Tuesday, August 24, 2021

మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే.

మనసు
మనిషిలోని మనసు చాలా చంచలమైంది. మనిషి బాల్యం నుంచి చూసిన అనేక దృశ్యాలను లక్షల సంఖ్యలో అది గుర్తుపెట్టుకుంటుంది.

ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.

నిజానికి మనం మనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం.
ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు మనం వినడం కాక మనం చెప్పినట్టు మనసు వినేలా చేయాలి. అనేక సందర్భాలలో మనం అంటూ ఉంటాం నా మనసు ఒప్పుకోలేదు అని. అంటే మనం గట్టిగా చెప్తే ఒప్పుకుంటుంది.

మరి ఈ మనసును స్థిమితపరచడం ఎలా?
కోరికల్ని నియంత్రించడం ఎలా?

ఇందుకోసం మనం సాధన చేయాలి.
మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి
అందులోని చెడును తెలుసుకోవాలి.

మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది.

మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండాలి. అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది.
ఆ తరవాత మన మనసులోకి మనం ప్రవేశించగలం

సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది.

అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి.
నిశ్చలమైన స్థితి కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనం తీసుకునే నిర్ణయం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది.

ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?*

శ్రీహరి యొక్క దివ్య విగ్రహరూపాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఆస్వామి పై ఏకాగ్రతయే ధ్యానం

మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే.

మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.
ఎందుకు? మనసును గమనించడం మనకు అలవాటు లేని పని.
మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడిలేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం.
ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది. మనశ్శాంతిని ఆనందాన్ని ప్రసాదించే సక్తిగల నారాయణుని ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహంతో మనసు మన మాట వింటుంది.

దైవీ హ్యేషా గుణమయి
మమమాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే
అని గీతా వాక్యం

మనసనేది కోరికల కర్మాగారం.
ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే.
మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం స్వేచ్ఛ పొందగలుగుతాం.
ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment