ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు. ఆరోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తర ఇస్తారు. అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం రెండు చేతులు ఊపి చూపించాలి.
ఇక శ్రాద్ధ కర్మ చేయవలసిన రోజు వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆరోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగ పిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి మొట్టమొదట పుట్టిన వాడి చెయ్యి క్రింద పెట్టి బొటనవ్రేలు నుంచి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. అది పెద్దకొడుకు చేతుల మీదనుంచి పడుతుంటే పితృదేవతలు ఆ నీళ్ళు పట్టి తాగుతారు. దాహోపశాంతి పొందుతారు. అలా పితృ దేవతలకు చేయవలసినటువంటి శ్రాద్ధం శ్రద్ధతో చేయాలి కాబట్టి దానికి శ్రాద్ధం అని పేరు పెట్టారు. ఆ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు తనకు ఏమి ఉందో తను ఏమి తింటున్నాడో దానికి తగినట్లుగా చేయాలి. దానికి మించి/తక్కువ చేయకూడదు. ఉదాహరణకి నేను రొజూ చక్రకేళి అరటిపండు తింటే ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటిపండే వాడాలి. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తండ్రి దశరథమహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి. భరతుడు చెప్తాడు. వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు దర్భల మీద ఉంచుతాడు. కౌసల్య గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది. నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దను దర్భల మీద ఉంచి తండ్రికి తద్దినం పెట్టాడు అంటే రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అని. అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధ కర్మ చేయాలి. అలా శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు రెండు విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకటి అన్నదమ్ములందరూ కలుసుకోవాలి. అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టేసిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు ఇంత దిక్కుమాలిన బిడ్డలను కన్నాం అని. కనీసం ఆరోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేది ప్రధాన కర్తవ్యమ్. అసలు తల్లిదండ్రి ఎప్పుడు శరీరం విడిచి పెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి తన భార్తతో కలిసి తాను ఉంటే ఆరోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి. అంటే వంట చేసిన పదార్థాలతోనే తద్దినం పెట్టాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్య ప్రక్కన లేకుండా తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి. అందుకే భార్యా సహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్క్రుష్టమైన శ్రాద్ధం. దానిని అన్న శ్రాద్ధము అని పిలుస్తారు. అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు. అంటే బియ్యం, కూరగాయలు, చింతపండు ఇలాంటివన్నీ ఇస్తారు. పొత్తర అని పిలుస్తూ ఉంటారు. దానిని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు. అలా ఆమ శ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో పిష్ఠచూర్ణ శ్రాద్ధము అని పెడతారు. బియ్యపు పిండి కానీ ఓషధుల పిండి కానీ (గోధుమలు, ధాన్యం ఓషధుల క్రిందకు వస్తాయి) అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్ఠచూర్ణ శ్రాద్ధం. ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు. ఏదైనా శ్రద్ధతో పెట్టాడా? లేదా? ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా? లేదా?
భార్యతో ఉంటే అన్న శ్రాద్ధం.
భార్య ప్రక్కన లేకపోతే ఆమ శ్రాద్ధం.
ఆమ శ్రాద్ధం కూడా పెట్టడానికి తగిన అవకాశం లేని స్థితిలో ఉంటే పిష్ఠచూర్ణ శ్రాద్ధం.
నాల్గవ శ్రాద్ధ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది. కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం. హిరణ్య శ్రాద్ధం అంటారు. తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరం అవుతుంది అన్నది లెక్కకట్టి ఆ సొమ్మును తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రిని/తల్లిని తలుచుకుని ఇస్తారు. అది హిరణ్య శ్రాద్ధం అంటారు. కానీ ఆ పద్ధతిని శాస్త్రంలో చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తారు. అలా చేయడం మంచిది కాదు. కనీసంలో కనీసం పితృ ప్రపితామహ, పితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి. తండ్రి, తండ్రిని కన్న తండ్రి, ఆ తండ్రిని కన్న తండ్రి. అంటే తండ్రి, తాత, ముత్తాత. ముగ్గురి పేర్లు చెప్పాలి. వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ శ్రాద్ధ కర్మ చేస్తున్నాను అని ఇది అక్షయ తృప్తిని కల్పించి గయా శ్రాద్ధం అగుగాక! అని చిట్టచివర సంకల్పం చేస్తారు. అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టిన బిడ్డలు కనీసం వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని వాడు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే ఎలా? అందుకే పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మ అనేది తప్పకుండా చేయాలి.
అలా చేస్తే ఆశీర్వచనం నాకు కాదు. నా బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. శాస్త్రంలో ఒక మాట ఉంది. సంతానాన్ని కటాక్షించే ముందు అందునా కర్మ సంతానాన్ని ఇచ్చే ముందు (కర్మ సంతానం అంటే వాడికి కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి కదా ఆ కర్మ చేసేవాడిని ఇవ్వాలా వద్దా? అంటే పితృదేవతలను సంప్రదించి పరమేశ్వరుడు ఇస్తాడు అని. పితృదేవతా స్థానం అక్కడ చాలా బలీయమైనది అని చెప్తారు. కనీస మర్యాదగా పితృదేవతలకు ఆ గౌరవం ఇవ్వాలి.
ఎవరైనా ఏ కారణం చేతనైనా పితృదేవతలకు అలా చేసి ఉండి ఉండకపోతే అప్పుడు ఏం చేయాలి? కొన్నాళ్ళు మానేశారు. ఆ తర్వాత దాని గౌరవం విలువ తెలిశాయి. అయ్యో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాడు. కానీ గతంలో పెట్టలేదు. ఆ దోషం పోవడం ఎలా? దానికి భారతదేశం మొత్తం మీద ఆ దోషం పోగొట్టగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం క్రింద ఉన్న కపిలతీర్థం ఒక్కటే. కపిల తీర్థం వెళ్ళి శ్రాద్ధం పెడితే అంతకు పూర్వం శ్రాద్ధం పెట్టనటువంటి దోషం పరిహరింపబడుతుంది. అన్నివేళలా శ్రాద్ధ కర్మ ఒకలా చేయాలని శాస్త్రం చెప్పలేదు. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధ మాత్రం లోపం ఉండకూడదు. భార్యతో సౌకర్యంగా ఉన్నప్పుడు అన్న శ్రాద్ధమే పెట్టాలి. ఉన్న పరిస్థితిని బట్టి శ్రద్ధారహితుడు కాకుండా శ్రద్ధా సహితుడై చేసేటటువంటి కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ అని పేరు.

No comments:

Post a Comment