Tuesday, March 10, 2020

నాకేమి నీ చావు నువ్వు చావు

నాకేమి నీ చావు నువ్వు చావు

ఒక ఊరిలో ఓ రైతు ఉన్నాడు.
అతనికో ఇల్లు వుంది.
ఆ రైతు తనతో పాటు ఒక కోడిని ఒక మేకను పెంచుకుంటున్నాడు.
ఆ ఇంట్లో ఒక ఎలుక కూడా తిరుగుతుండేది.
ఆ ఊరిలోనే గ్రామస్థుల అవసరాలకు ఒక చెరువు వుంది.
దానిలో ఒక మొసలి నివాసం వుంటుంది.
కొన్నాళ్ళ తరువాత ఆ రైతు కి వివాహమై బార్య కాపురానికి వచ్చింది.
ఆవిడకి ఆ ఇంట్లో ఎలుక తిరగడం నచ్చలేదు.
ఆ విషయమే భర్తకి చెప్పింది.
ఎలుకను చంపడానికి బోను తీసుకురమ్మని చెప్పింది.
మరుసటి రోజే రైతు ఓ ఎలుకల బోను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు.
జరిగిన తతంగాన్ని చూసిన ఎలుక భయపడింది.
ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడటానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంది.
మందుగా కోడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది.
నేను ఇంతవరకూ ఈ రైతుకి ఏ విధమైన నష్టం కలిగించే పని చెయ్యలేదు. ఏదో నా మానాన నేను బతుకుతున్నాను. ఇక మీదట కూడా వారి జోలికి రాను. నన్ను చంపవద్దని చెప్పు.
అని ప్రాధేయపడి అడిగింది.
దానికి ఆ కోడి చిద్విలాసంగా...
అది నీ వ్యక్తిగత విషయం. దానితో నాకేమిటి సంబంధం. నీ సమస్య నువ్వే పరిష్కరించుకో...
అని సమాధానం చెప్పింది.

అప్పుడు ఆ ఎలుక మేకని ఆశ్రయించి అడిగింది.
దానికి ఆ మేక కూడా...
అది నీ సమస్య...
దానిని నువ్వే సరిచేసుకోవాలి నాకు సంబంధంలేదు
అని బదులిచ్చింది.

చేసేదేమీ లేక ఎలుక చివరిగా చెరువు దగ్గరకు వెళ్ళి మొసలిని కూడా అడిగింది ..
ఎలాగైనా రైతుని ఒప్పించి నన్ను కాపాడు. నేను ఏ పొరపాటు చెయ్యను
అని అడిగింది.
అప్పుడు ఆ మొసలి కూడా
నాకు సంబంధం లేదంటూ...
అలాగే మాట్లాడింది.

ఏదయితే అదే జరుగుతుందిలే అనుకుని ఎలుక తిరిగి ఇంటికి వచ్చేసింది.
ఆ రాత్రి ప్రొద్దుపోయాక పెద్ద శబ్దంతో బోను తలుపు మూసకుంది.
వెంటనే రైతు బార్య ఎలుక చిక్కింది అనుకుంటూ చీకట్లో తడుముకుంటూ బోను దగ్గరకు వెళ్ళింది.
కానీ... దానిలో దూరింది ఎలుక కాదు.
అది ఓ పాము.
ఆవిడ దగ్గరకు రాగానే అది ఆమెను చేతి మీద కాటేసింది.
ఆవిడ అరుపుకి అందరూ లేచి వచ్చారు.
ఆమెను ఓ మంచం మీద పెట్టి డాక్టర్ ని పిలుచుకొచ్చారు.
ట్రీట్మెంట్ మొదలైంది.
రోజులు గడుస్తున్నాయి.
అందరూ వచ్చి పలకరించి వెళుతున్నారు.
చుట్టాలు రావటం మొదలైంది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
వైద్యం జరుగుతూనే ఉంది.
వచ్చిన చుట్టాలకి మర్యాదలు చేయటానికి ఓ రోజు ఆ రైతు తను పెంచుకున్న కోడిని కోసి వండి పెట్టాడు.
ఎలుక మాత్రం అక్కడే వుంది.
మరికొన్ని రోజులు గడిచాయి.
వైద్యం జరుగుతోంది.
చుట్టాలు ఇంకా ఎక్కువ మంది వచ్చారు.
వారి కోసమని ఆ రైతు మేకని కోసి ఫలావు చేసి పెట్టాడు.
ఎలుక మాత్రం ఇంకా ఆ ఇంట్లో తిరుగుతూనే వుంది.
వైద్యం జరుగుతుంది. కానీ ఆమె కోలుకోలేదు.
లాభం లేదని పొరుగూరు నుండి మరో వైద్యుడిని పిలిపించారు.
ఆ వైద్యుడు ఆమెను చూసి...
మరేమీ పర్వాలేదు.
నేను ఈమెను బ్రతికిస్తాను.
కానీ... వైద్యానికి నాకు మొసలి రక్తం కావాలి అన్నాడు.
దానితో అందరూ వెళ్ళి చెరువులో ఉన్న మొసలిని పట్టుకుని చంపి దాని రక్తం తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు.
రైతు భార్యకి నయమైంది.

కోడి చచ్చింది.
మేక కూడా చచ్చింది.
చివరికి మొసలీ చచ్చింది.
కానీ... ఆ ఎలుక మాత్రం అక్కడే వుంది.

మన సమాజమూ ఇలాగే ఉంది

ఎవరికి వారే నాకేమిటి సంబంధం అనుకుంటే....

చివరికి వారు కూడా.....!!!!!!
👏👏👏

No comments:

Post a Comment