Monday, February 5, 2024

ఆత్మస్తుతి పరనింద....

 ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి, ఉత్తేజాన్ని కలిగిస్తాయి అయినా ఆ సంతోషం ( శునకానందం) తాత్కాలికం. స్వల్ప విజయాలను ఘన విజయాలుగా ఊహించుకుని, ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు ( సెల్ఫ్ డబ్బా) జీవితం లో రాణించలేరు. తనంతటి వాడు ఈ భూప్రపంచం లో లేడని తనకు తానే సాటి అని భ్రమ పడేవాడు ఒక అజ్ఞాని. ఆత్మస్తుతి ఆత్మహత్య తో సమానమని అంటారు... ఆత్మస్తుతి చేసుకునే వారు ఇతరుల దోషాలు ఎంచడం లో ప్రవీణులు. వేమన కవి చెప్పినట్లు  "తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు" నీతి వాక్యం లా వీరికి తమ దోషాల గురించి తెలియదు......అకారణ ద్వేషం అనర్థదాయకం. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృధా చేసుకునే వారు, తమ జీవితం లో ఏదీ సాధించలేరు.. అసూయ ద్వేషాలు తోబుట్టువులు. అవి మనసులను కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటి వారి ఉన్నతిని చూసి ఓర్వలేక పోవడం, సంకుచిత మనస్తత్వం, అసూయ ద్వేషాలను రగిలిస్తుంది మరియు పగను పెంచుతుంది. అసూయపరుడు మానసిక వేదనకు, ఒత్తిడి కి గురై తన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటాడు.. జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి జ్ఞానం తో పాటు మనసులో మానవత్వం పరిమళాలు వీచాలి, తోటివారిని ప్రేమించి, వారికి సాయం చేసే సహృదయత ఉండాలి. వీరు ఇతరుల దోషాలు పట్టించుకోరు. వీరు సజ్జన సాంగత్యం తో దుష్ట ఆలోచనలకు దూరంగా, అసూయ ద్వేషాలను మనసుకు చేరనీయకుండా, నిర్మల మనస్సుతో తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకుని విజయం సాధిస్తారు. వీరు తమ అభివృద్ధి తో పాటు, ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటూ, నిరంతరం సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తారు........ పోలిన.ఆర్.కె.భగవాన్..రాజమండ్రి

No comments:

Post a Comment