Saturday, July 13, 2024

బాల్యం కీలకమైన దశ, ఈ దశ కుంటుపడితే మిగిలిన దశలన్నీ గాడి తప్పుతాయి...

 నాటిన విత్తు మొలకెత్తి పాదుగా పాకుతున్న క్రమంలో, పందిరి వేసి, తాడు సహాయంతో, దానికి సరైన దారి ఏర్పాటు చేస్తాం. ఒకనాటికి, అది అందమైన పాదుగా అల్లుకొని పూవులు పూస్తుంది, కాయలు కాస్తుంది.  పందిరి ఏర్పాటు చేయకపోతే తీగమొక్క అడ్డదిడ్డంగా పెరగడం వల్ల దాని నుంచి అనుకున్న స్థాయిలో పూలను, కాయలను పొందడం కష్టమవుతుంది.... అలాగే మానవ జీవితంలో బాల్యదశ కీలకమైనది, దానికి క్రమశిక్షణ అనే పందిరి వేసి, స్వీయ నియంత్రణ అనే తాడుతో సరైన దారి ఏర్పాటు చేస్తే... అదే వారి భవిష్యత్తు జీవిత విజయ గమనానికి ఆలంబనగా పనిచేస్తుంది... మనిషి జీవితంలోని నాలుగు దశల్లో బాల్యం కీలకమైన దశ, ఈ దశ కుంటుపడితే మిగిలిన దశలన్నీ గాడి తప్పుతాయి... బాల్యం అందమైనది, అపురూపమైనది మరియు మధురమైనది. ఆట వయసు అనేది బాల వయసుకు అందమైన చిరునామా... నేడు ఎంతమంది బాలల జీవిత పుస్తకంలో ఆడే పాడే రంగులద్దిన పుటగా చోటు చేసుకుంటోందని ప్రశ్నించుకుంటే? సమాధానం! నో అని రావడం శోచనీయం 🥹. ఈనాటి విద్యావిధానం గుదిబండగా మారి బాల్యాన్ని కబళించేస్తోంది. ఆటపాటలతో కాలక్షేపం కనుమరుగై, పిల్లల్లో ఏకాంతం ఏర్పడి, మానసిక ఒత్తిడి వారి అనుభవం లోకి వస్తోంది..... ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు, పిల్లలతో నీతి శతకాలు వల్లెవేయిస్తూ, పురాణాలు, నీతి కథలు, స్పూర్తి దాయక నాయకుల చరిత్రలు చెబుతూ, చిన్నతనంలోనే పటిష్టమైన పునాదులు వేసేవారు. వ్యష్టి కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరి పనిలో వారు తలమునకలై ఉండడం వల్ల, వారిని కనిపెట్టుకునే వారు కరువై, శిక్షణ లోపించి, అదుపు ఆజ్ఞలు లేక, బాల్యం పెడదారి పడుతోంది. దానికి దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక సహకరిస్తోంది. నేరాల్లో పసి వయసు పాత్ర క్రమంగా పెరుగుతోంది. మొక్కగా ఉన్న దశలో సరైన శిక్షణ ఇచ్చి వంచకపోతే, తరువాత పశ్చాత్తాపపడినా లాభం ఉండదు... బాల్యం లో పిల్లలకు ప్రేమ పంచకపోతే, భవిష్యత్తు లో వారి నుంచి ఆప్యాయతను ఆశించలేం. ఒకప్పుడు అనాథ శరణాలయాలు మాత్రమే  ఉండేవి. ఇప్పుడు వృద్దుల శరణాలయాలు తామరతంపరగా విస్తరించడం గమనార్హం. ఈ పరిస్థితులు సమాజ ఉన్నతికి అవాంఛనీయమే....... పోలిన రామకృష్ణ భగవాన్... రాజమండ్రి.

No comments:

Post a Comment