Monday, August 16, 2021

సిరి సంపదలు

💥సిరి సంపదలు💎
🕉️🌞🌎🌼🏵️🚩

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

'ధనమూలమిదం జగత్’ అని రాజధర్మాలను బోధిస్తూ విశ్వామిత్రుడు రాముడితో పలికినట్టు ధనం చుట్టూనే లోకం భ్రమిస్తోంది. అయినప్పటికీ “ధర్మబద్ధంగా సంపాదించిన ధనమే సంపదయని, సంసార పోషణార్థమే ఆర్జించాలన్న” వేదవాక్కును శిరసావహిస్తూనే ధనార్జన చేయాలి.

“ మాయకు గురిచేసి మోహాల వెంట పరిగెత్తించే సిరిసంపదలను సద్వినియోగం చేయాలని’ రామాయణం బోధించగా, అందుకు విరుద్ధంగా భోగలాలసుడై పరస్త్రీని కాంక్షించి నాశనమయ్యాడు రావణుడు. ధర్మానికి ప్రతిరూపమైన రాముణ్ణి ఆశ్రయించి స్వర్ణలంకకు రాజయ్యాడు విభీషణుడు.

సిరి సంపదలను, శరీర భాగాలను తృణప్రాయంగా భావించి దానమిచ్చిన పురాణ పురుషులున్నారు. మూడడుగుల నేల కోరిన వామనుడు సామాన్యుడు కాదని తెలిసినప్పటికీ దానమిచ్చిన బలి చక్రవర్తి కథను భాగవతం, కపట బ్రాహ్మణుడని తెలిసినా కవచ కుండలాలను దానమిచ్చిన కర్ణుడి కథను భారతం వివరించి ఆదర్శ జీవన విధానాన్ని బోధించాయి.

“ఎంత వగచినా మరణించిన వారిని దక్కించుకోలేనట్టే, ఎంత రోదించినా పోయిన సంపదను నిలుపుకోలేమని” భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించినట్టు ఆశామోహాలు తొలగించుకుని యోగ జీవితం గడిపిన వారున్నారు. భార్యాబిడ్డలు, రాజభోగాలను త్యజించిన శుద్దోధనుడు వైరాగ్యంతో గౌతమ బుద్ధుడై, ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందించి జన హృదయాల్లో కొలువయ్యాడు.

‘సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివర్లో పశ్చాత్తాపాన్ని’ కలిగిస్తుందని చాటే సంఘటనలు చరిత్రలో జరిగాయి. వజ్రవైడూర్యాలను తన అంతిమ యాత్రలో దారి పొడుగునా జల్లమని విశ్వవిజేత అలెగ్జాoడర్ ఆదేశించడం, యుద్ధ కాంక్షతో రక్తాన్ని ఏరుల్లా పారించిన అశోకుడు శాంతి సందేశాలు వినిపించడం వారి మనోపరివర్తనకు, పశ్చాత్తాపానికి నిదర్శనాలు.

“ధనం పుట్టింది భోగాల కోసం కాదని, ఇతరులకు సహాయం చేస్తూ ఆనందించడానికని’ శంకరాచార్యులు బోధించిన సత్యాన్ని గ్రహిస్తే కొందరికి మాత్రమే పరిమితమైన సంపద అనేకులకు దక్కి అసమానతలు తొలగుతాయి.

“దుర్వినియోగమైన ద్రవ్యం ఉపద్రవాలను కొని తెచ్చినట్టే, సద్వినియోగమైన ధనం దివ్యమైన ఉపకరణంగా మారుతుందన్న”గురువుల బోధనలు సమాజానికి దారి దీపాలు. యోగ్యమైన పద్ధతిలో ధనాన్ని వ్యయం చేయమనే కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి.

“ఇతరుల బాధలను గమనించకుండా స్వార్థబుద్ధితో సంపాదించేవారు దోషులేనని” భగవద్గీత, “మనిషిలో లాలస, దురాశకు మూలకారణమైన సంపదలను అవసరానికి మించి కూడబెట్టరాదని” భర్తృహరి సుభాషితం తెలుపడంతో ఔచిత్యాన్ని గ్రహించి ఆచరించాలి మానవులు.

‘సంతోషాన్నిచ్చేది సంపద లేక వైభవం కాదనియు, ప్రశాంతమైన మనసు, వృత్తి మాత్రమేననియు, సంపద వివేకికి బానిస, మూర్ఖునికి యజమాని అవుతుందనియు’ పెద్దలు చెప్పిన సత్యాన్ని గ్రహించి, సంపదలను దానధర్మాలకు, పరోపకారానికి వెచ్చిస్తూ మానవ జన్మకు సార్ధకత కల్పించాలి.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment