Tuesday, March 16, 2021

త్రిగుణాలు

🌹త్రిగుణాలు🌈
🕉️🌞🌎🏵️🌼🚩
సత్వగుణము,రజోగుణము, తమోగుణము. వీటిలో తమోగుణము నీచమైనది, నిందార్హమైనది. సత్వగుణము ఉత్తమమైనది. జ్ఞాన సముపార్జనకు అనుకూల మైనది. రజోగుణము ఈ రెండింటి మిశ్రితం. పరిశుభ్రం లేని ఆకారం, అతి నిద్ర, దీనత్వం, అసహనం, హద్దులేని కోరికలు తమో గుణ లక్షణాలు. ధైర్యం, శాంతి, కరుణ, సంతోషం, విద్యలయందు ఆసక్తి సాత్వికగుణ లక్షణం. సాత్వికడైన వాడు మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలోని సమస్తం అశాశ్వతం అని తెలుసుకుంటారు. సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అహంకారాన్ని వదిలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉత్తమ శాంతి పొందుతాడు. సత్వగుణ సంపన్నుడు శూద్రుడైనా తరువాతి జన్మలలో వైశ్యునిగా, క్షత్రియునిగా, బ్రాహ్మణుడిగా జన్మించి కడకు కైవల్యాన్ని చేరుకుంటాడు ” అని చెప్పాడు.

అగ్ని వాయువు
కౌశికుడు ” అయ్యా ! ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది. వాయువులు శశరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి ” అని అడిగాడు. ధర్మవ్యాధుడు ” మహాత్మా! మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం. ప్రాణవాయువు, ఆపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింప చేస్తుంటాయి. మానవుడిలో ఆపానము, పొత్తికడుపు, బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆపానము మలమూత్రముల విసర్జనా స్థానం. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తుంటుంది. వ్యానము అనే వాయువు శరీరావయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణములను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ధత్వ స్థానమున నిలుపుకుంటారు. ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈలోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. మహాత్మా! బ్రహ్మవిద్యాతత్వం ఆచరణ సాధ్యం చేయటమెలా అన్నది వివరిస్తాను. పండితుడు శుభం, అశుభంలలో ఆసక్తి లేక సమానంగా స్పందిస్తాడు. క్రమంగా సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోషణముల పట్ల సమంగా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు పుణ్యాత్ముడై ఇంద్రియములను జయించి యోగసాధన చేస్తాడు. తన ఆత్మలో పరమాత్మను దర్శించి గాలి లేని చోట నిశచలంగా జ్వలించే దీపంలా ప్రకాశించి అమరత్వం పొందుతాడు. కనుక కామక్రోధాలను వదిలి కర్మఫలత్యాగం చేసి కర్మలను ఆచరించడం ఉత్తముల ధర్మం. జీవితం అశాశ్వతం అనే ఎరిగి ఇతరులకు అపకారం చేయడం వదిలి వేయాలి. ఉన్న దానికి సంతృప్తి చెంది ఇతరుల ఎడ దయ, కరుణ, మైత్రితో ప్రవర్తించాలి. ఇందియ నిగ్రహాన్ని సాధించిన వాడు పరమ సుఖాన్ని పొందుతాడు ” అని చెప్పాడు. కౌశికుడు ” మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు. నీ వలన ధర్మసూక్ష్మాలు ఎరిగి ప్రబుద్ధుడనయ్యాను ” అన్నాడు.

సేకరణ; వే శ్రీ

🕉️🌞🌎🏵️🌼🌈🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment