అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-38 3️⃣8️⃣2️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*18. వ శ్లోకము:*
*”ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యేతిష్ఠన్తి రాజసాl*
*జఘన్యగుణవృత్తిస్థా అధోగచ్ఛన్తి తామసాఃll”*
“ఈ మూడు గుణముల వారు మరణించిన తరువాత ఏయే లోకములకు పోతారు అని వివరించాడు పరమాత్మ. సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకములకు వెళుతారు. రజోగుణము కలవారు మధ్యలో ఉన్న మానవ లోకంలో ఉంటారు. తామస గుణము కలవారు అధోలోకములకు వెళతారు.”
```
‘మనకు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉన్నాయి అని చెబుతారు. భూలోకము మనది. భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. మొదటి మూడు లోకముల నుండి ఆపై మూడు లోకములకు మహర్లోకము ద్వారము వంటిది. సత్వగుణ ప్రధానులు మరణానంతరము ఈ లోకములకు వెళతారు. రజోగుణ ప్రధానులు స్వర్గం దాకా వెళతారు. యజ్ఞయాగములు, తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు. తమోగుణ ప్రధానులు అధోలోకములకు వెళతారు. అధోగతి అంటే వారి వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశు, పక్ష్యాదులుగానూ, లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులు గానూ జన్మిస్తారు.
కేవలం మానవులకే అన్వయించుకుంటే, ‘ఊర్ధ్వం గచ్చన్తి’ అంటే సత్వగుణ సంపన్నుడు జీవితంలో పైపైకి ఎదుగుతాడు. జ్ఞాని అవుతాడు. అందరి చేతా గౌరవింపబడతాడు. పదిమంది చేత మన్ననలు పొందుతాడు. రెండవ వాడు ‘మద్యేతిష్ఠన్తి’ అంటే రజోగుణము కలవాడు అటు జ్ఞాని కాలేడు ఇటు పతనం పొందలేడు, మధ్యస్తంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి కాని ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూఉంటాడు. దాని కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. జీవితంలో శాంతినుఖం ఉండవు, ఇంక మూడవవాడు ‘జఘన్యగుణవృత్తిస్థా’ అంటేవాడి గుణాలు అన్నీ నీచమైనవే. ఏమీ పని చేయడు. అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఐపోవాలనుకుంటాడు. దాని కోసం చేయరాని పనులు చేస్తాడు. ‘అధోగచ్చన్తి’ అంటే అధోగతి పాలవుతాడు.
చాలా మంది అంటుంటారు. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే కదా. మరి ఈ ధనిక పేద తేడాలేమిటి. కష్టసుఖాలు ఎందుకు కలుగుతాయి అని, చిన్న ఉదాహరణ. నగరాలలో, పట్టణాలలో పల్లెలలో మానవులు నివసిస్తున్నారు. కొంత మంది బాగా ధనవంతులు అయి ఉండి కూడా, ఇంకా ఇంకా ధనం సంపాదించడానికి అక్రమమార్గాలు అవలంబించి జైళ్లలో మగ్గుతున్నారు. మరి కొందరు నేరాలు చేసి జైళ్లలో మగ్గుతుంటారు. ఇంకా కొందరు తాము చేయని నేరాలకు జైలుపాలవుతుంటారు. అలాగే 70 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవాళ్లు ఉన్నారు. మరి కొంతమంది 40 ఏళ్ల నుండి మందుల మీద బతికే వాళ్లు ఉన్నారు. అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ల మాదిరి నిరంతరం దుఃఖపడే వాళ్లు ఉన్నారు. ఉన్నదానిలో తృప్తిగా సంతోషంగా జీవించే వాళ్లు ఉన్నారు.
మానవుని జీవితంలో ఇటువంటి పరిణామాలకు కారణం ఏమిటి అంటే దీనికి ఆధ్యాత్మికంగా ఒకటే సమాధానం. ఇదంతా వారు వారు చేసుకున్న పూర్వజన్మల పాప పుణ్యాల ఫలితం. ఈ జన్మలో చేసిన తప్పులకు ఒక్కొక్కసారి ఈ జన్మలోనే వాటి ఫలితం అనుభవించవలసి వస్తుంది. మరి కొందరికి మరుజన్మలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దీనికి దేవుడు ఏమీ చేయలేడు. మనకు మరు జన్మ మంచిది కావాలంటే
ఈ జన్మలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అక్రమాలు, పాపాలు చేయకుండా ఉండాలి. ఇతరులను మానసికంగా కానీ, శారీరకంగా కానీ హింసించకూడదు. ఉన్నదానిలో తృప్తిగాజీవించాలి. అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అలా ఉంటే ఈ జన్మలో సుఖజీవనం, ప్రశాంత జీవనం గడపవచ్చు. రాబోయేజన్మ కూడా మంచిది వచ్చే అవకాశం ఉంది.✍️
```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment