మధుర గీతాలు 1:
#వీటూరి గా తమ ఇంటి పేరుతో ప్రసిద్ధులైన సినీగేయ రచయిత #వేంకట_సత్యసూర్యనారాయణమూర్తి గారు 1934,జనవరి 3న విజయనగరం జిల్లా రెడ్డివలస గ్రామంలో జన్మించారు. భాష, వ్యాకరణం, ఛందస్సులు వారసత్వంగా సంక్రమించినా వారు స్వయంగా సంగీతకారులు. తమ పాటలకు హార్మోనియంపై స్వీయ సంగీతంతో సొబగులద్దారు. స్వయంగా రూపసేమో 'కల్పన' నాటకంతో కథానాయిక పాత్రతో నటించి మెప్పించి నాటక రంగాన్ని తన తొలి కళారంగంగా స్వీకరించారు.
ఈ అనుబంధాన్ని ఆయన తరువాత సినిమాల్లో కూడా అనుసరించారు. పద్యాల బాణి వదిలి పాటల దారి పట్టిన తెలుగు సినిమాలకి హృద్యమైన పద్యాలను పొదిగి సినిమాని నాటక రంగానికి అనుసంధించారు. 'గౌరీ ప్రొడక్షన్స్" వారి "ఆకాశరామన్న” చిత్రానికి ఆయన రాసిన హృద్యమైన పద్యాలు ఈ ప్రయత్నానికి నిదర్శనం. ఈ పద్యాలతో ఛందస్సుతో పాటు చమత్కారాన్ని కూడా జొప్పించారు. మచ్చునకు కొన్ని..
తేనె పూసిన కత్తీ నీ దేశభక్తి
వంచనల పుట్ట నీ పొట్ట వదరుపిట్ట
చాలు నీ ద్రోహ బుద్దులు సాగవింక
నీచ జనసంగ! నరసింగ! నీరసాంగ
అంటూ సర్వాధికారి బుద్దుల్ని చమత్కరించారు.
మరొక పద్యంలో జిత్తులమారి నక్క లాంటి “వాచాలు'ని కుయుక్తిని తూర్పారబెట్టారు.
"మంచిగా నిధిని కాజేయ కాచుకున్న కొంగ,
గజదొంగ, మీసాల బుంగా
బళిర నీవు మహరాజునే మార్చినావు గదర! ఏమార్చినావు గదర
ధూర్త వాచాల - నీ నోట దుమ్మురాల!"
కళల పేరిట తప్పుడు పనులు చేసే మంజరి గురించి ఈ పద్యంలో ఇలాగంటారు.
"తళుకు బెళుకులు చూపించి ధర్మరాజు వంటి రాజును వ్యసనాల వశము చేసినావే
కామ మంజరీ, నంగనాచీ! ఇక నీ పని సరి, గోదావరే నీకు దారి.”
ఈ పన్నాలే కాక ఈ చిత్రం పాటల్ని కూడా వీటూరి వారే వ్రాసారు. ఇదే చిత్రంలో యుగళ గీతాలు, స్ఫూర్తి గీతం, జానపద బాణీతో పాటలు వ్రాసారు. పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి పాడిన 'దాగవులె దాగవులె, ఉబికి ఉబికి ఉప్పొంగె మోహాలు ఆగవులే' అనే వలపు గీతంలో 'వినిపించే ఊసులలోన వింతేమిటున్నది? వినరాని ఊహలోనే సంగీతమున్నది' అని వాస్తవాని కన్నా ఊహ ఆనందాన్నిస్తుందని పరోక్షంగా పేర్కొన్నారు. వాస్తవం మన కళ్ళముందు కనిపిస్తుంది. దాన్ని మనం మార్చలేం. కానీ ఊహ మనసులో ఉంటుంది. మనకు నచ్చిన రీతిలో ఊహించుకోగలం.
ఇక "ముత్తెమంటి సిన్నదాన్ని మొగలిరేకు వన్నెదాన్ని మొగమాట పడతావేం రాయుడా అబ్బ అబ్బ అబ్బ నీ జబ్బను చూసి వచ్చాను రాయుడా" అనే పాట జానపద బాణితో సాగుతుంది.
”జై ఆకాశరామన్నకు జై'' అనే పాటలో
"ధర్మం ఒక్కటే ఓడిపోనిది
న్యాయం ఒక్కటే తిరుగులేనిది
పదరా దేశం పిలుస్తున్నది
అందరిదీ ఒకే మాట
అందరిదీ ఒకే బాట
సాగనీము దుండగాలు ఇంకిటుపైనా సాధిస్తాము ఆశయమే ఎన్నటికైనా” అని దేశభక్తి స్ఫూర్తి నింపారు.
22 ఏళ్ళ ప్రాయంలో 1937లో 'అక్కాచెల్లెలు' సినిమాతో ప్రారంభమైన వీటూరి వారి సినీ ప్రయాణం అలుపెరుగక, ఆగక దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగింది. ఈ ప్రయాణంలో వారిలో స్ఫూర్తి నింపిన ద్రష్టలు సదాశివ బ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజు వంటివారు. వారి ఆశీస్సులు ఆయన చేత ఎన్నో మన్నికైన, ఎన్నికైన సినిమాలకి కథ, మాటలు, పాటలు వ్రాయించింది. ఇరవైకి పైగా సినిమాలకు కథ, మాటలు, 50కి పైగా పద్యాలు, పాటలు అందించిన వీటూరి గారు 1962లో వచ్చిన 'స్వర్ణగౌరి' చిత్రానికి కథ, పాటలు వ్రాసారు.
ఈ చిత్రంలో వీరు వ్రాసిన పాటలన్నీ సుపెర్ హిత్. ముఖ్యంగా 'జయమీవే జగదీశ్వర కావ్యగాన కళాసాగరీ' అనే పాట ఇప్పటికీ నర్తనశాల చిత్రంలో 'జననీ శివకామినీ' పాటలాగా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గుడిలోను, ఆకాశవాణి కేంద్రాలలో వినిపిస్తుంటుంది. జగన్మాత ఒక్కసారి మనల్ని చూసి చిరునవ్వు నవ్వినా అది కొన్ని కోటి వరాలకి సమానం అనే భావాన్ని స్ఫురింపజేస్తుంది. "దరహాసాలే వరాల స్వరాలు" అన్న పంక్తి. ఇదే చిత్రంలో భక్తి రసం ఉట్టిపడే పాటలే కాక కరుణరసభరితమైన పాటలు, వలపు గీతాలు కూడా వ్రాసారు.
'స్వర్ణగౌరి' చిత్రం విజయంతో వీటూరి గారు సప్తస్వరాలు, కదలడు వదలడు, దేవత, ఆకాశరామన్న, చిక్కడు దొరకడు, భక్తతుకారాం సినిమాలలో కథ, మాటలు, పాటలతో తన ముద్రని సొంతం చేసుకున్నారు. తొలినాళ్ళ వీటూరి సాహితీ ప్రస్థానం సాంఘిక చిత్రాలతో ప్రారంభమైంది. ఎంటీ.రామారావు, సావిత్రి జంటగా నటించిన 'దేవత' చిత్రంలో ‘తొలి వలపె పదె పదె పిలిచె’, ‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ- గుండెల్లో గుసగుసలు వినిపించనీ’, ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ ఈ మూడు పాటలూ వీటూరి వారి పాటల తోటలో విరిసిన వసివాడని కుసుమాలు, నిరంతరం సుగంధాలు వెదజల్లే నవపారిజాతాలు. కొన్ని సినిమాలు గుర్తుండిపోవడానికి కొన్నిసార్లు పాటలే కీలకమవుతాయి. దానికి 'దేవత' చిత్రం ఒక ఉదాహరణ. 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి', ఈ పాటలో ప్రతి వాక్యం స్త్రీ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంది. ముఖ్యంగా 'సతియే గృహసీమను గాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా’..ఈ ఒక్క వాక్యంతో స్త్రీ ఔనత్యాన్ని హిమాలయాల ఎత్తుకు పెంచడమే కాక స్త్రీకి 'దేవత'గా అపురూపమైన స్థానాన్ని సుస్థిరం చేశారు.
స్త్రీ గురించి ఇక ఎవరు ఎంత గొప్పగా చెప్పినా సూర్యుడి ముందు దివిటీ పట్టినట్లే ఉంటుంది.
70, 80 ల మధ్య తెలుగు సినిమా కొత్త పోకడలు చూపించింది. ఈ మార్పులను వీటూరి వారు తమ సృజనాత్మకతకు అవకాశాలుగా తీసుకున్నారు . ఈ సినిమాలలో కథానాయకుల వ్యక్తిత్యాన్ని ఆవిష్కరించడంలో ఆయనది ఒక విలక్షణమైన 'శైలి'. 'మల్లెపువ్వు’ చిత్రంలో వీటూరి గారు రెండు పాటలు రాశారు. అందులో ఒక్కపాట ప్రశ్న- జవాబు బాణీతో సాగుతుంది.‘చక చక సాగే చక్కని బుల్లెమ్మా, మిసమిసలాడే వన్నెల చిలకమ్మా నీ ఊరేమిటో నీ పేరేమిటో’ అని అతడు ప్రశ్నిస్తే; ‘గలగల పారే ఏరే నా పేరు, పొంగులు వారే వంటే నా ఊరు, చినదానను వేచినదానను’ అని జవాబు ఇస్తుంది. ఈ పాటలో చకచక, మిసమిస, గలగల, కసికసి లాంటి ధ్యన్యనుకరణ పదాలు ప్రయోగించారు.
ఇదే చిత్రంలో ‘నువ్యు వస్తావని బృందావని తిరగి చూసేనయ్యా కృష్ణయ్య’ అంటూ వాణిజయరాం గళంలో సాగిన పాట మనలో 'ఆర్తి' నింపుతుంది. 'మల్లెపువ్వు' చిత్రం కన్నా ముందుగా వచ్చిన 'శారద' చిత్రంలో ‘రాధాలీలా గోపాలా గానవిలోలా యదుబాలా’ అని సాగే ఈ పాట మొదటి చరణంలో 'మనిషిని చేసి మనసెందుకిచ్చావు? ఆ మనసును కోసే మమతలెందుకు పెంచావు? మనసులు పెనవేసి, మమతలు ముడివేసి మగువకు పతి మనసే కోవెలగా చేసి ఆ కోవెల తలుపులు మూశావా? నువు హాయిగా కులుకుతు చూస్తున్నావా? నీ గుడిలో గంటలు మ్రోగినవి, నా గుండెల మంటలు రేగినవి..'. పతియే ప్రత్యక్ష దైవం అని భావించే ఒక మామూలు పల్లెటూరి పిల్లను ఆ దైవదర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా ఆ కోవెల తలుపులు మూసేస్తే ఆ స్త్రీ పడే వేదనను ‘నీవు హాయిగా కులుకుతు చూస్తున్నావా’ అనే వాక్యంలో మన కళ్ళని కన్నీటితో నింపేశారు. నువు హాయిగా నవ్వుతున్నావా అనో, నువు హేళనగా చూస్తున్నావా అనో రాసి ఉండొచ్చు కానీ వీటూరి గారు నువు హాయిగా కులుకుతు చూస్తున్నావా? అని రాసి 'కులుకుతు' అన్న పదప్రయోగంలో ఆ అమాయకపు స్త్రీలోని బాధని, నిస్సహాయతని, దేవుడి మీద అక్కసుని చాలా చక్కగా విశదీకరించారు. "కులుకుతు' అన్న చిన్న మాటతో ఒక పాత్ర స్వభావాన్ని, మానసిక స్థితిని మొత్తంగా తీసుకురావడం వల్ల అది గొప్ప పాటగా నిలిచిపోయింది.
80 లలో దూకుడు పెంచిన తెలుగు సినిమా వారి ప్రయోజనాలను ఆయన అలవోకగా అందిపుచ్చుకున్నారు. 'యమగోల' చిత్రంలో ‘ఆడవే అందాల సురభామిని' ఈ పాట రాసినది 'వీటూరి’ కానీ వేటూరి అని తప్పుగా అచ్చయింది. వేటూరి సుందరరామమూర్తిగారు, వీటూరి తర్వాత వచ్చిన వారే అయినా వేటూరి గారి పేరు ఎక్కువగా వినిపించడంతో వీటూరి రాసిన పాటలు కూడా వేటూరి రాసినవిగా చలామణి అయ్యాయి. ఆ జాబితాలో ‘ఆడవె అందాల సురభామిని’ ఒకటి. ఈ పాటలోని సాహిత్యాన్ని విశ్లేషించే సాహసం నేను చెయ్యదలచుకోలేదు. బందరు లడ్డు తియ్యగా ఉంటుందని తెలుసు కానీ ఎంత తియ్యగా ఉన్నది ఎవరికి వారు రుచి చూసి తెలుసుకోవాలి. ఈ పాటలోని సాహిత్యపు మాధుర్యాన్ని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆస్వాదించాల్సిందే.
ఇదే చిత్రంలో వీరు వాంప్ పాత్రకు రాసిన పాట
‘గుడివాడ వెళ్ళాను; గుంటూరు పొయ్యాను; ఏలూరు, నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ సూసినా ఎంత సేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు’
ఈ పాట పల్లెటూరి యాసతో వ్రాసారు. ఇందులో ‘ఏడ సూసినా ఎంత సేసినా ఏదో కావాలంటారు..సచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు’ ఇక్కడ 'ఆట' అంటే దంచె అని అర్థం. దంచె ని అచ్చ తెలుగులో ఆట అంటారు. అలాగే ‘సచ్చినోళ్ళు’ అన్న పదం. వీటూరిగారు సాహిత్యపు విలువలతో గొప్ప పాటలు రాయడమే కాక ఊరు యాసలతో ఇలాంటి పాటలు కూడా వ్రాసారు.
‘ఆడవె అందాల సురభామిని’ అని అప్సరసల అందాలను వర్ణించినా,గుడివాడ వెళ్ళాను అని మానవకాంత చేత చిందులేయించినా ఒక కమనీయమైన వినోదానికి గేయ రూపమిచ్చారు.
ఈ కాలంలో అంటే 70,80 దశకాలలోని సినిమాల ఒరవడి నిజంగా ప్రత్యేకం. కొత్తదనం కథలోను, మాటల్లోను, పాటల్లోను, సంగీతంలోను అవసరమైన రోజులవి. వేగవంతమైన ఈ మార్పుకు అనుగుణంగా స్పందించడం సహజ కవులకు మాత్రమే చెల్లుతుంది.
సినిమాలలో విరహానికి, శృంగారానికీ వీటూరివారు తమ కలంతో హందాతనం తెచ్చారు. ‘వయసు పిలిచింది' చిత్రంలో 'మబ్బే మసకేసిందిలే’ పాట గ్రామఫోను రికార్డుల్ని అరగదీసిన పాట. చిరకాలం సినిమాలో నిలిచిపోయిన హీరోలను, పాత్రలను వ్యక్తీకరించిన పాట. అదే విధంగా చిలిపి హీరోయిజాన్ని తలపించే ‘హలో మై డియర్ రాంగ్ నంబర్’ ని మనం మర్చిపోగలం? ఈ ఒరవడిలో మరో అందమైన పాట ఎర్ర గులాబీలు చిత్రంలో 'ఎదలో తొలి వలపే". వయసు పిలిచింది, మన్మథ లీలలు, ఎర్రగులాబీలు చిత్రాలకు ఆయన రాసిన పాటలు మారుతున్న అభిరుచులకు తగిన కల్పనానుభూతులే కాదు సంగీతదర్శకులను సైతం కొత్త ప్రయోగాలకు ప్రోత్సహించింది. ‘ఇదాలోకం’ చిత్రంలోని 'గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు ‘ పాట ఒక రసభరిత అక్షర సృష్టి.
వీటూరి వారి ఒరవడి గమనిస్తే జానపదం ఆయనకు ప్రత్యేకంగా ఇష్టమైనదనిపిస్తుంది. ఆయన పాటల బాణి జనసామాన్యంలోని పదప్రయోగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. జానపద చిత్రాలకు వీటూరి వారు చిరకాలం గుర్తుండిపోయే సొగసైన పాటలందించారు. పాటల వ్యక్తిత్వంతో పాటు కొసమెరుపుగా హాస్యాన్ని చతురతను ఈ పాటలు మనకు స్ఫురింపజేస్తాయి. మరికొన్ని పాటలు చలాకీ కన్నెపిల్లల్ని మన కళ్ళ ముందు నాట్యమాడిస్తాయి. సప్తస్వరాలు, మర్యాదరామన్న, చిక్కడు దొరకడు, రాజసింహం,కత్తికి కంకణం ఇలా మచ్చునకు కొన్ని. 'యదుబాలా శ్రితజన పాలా దరిశన మీవయ్యా గోపాలా, హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జేజేలు పలుకగ’ వంటి హృద్యమైన పాటలతో ‘సప్తస్వరాలు' చిత్రాన్ని చిరస్మరణీయం చేశారు. ప్రజల చేత జేజేలు అందుకున్నారు. "బుల్లెమ్మా సౌఖ్యమేనా ! ‘నీలినీలి కళ్ళలోన ఎఱ్ఱ ఎఱ్ఱ జీరలాయే , కుర్రాడి గుండెలోన చెప్పరాని గుబులాయె ఋల్లెమ్మా’ అంటూ ప్రియురాలిని ఉడికించిన కథానాయకుడు ‘కదలడు వదలడు’ చిత్రంలో మనకి కనిపిస్తాడు.
ఇదే జానపద బాణిలో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో టం సౌందరరాజన్ పాడిన ‘సెబితే సానా వుంది! యింటే ఎంతో వుంది సెబుతా యినుకోరా యెంకట సామి’. ఈ పాటలో, వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు .
ఇక ‘బంగారు తిమ్మరాజు’ చిత్రంలో ‘నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన’ శ్రోతలను అలరించిన మరో జానపదం. ఈ పాటలోని పదాల అల్లికలు చిలిపి ప్రేలాపనలు. తెలుగునుడిలోని మాధుర్యాన్ని మనకు చవిచూపిస్తాయి.
ప్రఖ్యాత హస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం 1967 లో విడుదలైంది. ఈ చిత్రానికి వీటూరి గారు పాటలు రాయడమే కాకుండా 'ఏమి ఈ వింత మోహము’ అనే పాటలో గాత్రం కూడా కలిపారు. ఈ పాటకి మరొక విశేషం ఉంది. గాన గంధర్యుడు శ్రీ బాల సుబ్రహ్మణ్యం తెలుగుచిత్ర సీమలో నేపథ్య గాయకులుగా అరంగేట్రం చేసిన పాట. వీటూరి గారే బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చిత్రసీమకి పరిచయం చేసినది.
భక్తి రసం ఉట్టిపడే పాటలలో వీటూరి తమ ప్రత్యేకతను మళ్ళీ చాటుకున్నారు. మాటలైనా, పాటలైనా పాటల వ్యక్తిత్వాన్ని వాటిలోని సాహిత్యం మనకి పరిచయం చేస్తుంది. భక్తికి వ్యక్తిత్యాన్ని రంగరించి సాంఘిక, పౌరాణిక, చారిత్రక, ఇతిహాస నేపథ్యాలతో పాత్రల మనోభావాలను స్ప్రశించిన అక్షర చిత్రకారుడు వీటూరి.
ఈ ప్రయత్నంతో ఆయనకి ఎనలేని పేరుని తెచ్చిపెట్టిన చిత్రం భక్తతుకారాం. ఈ చిత్రంలోని మాటలు, పాటలు సహజ ధోరణిలో సాగుతాయి . కథకు మరాఠీ మూలాలున్నా అచ్చ తెనుగు సోయగం అణువణువున నింపుకున్న పాటలతో అద్భుతమైన అనుభవాన్ని వీటూరి వారు మనకు కానుకగా ప్రసాదించారు. భావానికి భాషాంతరం లేదు కదా ?..
‘భలె భలె అందాలు సృష్టించావు’ అనే పద ప్రయోగం ఆయన భాషా పరిజ్ఞానానికి తార్కాణం. ఈ పాటలో ఆయన ఆవిష్కరించిన మనోజ్ఞ ప్రకృతి చిత్రం మన మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతుంది. లౌకిక జగత్తులో నిరంతరం ప్రయాస పడే తుకారాం భార్య పాడే సంబరాల పాట 'ధాన్యలక్ష్మి వచ్చింది మా ఇంటికీ, జాజిరె జాజిరి నీ ఇల్లే కస్తూరి’ అనే పదాల వరుస అమాయకమైన సగటు గృహిణిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తుంది. ఇదే చిత్రంలో ‘పాండురంగ నామం, పరమ పుణ్యధామం’ అంటూ మన చేత నామ పారాయణం చేయిస్తారు వీటూరివారు. భక్తతుకారాం కంటే నాలుగేళ్ళ ముందు అంటే 1969 లో విడుదలైన సప్తస్వరాలులోని 'జయ మహారుద్ర రేద్రోద్భవా' పాటలో కనిపించే ఉద్వేగానికి, భక్తతుకారాం చిత్రంలో పాటలోని సాత్విక భక్తికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. పాత్రోచిత భావాన్ని వీటూరి గారు బహు చక్కగా రకరకాల పాటల్లో చూపించారు. అటువంటి మరో కమనీయ నృత్యగీతం ‘స్వర్ణగౌరి’ చిత్రంలో మనల్ని అలరిస్తుంది. 'ఓంకార నాద స్వరూపా’ అనే శ్లోకంతో ప్రారంభమయ్యే ఈ గీతం పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ గళాలతో ప్రాణం పోసుకుంది. మరొక నృత్య గీతం ‘శ్రీరామ కథ’ చిత్రంలోని ‘సర్వకళాసారము నాట్యము' అంటూ సాగుతుంది. ఈ పాటలో నాట్యము కైవల్య సాధనము అంటూనే అంగభంగిమల అందము వెలయించి అంటూ సౌందర్యావిష్కరణ చేసారు వీటూరి వారు.
స్వయంగా దేవీ ఉపాసకులైన వీటూరి గారు మాంగాడు అమ్మ వారికి అక్షరనైవేద్యం సమర్పించుకున్నారట . ఈ విషయాన్ని వరుసకు అన్నకొడుకైన శ్రీ యామిజాల జగదీశ్ తాము వ్రాసిన వ్యాసంలో తెలియజేశారు. 'జగద్గురు ఆదిశంకరాచార్య' సినిమాలో ఆయన రాసిన ‘త్రిపుర సుందరీ’ అనే గీతం ఆయనలోని భక్తి పరతత్వాన్ని, ఆర్తిని మనకు ఆవిష్కరిస్తుంది. ఇటువంటి ఎన్నో వైవిధ్య భావాలను అనుభూతులను మనకు కానుకగా అందించిన పాటల ఘనాపాటి వీటూరి. ఐదు దశకాలు మాత్రమే జీవించి తమ పయనాన్ని అనారోగ్య కారణంగా అర్ధాంతరంగా ముగించినా వీటూరి వారి సినీ గీతాలను వింటుంటే చిరు కాలం మాత్రమే జీవించినా చిరకాలం గుర్తుండిపోయే అద్భుతమైన ఆణిముత్యాలను మనకు పంచి వెళ్ళారనిపిస్తుంది.
అపురూపమైన గేయ సాహిత్యాన్ని మనకందించి వెళ్ళిన వీటూరి వారికి మనమెలా కృతజ్ఞతలు తెలుపుకోగలం? మళ్ళీ మళ్ళీ వారి పాటలను వినడం, పాడుకోవడం తప్ప.

No comments:
Post a Comment