Thursday, June 10, 2021

శ్రీ రాముడు ఆదర్శనీయుడు

🕉️ శ్రీ రాముడు ఆదర్శనీయుడు🕉️

✍️ మురళీ మోహన్

🙏 భారతీయులలో చాలామంది రాముణ్ణి ఆరాధిస్తారు. కానీ మీరు అతని జీవిత పరిస్థితులను, అతని జీవితం నడచిన తీరును గమనిస్తే, అది అంతా ఓ విపత్తుల పరంపరగా అనిపిస్తుంది. అతను ధర్మ బద్ధంగా తనది కావలిసిన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పైగా అడవులు పట్టి పోవలసి వచ్చింది. అంతలోనే అతని ధర్మపత్ని అపహరణం. అందుకోసం అతనికి ఇష్టం లేకపోయినా ఒక ఘోర సమరం చేయవలసి . అప్పుడామె నిండు గర్భవతి. కవలలకు జన్మనీయబోతూ ఉంది. ఆ తరువాత, తన కన్నబిడ్డలే అని తెలియని పరిస్థితిలో, వారితోనే యుద్ధం చేశాడు. చివరకు తన భార్యను కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక ఎడతెగని విపత్తు. ఇంత జరిగినా, ఎందుకు జనులు రాముణ్ణి ఆరాధిస్తారు ?

రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో అతను ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడన్న దానిలోనే అతని ఔన్నత్యం ఉన్నది. ఏనాడూ అతనిలో కోపం లేదు, ఎవరినీ నిందించటం లేదు, గగ్గోలు పెట్టడం లేదు. అతడు అన్ని సందర్భాలలోను ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు.

అందువల్లనే పవిత్ర జీవనాన్నీ, ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులు రామునిలా జీవించాలని తపిస్తారు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఏక్షణంలోనైనా విషమించగలవు అని వారు తెలుసుకున్నారు. ఆ విజ్ఞతను వారు పొందారు. ఎన్నో రకాలుగా జీవిత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు విషమించే ఆస్కారం ఉంది. మీరు అన్నీ సక్రమంగానే నిర్వహించుకోవచ్చు. కానీ ఒక వేళ తుఫాను లాంటి సమస్య వస్తే మాత్రం అది మీ ఇంటిని, మీ సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. “నాకేమీ అలా జరగదులే’’ అని అనుకోవడం మూర్ఖంగా బ్రతకటమే అవుతుంది. “ఒకవేళ అదే జరిగినా కూడా నేను దానిని ధైర్యంగా ఎదుర్కొంటాను’’ అని అనుకోవడం వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత రామునిలో కనిపిస్తుంది. అందుకే జనులు అతన్ని ఆరాధిస్తారు.

మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేసారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్నలు కావు. ఏది జరిగినా, మిమల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం

దీని అర్థం, మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోకూడదనా? కానే కాదు! మన చుట్టూ ఉన్న వ్యవహారాలను చక్కగా సరిదిద్దుకోవాలి. అది అందరికీ మంచిది. అలా ఒక పరిస్థితిని చక్కగా నిర్వహించినప్పటికీ కూడా, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుందని చెప్పలేము. కాని ప్రతి పరిస్థితిలోనూ మనల్ని మనం మనోజ్ఞంగా నిలబెట్టుకోగలిగినప్పుడు, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుంది. ఐనా, అందరి శ్రేయస్సు పట్లా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనం ఏ పరిస్థితినైనా సక్రమంగా నిర్వహించాలి.

తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు. కానీ అన్ని వేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. పరిస్థితులు నియంత్రణను దాటిపోయాయి. కానీ ముఖ్యమైన విషయం ఒక్కటే. అతడు అన్నివేళల ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. మీ జీవితం ఒక సుందర పరిమళపుష్పంలా వికసించాలంటే దానికి సానుకూలమైన అంతర్గత పరిస్థితిని కల్పించుకోవాలి. అటువంటి స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని మీరు ఎల్లప్పుడూ సృష్టించుకోవాలి. ఇందుకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యనీయుడు! 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment