Friday, January 28, 2022

*మేము తెలుగోళ్ళం* (కవిత) ✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు

మేము తెలుగోళ్ళం (కవిత)
✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు

అమ్మ పాలు ఔషధమని
అందరి ముందు ఊదరగొడతాం.
ఇంటి పాపకు మాత్రం పోతపాలే పడతాం
ఎందుకంటే మేము తెలుగోళ్ళం !
మాకు నచ్చిందే పాటిస్తాం !!

పుస్తకం హస్తభూషణమని
అపర బుద్ధినిలా బోధిస్తాం.
వాట్సాప్, ఫేస్ బుక్ లతో బద్ధకంగా బ్రతికేస్తాం!
ఎందుకంటే మేము తెలుగోళ్ళం!
మాకు నచ్చిందే పాటిస్తాం !!

పెరుగన్నం ఆరోగ్యమని
పెద్ద పెద్ద లెక్చర్లిస్తాం!
పిజ్జా బర్గర్ కోసం పడిగాపులు కాస్తాం
ఎందుకంటే మేము తెలుగోళ్ళం!
మాకు నచ్చిందే పాటిస్తాం !!

పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాళ్ళమని
మీసం మెలేస్తాం.
పొద్దున లేస్తే ప్యాషన్ బట్టలే వేస్తాం.
ఎందుకంటే మేము తెలుగోళ్ళం !
మాకు నచ్చిందే పాటిస్తాం !!

తెలుగు రుచుల కమ్మదనం
“వంటల షో”లలోనే ఒంపుకుంటాం!
కర్రీ పాయింట్ దయతోనే
ఇంటిల్లి పాదీ కడుపు నింపుకుంటాం
ఎందుకంటే మేము తెలుగోళ్ళం !
మాకు నచ్చిందే పాటిస్తాం !!

తేనెలూరు తెలుగంటూ
తెల్లారుతూనే మొదలెడతాం!
ప్రక్కవాడితో పరాయి భాషలో ప్రవచిస్తాం!
ఎందుకంటే మేము తెలుగోళ్ళం !
మాకు నచ్చిందే పాటిస్తాం !!

అమ్మభాష అమృత భాషని
అదనపు హంగులు చేర్చి వర్ణిస్తాం!
మా పిల్లలను ఆంగ్లంలోనే చదివిస్తాం
ఎందుకంటే మేము తెలుగోళ్ళం !
మాకు నచ్చిందే పాటిస్తాం !!

పద్యం, గద్యం చదివితే
మద్యం అక్కర్లేదంటాం!
అర్ధం కాని రైమ్స్ బట్టీ పట్టిస్తాం!
ఎందుకంటే మేము తెలుగోళ్ళం!
మాకు నచ్చిందే పాటిస్తాం !!

బడి పిల్లలకు ఆలోచనా బలమిచ్చేది
అమ్మభాషేనని అంగీకరిస్తాం!
బడిలో బాల్యాన్ని మాత్రం ఆంగ్లభాషలో బంధిస్తాం !
ఎందుకంటే మేము తెలుగోళ్ళం!
మాకు నచ్చిందే పాటిస్తాం

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment