Saturday, January 11, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-383.
3️⃣8️⃣3️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)


*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*19. వ శ్లోకము:*

*”నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతిl*
 *గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతిll”*

“ఎవరైతే తాను వేరు, ఈ శరీరము వేరు, మూడు గుణములు శరీరానికి చెందినవి కాని తనకు కాదు, తాను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటాడో, అతడు 
నా భావాన్ని పొందుతాడు.”
```
సమస్త జీవరాశులలో, మానవులలో మూడు గుణాలు ఉన్నాయి. ఆ మూడు గుణాలే ప్రకృతిలో కూడా ఉన్నాయి. మనలో ఉన్న మూడు గుణాలు ప్రకృతిలో ఉన్న గుణాలతో కలుస్తాయి. అప్పుడు మనసులో కోరిక కలుగుతుంది. తనలో కలిగిన కోరికను మనస్సు, ఇంద్రియములు చేసే కర్మల ద్వారా తీర్చుకుంటుంది. ఆ కర్మలకు ఫలితాలు కలుగుతాయి. ఆ ఫలితాలు బంధనాలు కలుగచేస్తాయి. కాబట్టి కర్మబంధనాలకు మూలం మూడు గుణములు. మనసు, ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుంది. కాబట్టి "నేను" అంటే జీవాత్మ కాని దేహము కాదు. మూడు గుణముల ప్రభావం చేత మనసు దేహంతో కలిసి కర్మలు చేస్తుంది. జీవాత్మకు కర్మలతోనూ వాటి ఫలితములతోనూ ఎటువంటి సంబంధము లేదు. "నేను" అంటే ఆత్మస్వరూపులం కేవలం చూస్తూ ఉంటాము. ఈ జ్ఞానం మనందరిలో కలిగితే కర్మబంధనములు మనకు అంటవు. నిరంతర ఆనందంలో మునిగి తేలుతుంటాము. "నేనే కర్మలు చేస్తున్నాను" అని అనుకుంటే సుఖదుఃఖములు అనుభవించాలి.

కాబట్టి అన్ని కర్మలకు మూడు గుణములు, మనస్సు మూలము. జీవాత్మ ఈ మనస్సుతో, మూడు గుణములతో కలిసి "నేను" అనే అహంకారమునకు లోనవుతున్నాడు. "నేను పుట్టాను. నేనుపెరిగాను. ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను. నాకు దుఃఖం కలిగింది. నాకు సుఖం కలిగింది. నేను చావబోతున్నాను అనుకుంటూ "అన్నీ తానే చేస్తున్నాను, అన్నీ తన వలననే జరుగుతున్నాయి. తాను లేకపోతే ఏదీ జరగదు" అనే భ్రమలో మునిగి తేలుతున్నాడు. ఈ భ్రమల నుండి బయట పడితే "మద్భావం సోఽధిగచ్ఛతి" అంటే నా భావాన్ని పొందుతారు అంటే పరమాత్మ భావాన్ని పొందుతారు. అని చెబుతున్నాడు పరమాత్మ.

కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనస్సు గుణములే కారణము, నేను కాదు, నేను సాక్షిని మాత్రమే అని తెలుసుకున్న నాడు పరమాత్మతత్వము మనకు అర్ధం అవుతుంది. కాని కొంత మంది అతి తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్ధం చేసుకొని వీటికి వక్రభాష్యం చెబుతారు. ఎలాగంటే, నేను చేసే పనులకు, నాకు సంబంధం లేదు, అన్నీ నా మనసు, కాళ్లు చేతులు చేస్తున్నాయి అంటూ వితండ వాదం చేసి, తాము చేసే అక్రమాలకు వేదాంతాన్ని ఆసరాగా తీసుకుంటారు.

ఉదాహరణకు ఎవడైనా హత్య చేసి, 'అబ్బే ఈ హత్య నేను చేయలేదు. నా శరీరం ఈ హత్య చేసింది, నేను కాదు, నాలోని ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది, నాకూ ఈ హత్యకు ఏం సంబంధం లేదు" అని వాదిస్తే, న్యాయమూర్తి కూడా, "నిజమే నీకూ ఈ హత్యకూ ఏమీ సంబంధం లేదు, ఈ హత్య నీవు చేయలేదు, కానీ నీ శరీరం చేసింది కాబట్టి, నీ శరీరానికి యావజ్జీవ శిక్ష విధించాను, నీకు కాదు" అని అనే ప్రమాదం ఉంది. ఇటువంటి వితండవాదులు చివరకు దుఃఖాలపాలవుతున్నారు.

కాబట్టి దీని అర్థం అది కాదు. "నేను వేరు ఈ శరీరం వేరు" అనే జ్ఞానం కలిగి, మూడుగుణములకు అతీతంగా వ్యవహరించాలి. ఇది ఎలాగ అని వివరంగా తెలుసుకుందాము...

“నేనే ఈ దేహము అన్నీ నేనే చేస్తున్నాను” అనే అహంకారంతో ఉన్న వాడు ఎప్పటికీ గుణములకు అతీతుడు కాలేడు. నేను ఈ శరీరము కాదు ఆత్మను అని అనుకుంటే గుణములు నిన్ను అంటవు. అంటే ఆత్మస్వరూపానికి ఎటువంటి గుణములు లేవు, బయట ఉన్న గుణములు దానికి అంటవు. ఈ సత్యాన్ని తెలుసుకొని, మనం ఆత్మస్థితికి చేరుకుంటే, గుణములతో కూడిన ఈ శరీరంలో ఉన్నా ఈ గుణముల లక్షణములు మనకు అంటవు. అటువంటి స్థితిలో ఉన్నవాడు, ఈ మూడు గుణములతో జరిగే పనులను కేవలం సాక్షిగా చూస్తాడే తప్ప వాటికి అంటుకోడు. సుఖదుఃఖాలను సమంగా చూస్తాడు. దేనికీ అతిగా స్పందించడు. దీనికి కావాల్సింది ఆత్మ, అనాత్మ వివేకము. ఆత్మ ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి అని తెలుసుకోవడం. ఆత్మకు ఏ గుణములు అంటవు, ఈ శరీరంలో, ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయి అని తెలుసుకోవడం.

ఉదాహరణకు ఒక లైటు వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము. లైటు వెలుగులో మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఆ పనులు గానీ, వాటి ఫలితములు కానీ, లైటుకు గానీ, దాని ప్రకాశానికి గానీ అంటవు. లైటు గానీ, కాంతి గానీ సాక్షీభూతంగా అన్నీ చూస్తూ ఉంటుంది కానీ, దేనికీ అంటుకోదు. ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో, గురుబోధనలతో తెలుసుకున్న వాడు ఆత్మజ్ఞాని అవుతాడు. ఆత్మ తత్వాన్ని పొందుతాడు. గుణాతీతుడు అవుతాడు.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment