Friday, January 28, 2022

నేటి జీవిత సత్యం. *🔥కష్ట సుఖాలు🌀*

నేటి జీవిత సత్యం. 🔥కష్ట సుఖాలు🌀


మనిషికి ఇష్టమైనవన్నీ సుఖాలుగా, అయిష్టమైనవన్నీ కష్టాలుగా అనిపిస్తాయి. ఒక బాలుడికి తెలుగుపంతులుగారంటే మహా ఇష్టం. ఆయన పాఠం చెబుతూ ఉంటే ఆ విద్యార్థి వింటూ పరవశించి పోయేవాడు. ఆ విద్యార్థికి గణితం తలకెక్కేది కాదు. ఇంకో విద్యార్థికి లెక్కల తరగతిలో మహాఉత్సాహం కలిగేది. ఒక్క తరగతి గదిలో సంగతే కాదు.

ప్రపంచమే అంత! మానవ సంబంధాలు, అనురాగద్వేషాలు... అన్నీ ఇలాంటివే!
‘జూదమూ వాదమూ ఖేదాన్ని కలిగిస్తాయి’ అని ప్రసిద్ధ తమిళ యోగిని అవ్వైయార్‌ సూక్తి. జూదంలో ఓడినవాడు అక్కడే ఏడుస్తాడు. గెలిచినవాడు

జూదంలో వచ్చిన డబ్బు వ్యసనాలకే ఉపయోగించి సర్వనాశనం అవుతాడు. వాదంలో ఓడినవాడు అవమాన భారంతో కుంగిపోతాడు. గెలిచినవాడు కూడా మనసులో కొంత బాధను దాచుకుంటాడు. దుర్యోధనుడు మాయా జూదంలో గెలిచినా చివరకు ఏడుపే మిగిలింది. వ్యసనాలన్నీ కష్టహేతువులే! అవి ఇచ్చే సుఖాలు తరవాత అనేక కష్టాలకు కారణమవుతాయి. నలచక్రవర్తి అంతటి మహాపురుషుడు సైతం జూదం వల్ల కష్టాలపాలైన సంగతి సుప్రసిద్ధం. స్వానుభవంతో శుక్రాచార్యుడు సురాపానంవల్ల లోకానికి జరిగే హానిని తెలుసుకొని అది ఒక పాపంగా శపించాడు. మద్యపానం అలవాటైనవాళ్లు దాన్ని మానడం కష్టం! మద్యం మత్తు వాళ్లకు సుఖంలా భ్రమగొల్పుతుంది. ఆ భ్రమలో పాపం పుణ్యం భేదం తెలియదు. మాటల్లో కాఠిన్యం కూడా ఒక వ్యసనమే! ఈ వ్యసనం శిశుపాలుణ్ని బలితీసుకున్నది.
జయాపజయాలు దైవాధీనాలు అంటారు. జయం పొందాలంటే దైవ అనుకూలత మాత్రమే గాక పట్టుదల, ప్రోత్సాహం సైతం చాలా అవసరం. జోధ్‌పూర్‌ రాజు ససైన్యంగా యుద్ధానికి వెళ్లాడు. ‘ఈ సమరంలో నాకు జయం లభిస్తుందా...’ అని యుద్ధం మధ్యలో సందేహం కలిగింది. వెంటనే బాగా అలసటగా అనిపించింది. అర్ధరాత్రి కావస్తూంది. ‘ఇక ఏ మాత్రం ఓపిక లేదు! రేపు మళ్ళా వచ్చి యుద్ధం చేయవచ్చు లే!...’ అనుకుంటూ తిరిగి తనరాజ్యానికి చేరాడు. ఇంటి తలుపు తట్టాడు. ‘నా భర్త అయితే యుద్ధంలో విజయం సాధించి విజయ దుంధుభులు మోగుతూండగా సంబరాల నడుమ ఇంటికి వచ్చేవాడు అలాంటివేం లేవు.

కాబట్టి ఇప్పుడు తలుపు తడుతున్నది మహారాజు కాదు. ఆయనైతే ఇలా అర్ధరాత్రి యుద్ధభూమినుంచి పారిపోయి ఇంటికి రానేరాడు. అందువల్ల ఎవరూ తలుపుతీయ వద్దు!’ అని రాణి దాసీజనానికి ఆజ్ఞాపించింది. భార్య మాటలు రాజు హృదయానికి సూటిగా తాకి మిక్కిలి కష్టం కలిగించాయి.

వెంటనే మిక్కిలి కసితో యుద్ధభూమికి తిరిగివెళ్ళాడు. వీరవిహారంతో శత్రువుల్ని మట్టికరిపించి, విజయధ్వజం ఎగురవేశాడు.
25 సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా ఒక గొప్ప శత్రువుతో యుద్ధం గావించిన మహాయోధుడు ప్రతాప్‌. ఆయన శత్రువు అక్బర్‌ చక్రవర్తి! లక్షల్లో ఉంటుంది ఆయన సైన్యం. తుపాకులూ ఫిరంగులు వారి ఆయుధాలు. ప్రతాపుడి సైన్యం వేల సంఖ్యలో ఉంటుంది. వాళ్ళు కూడా శిక్షణ లేని ఆటవికులైన భిల్లులు. వారి ఆయుధాలు కొడవళ్లు, చిన్న కత్తులు, విల్లంబులు! తోటి రాజపుత్ర వీరులెవరూ తోడుగా రాలేదు. పైగా ఎక్కువ మంది అక్బర్‌ పక్షం వహించారు. చివరకు ప్రతాప్‌కి ఆహారం దొరక్క గడ్డి రొట్టెలనే తినవలసి వచ్చినా అది పెద్ద కష్టంగా భావించలేదు. తన లక్ష్యం మేవాడ్‌ రాజ్యానికి స్వాతంత్య్రం సంపాయించడం. ఎన్ని కష్టాలు ప్రతిబంధకాలు ఎదురైనా వెనుదీయకుండా కడకు తన రాజ్యానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన రాణాప్రతాప్‌ పోరాట స్ఫూర్తి అనుపమానమైంది.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment