అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-384.
3️⃣8️⃣4️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*20. వ శ్లోకము:*
*”గుణానేతానతీత్యత్రీ న్దేహీ దేహసబుద్భవాన్l* *జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతేll”*
“ఈ శరీరములు రావడానికి కారణము అయిన మూడు గుణములు దాటిన వాడు, జననము, మరణము, ముసలితనము, వ్యాధులు మొదలగు దుఃఖముల నుండి విముక్తిని పొందుతాడు. అతడికి అమృతత్వము లభిస్తుంది.”
```
గుణాతీతుడు అయితే కలిగే ఫలితాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఈ దేహములు పుట్టడానికి కారణం ప్రకృతిలో ఉన్న మూడు గుణములే. వీటి వలననే సృష్టి జరుగుతూ ఉంది. ఈ మూడు గుణములు దాటితే అంటే గుణాతీత స్థితికి చేరుకుంటే ఈ ముసలితనము, రోగములు వాటి వలన వచ్చే దుఃఖములు, మరణము వీటి నుండి విడివడవచ్చు. అదే ముక్తి. అమృతత్వము. అంటే మృతము లేని స్థితి.
సత్వగుణము మంచిది అని అంటుంటారు. అది మంచిదే కానీ దానిని కూడా విడిచిపెడితే కానీ, మోక్షము రాదు. అంటే గుణాతీత స్థితి, నిర్గుణ స్థితి. పరమాత్మ నిర్గుణుడు. మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటే కానీ, పరమాత్మలో ఐక్యం కాలేము. నిర్గుణ స్థితి అంటే గుణములను మనం స్వీకరించకపోవడం. గుణములు ఉన్నాయి అని గుర్తించకపోవడం. అంటే గుణాలు ఎక్కడకుపోవు. మనలో ఉన్నాయి. బయటలో ఉన్న ప్రకృతిలో ఉన్నాయి. కాని ఆ గుణాల ప్రభావానికి మనం లోనుకాకూడదు. ఈ గుణములు శరీరానికి మనసుకే కానీ, నాకు కాదు, నన్ను ఏమీ చేయలేవు అనే స్థితికి చేరుకోవాలి. శరీరము, మనసు గుణములలో ప్రవర్తిస్తున్నా, "నేను" అనే ఆత్మస్థితి మాత్రం నిర్గుణంగానే ఉండాలి. అదే గుణాతీతస్థితి, అదే ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము అయిన ఈ గుణాతీతస్థితికి చేరుకున్నవాడు, పరమాత్మలో ఐక్యం అవుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు.
లౌకికంగా చెప్పుకోవాలంటే, ఈ మూడు గుణముల కలయికతోనే సృష్టి జరుగుతూ ఉంది. జననములు సంభవిస్తున్నాయి. పుట్టిన రోజు నుండి మానవుడు మరణానికి దగ్గరవుతున్నాడు. శరీరం పెరుగుతూ ఉంటే, ప్రతి దినము మనమే మరణానికి దగ్గరవుతున్నాము. అంతే కానీ మరణం మన దగ్గరకు రావడం లేదు. తెల్ల వెంట్రుక కనపడగానే ఆందోళన, ముసలి తనం వస్తుందేమో అని భయం. రంగు వేసి దానిని దాచిపెడతాము. 40 ఏళ్లు దాటగానే కళ్లకు అద్దాలు వస్తాయి. అద్దాలు పెట్టుకుంటే పెద్దవాళ్లం అయిపోయామేమో అనే భావన. కాంటాక్ట్ లెన్సు. వయస్సును దాచి పెట్టడానికి రకరకాలైన సాధనాలు. వాటి వలన కలిగే దుష్పరిణామాలు. తరువాత మరణం వస్తుంది. చస్తావేమో అనే దుఃఖం. నేను చస్తే వీళ్లంతా ఏమౌపోతారో అనే బాధ ఇవన్నీ దుఃఖమును కలిగిస్తాయి.
అసలు ఈ శరీరమే లేకుంటే ఈ దుఃఖములు రావు. శరీరం లేకపోవడం అంటే జనన మరణ చక్రం నుండి విడివడడం. అంటే పుట్టుక ఉండకూడదు. పుట్టుక లేకపోతే రోగములు, ముసలితనం, చావు అనే బాధలు లేవు. పుట్టుక లేకపోవడం అంటే గుణములు లేకపోవడమే. కాబట్టి అందరమూ ఈ గుణాతీతస్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక్కసారిగా రాదు. తామసంలో నుండి రాజసం లోకి, రాజసం లో నుండి సత్వానికి, సత్వం నుండి గుణాతీత స్థితికి రావాలి. దానినే మోక్షము అని అంటారు.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment