Saturday, January 11, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-381.
3️⃣8️⃣1️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)


*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*16. వ శ్లోకము:*

*”కర్మణస్సుకృతస్యాహు స్సాత్త్వికం నిర్మలం ఫలమ్l*
 *రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్ll”*

“సత్వగుణముతో ఉన్న వాడు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలము లభిస్తుంది. రజోగుణముతో ఉన్న వారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖము కలుగుతుంది. తమోగుణముతో కూడిన తామస కర్మలు చేసే వారికి అజ్ఞానము, అవివేకము ఎక్కువవుతుంది.”
```
పై శ్లోకంలో మానవుడు మరణించిన తరువాత కలిగే ఫలితముల గురించిన జన్మల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో జీవితాంతం ఈ మూడు గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే, జీవించి ఉండగానే, ఏమేమి ఫలములు కలుగుతాయో క్లుప్తంగా చెప్పాడు కృష్ణుడు. సత్త్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము, శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగినా, చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది. తమోగుణప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది. ప్రతి దానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం, విపరీతార్థాలు తీయడం చేస్తుంటారు. వారిలో అజ్ఞానం, అవివేకము పెరుగుతుంది. ఆలోచనా శక్తి నశిస్తుంది.

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ సుఖ పడాలనే కోరిక ఉంటుంది. సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు కాబట్టి ఏ యే పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయాపనులనే చేయాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది. రజోగుణము తమోగుణము ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము అజ్ఞానము మోహము కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మలవైపు అడుగులు వేయాలి.

రజోగుణము వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము, క్రోధము రజోగుణ ప్రధానములు. ఈ రెండూ మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖం కలిగిస్తాయి. ఇంక తమోగుణము వలన మోహం కలుగుతుంది. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. దాని వలన హాని కలుగుతుంది. కాబట్టి భక్తులు ఈ రెండు గుణములను వదిలిపెట్టాలి.```


*17. వ శ్లోకము:*

*”సత్త్వాత్సఙ్ఞాయతే జ్ఞానం రజసో లోభ ఏవచl*
 *ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవచll”*

“సత్వగుణము వలన కలిగిన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తామస గుణముతో మోహము, భ్రమ, నిర్లక్ష్యము, అజాగ్రత్త, ప్రమాదము మొదలైన లక్షణములు కలుగుతాయి..”
```
‘సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండే వారు కూడా వారికి నచ్చని విషయం జరిగితే తాత్కాలికంగా కోపపడతారు. ఆ కోపంలో ఏంచేస్తున్నామో తెలియదు. ఏమేమో చేస్తారు. తరువాత బాధపడతారు. నాకు సాధారణంగా కోపం రాదు కానీ, ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమకు తాము సర్దిచెప్పుకుంటారు. అలా అప్పుడప్పుడు కోపం వచ్చి వచ్చి అదే అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటి మాటికీ మనలను హెచ్చరిస్తున్నాడు.

అయ్యా! సత్వగుణం కలిగి ఉండండి. జ్ఞానం సంపాదించండి. పరమాత్మను గురించి తెలుసుకోండి. రజోగుణములో పడి లోభత్వమునకు గురి కాకండి అని మాటి మాటికీ చెబుతున్నాడు. పరమాత్మ ఎంతటి సత్వగుణ సంపన్నుడికైనా లోభత్వము కాస్తంత ఉంటుంది. తనకు లభించిన జ్ఞానం, విద్య ఇతరులకు చెప్పకపోవడం కూడా లోభత్వమే. తనకు ఉన్న ధనం నాది అని దాచుకోవడం, అంతా నాకే కావాలి అని అనుకోవడం ఎంతటి లోభత్వమో అలాగే తాను ఆర్జించిన విద్య జ్ఞానము తనలో దాచుకోవడం కూడా అంతే లోభత్వము. ఈ లోభత్వానికి కూడా మనం గురి కాకూడదు.

ఇంక అన్నిటి కంటే ప్రమాదమైనది తామసము. అమితమైన నిర్లక్ష్యము. ప్రతి దానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం. ఏ పనీ సక్రమంగా చేయకపోవడం. సోమరి తనం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం. ఎప్పుడూ మత్తుగా ఉండటం. ఇవి ఒక సారి అంటుకుంటే వదలవు.

ఉదాహరణకు.. ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లేవారు, వెళ్లిన తరువాత కూడా పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు, నిద్రపోయేవారు, కాంటీన్లలో కాలక్షేపం చేసేవారు, “వీడు ఇచ్చే జీతానికి ఈ పని చాల్లే" అని నిర్లక్ష్యంగా పనిచేసేవారు ఈ కోవలోకి వస్తారు. వీళ్లంతా చివరకు కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే ఈ గుణాల గురించి మాటిమాటికీ మనలను జాగృత పరుస్తున్నాడు పరమాత్మ.✍️
```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment