శ్రీమద్రామాయణము.
(224 వ ఎపిసోడ్),
""నడవకుమీ తెరువక్కొట,
గుడువకుమీ శతృనింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యెరుల మనసునొవ్వగ సుమతీ||,
"" తోడులేకుండగ ఎక్కడికి పోకూడదట,విరోధిఇంట భుజింపరాదట,ఇతరుల ధనము మన దగ్గరుంచు కొనరాదట, ముఖ్యముగ ఇతరుల మనసు నొప్పింపరాదట,ఇవన్నీ మనకి సుమతీ శతకములో చెప్పబడ్డ నీతిసూక్తులు.
పైన చెప్పబడ్డ సూక్తులలో చాలా విషయాలలో మనము జాగ్రత్త వహిస్తునేయుంటాము.తోడులేకుండగ ముఖ్యమైన పనులకు ఎక్కడికి వెళ్లము. ధనవిషయములో అందరు జాగ్రత్త వహిస్తునే యుంటారు.ఇక ఇతరుల మనసు బాధపెట్టకూడదు.ఈ విషయములో చాలా మంది అడుసులో కాలు వేస్తుంటారు. మనసు కష్టపడకుండ మాట్లాడటం ఒక విధమైన కళ. ఒక్కోసారి ఏదో అనబోయి మరింకేదో అనేస్తాము. అస్మదీయుడు ఈ మధ్య ఒక గురుతుల్యుని అనాలోచిఇతముగ ఎదో పాండిత్య ప్రదర్శనచేయబోయి భంగపడ్డాడు.ఈ స్వీయానుభవములో అవతలి వ్యక్తి సహృదయుడు కనుక నన్ను క్షమించేసారు.కనుక ఇతరులతో సంభాషించడము వారి మనసు కష్టపడకుండ మాట్లాడటానికి ఎంతో నేర్పు కావాలి.
రామాయణము లో కిష్కిందాకాండములొ సుగ్రీవుని పనుపున ఆంజనేయస్వామువారు సన్యాసి వేషములో రామలక్ష్మణులను దర్శించి సంభాషిస్తాడు. మారుతి మాటలకు రాముడు మురిసిపోయి,
"" సంస్కారక్రమసంపన్నామ్ అద్రుతామ్ అవిళంబితామ్,
ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహాఇణీమ్,||,(03-33),
""ఓలక్ష్మణా సోదరా! ఈతని మాటలు విన్నావా, ఇవన్నీ వ్యాకరణ సమ్మతములు,క్రమముననుసరించి స్పష్టముగ యున్నవి.సహజమైన వేగము కలిగియున్నవి.పైగా అన్ని మాటలు స్వరస్థానములో పలుకబడుటచే నాకు ఆశ్చర్యము కలిగించుచున్నవని పేర్కొంటాడు.
ఏమిటీ స్వరస్థానములు,క్రమములు,వేగములని యోచించిన "" వ్యాకరణనియమములననుసరించి దోషరహితమైన భాషను సంపన్నము లేక సంస్కృతమని అంటారు.ఉచ్చారణలో శబ్ధము సరిగయున్న అయ్యది క్రమము అంటారు.ఇక ఆగకుండగ ధారాళముగ మాట్లాడుటను అవలంబితము అంటారు. కనుక ఎట్టి దోషములు లేక పలుకుట ఎదుటివారికి ఆనందము చేకూర్చును.అలా స్వరయుక్తముగ సంభాషించిన మారుతిని ప్రశంసిస్తూ
"" ఏవంవిధో యస్య దూతో న భవేత్ పార్థివస్య తు,
సిధ్యంతి హి కథం తస్య కార్యాణాం గతయో~నఘ||,(03-35)
"" ఓ లక్ష్మణా! ఇట్టి బుధ్దికుశలుడైన దూత లేకుండగ ఏ ప్రభువు అతని కార్యములు నెరవేర్చుకొనలేడు.ఈ విధమైన విశిష్టగుణములున్న దూతను కలిగియున్న రాజు అదృష్టవంతుడు.ఇట్టి దూతల మాటలప్రభావముచే ఏ రాజైనను తన పనులు చక్కదిద్దుకొనగలడ"ని హనుమని లక్ష్మణుడు పొగుడుతాడు.
అసలు హనుమ మాటలకి రామలక్ష్మణులు సంతోషించటానికి అతడు మాట్లాడిన విధానము ఒక శ్లోకములో గమనించిన,
"" రాజ్యార్హాసమరప్రఖ్యౌ కథం దేశమ్,
పద్మపత్ర్యేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ||<(03-12),
రామలక్ష్మణుల నుధ్దేశ్యించి హనుమ " అయ్యా తమరిరువురు దేవతలవలె మిగులపరాక్రమవంతులు,తామరరేకులవంటి కన్నులు గలవారు,జటావల్కములు ధరించియున్నను మీరు మహావీరులు. మీలో ఉత్తమరాజలక్షణములు గోచరించుచున్నవి.కానీ మీరు రాజ్యభోగములు త్యజించి జటావల్కములు ధరించి ఈ దుర్గమారణ్యములలోనికి వచ్చుట కారణమేమి.""యనగానే రామలక్షణులు మిగుల సంతోషించారు.
కనుక మాటలతో ఇతరులను నొప్పించటము, అన్యమనస్కముగనైనను బాధించటము కూడదని రామాయణము తెలియచేసే హితవు అందరికి శిరోధార్యము.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment