Wednesday, August 26, 2020

మంచి విచారణ

మంచి విచారణ
🕉🌞🌏🌙🌟🚩

దశాబ్దాలపాటు చీకటి గదిలో మగ్గిన వ్యక్తి చెరసాల నుంచి బయటకు వచ్చినప్పుడు, బయట కాంతిని చూడలేక, నేను మళ్లీ జైలులోకి వెళతాను అనే ఖైదీ జీవితం మనది.


పలు సంపదలు, పేరు ప్రఖ్యతలే కాదు పరిమితిని మించిన పరివారం కూడా మనిషిని కన్నూమిన్నూ కానకుండా చేస్తుంది. అలా అధిక బంధాలు కూడా అనర్థదాయకాలు...


ఆ బహుబంధ లంపటమే ఆ సర్వేశ్వరుడి సంకల్పానికి మనల్ని సుదూరం చేస్తుంది. ఆయన మనపై పెట్టుకుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తుంది. అందుకే పరివారం కన్నా ప్రథమ ప్రాధాన్యం పరమాత్మే కావాలి..


మనం ఎదుర్కొనే కష్టాలు, ఒత్తిడిలు అన్నింటినీ ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. అంటే ప్రాపంచిక బాధల బరువును పారమార్థిక బాధ్యతతో అనుసంధానం చేయాలి.అప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.


తేన త్యక్తేన భుంజీథ -త్యజించి తీసుకోవాలి అంటుంది ఉపనిషత్తు. అంటే నిస్సంగబుద్ధితో స్వీకరించాలి.


అశాశ్వతమని తెలిసిన మనం నేడు ప్రతిదానితో విపరీతంగా మమేకమై ఎడబాటు కలిగినప్పుడో లేదా మనదనుకున్న వస్తువు పోయినప్పుడో హృదయావేదనకు గురవుతున్నాం. అంతా నిష్క్రమించేవారే, అన్ని వెళ్లిపోయేవే అన్న భావన ఉంటే ఏది మనలను బాధించలేదు. కానీ మనం ఎప్పుడూ ఈ విషయాన్ని మరిచిపోతున్నాం.


ప్రతి కలయికకు ఒక విడిపోవడం ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. కర్మ మనలను కలుపుతుంది. కర్మ మనలను విడదీస్తుంది. కలవడం ఎంత సత్యమో, విడిపోవడం కూడా అంతే సత్యం. విధి నిర్ణయం ఇలా ఉన్నప్పుడు ఎవరితో మనం శాశ్వతంగా ఉండగలుగుతాం...? ఎవరు మనవారు...? ఎవరు పరాయివారు...? ఐతే అందరూ మన వారవ్వాలి, లేదా ఎవ్వరు మనవారు కాదు. కానీ మనకు భయం.


ప్రతి మనిషి తనవాళ్ళు అనుకున్నవాళ్ళంతా తనతో శాశ్వతంగా ఉండాలి అనుకుంటాడు. అది సాధ్యమవదని తెలిసినా నిస్సంగబుద్ధిని అలవర్చుకోడు. తనకుతాను ఎడబాటుకు సిద్ధం చేసుకోడు. అందుకే తనవాళ్ళు అనుకున్నవారు వెళ్ళిపోయినా వెంటనే బాధలో కురుకుపోతాడు..


అనుబంధాల వలన కలిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గతంలోకి వెళ్ళి దుఃఖిస్తూ జీవితాన్ని వెళ్లదీయడమో చేస్తున్నాడు. కానీ.... మరణం జీవననాటకం నుంచి తనను కూడా తొలగించబోతున్నదనీ, భగవంతునికి ఆలంబనగా చేసుకొని జీవించడమే జీవిత ప్రయోజనమనీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు .


ఇది మన బలహీనత. మన అశక్తత. ఈ అశక్తత నుంచి బయటపడాలి. సంగరాహిత్యాన్ని అలవర్చుకోవాలి. దేనితోనూ పూర్తిగా మమేక మవకుండా, కావలిసినప్పుడు మనస్సును నిలిపి, మళ్ళీ అనుకున్న వెంటనే మనస్సును వ్యక్తి లేదా సంఘటన నుండి విడదీయ గలగటమే... " తపస్సు"....


-సర్వేజనాః సుఖినోభవంతు._

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment