Wednesday, April 9, 2025

 నల్ల పిల్లి

                         ....ఎన్.శివ నాగేశ్వర రావు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను.నన్ను చూడగానే శ్రీమతి  "వచ్చారా?" అన్నట్లు చిన్నగా నవ్వింది.

మనసులో సన్నటి సంతోషవీచిక! షూస్ విప్పి స్టాండ్లో పెట్టి అమ్మ గదిలోకి తొంగిచూశాను. అమ్మ చాపమీద కూర్చొని రామాయణం చదువుకుంటోంది.ఫ్రెష్ గా స్నానంచేసి వచ్చేసరికి శ్రీమతియాలకులు వేసిన టీ తెచ్చి ఇచ్చింది. అది తాగుతూ రిలాక్స్ అవుతుండగా చెప్పింది.

  “ఏమండీ! మన పక్క పోర్షన్లోకి రేపు ఎవరో అద్దెకు దిగుతున్నారట" అని. నాకు ఆ పోర్షన్ ఖాళీ చేసి వెళ్ళినవారు జ్ఞాపకానికి వచ్చారు. వాళ్లు మాకు కలి
గించిన ఇబ్బంది అంతా అంతా కాదు. ప్రతి చిన్న విషయానికి  పేచీనే!మా మట్టుకు మేమున్నా ఒప్పుకునేవారు కాదు. కదిలించి మరీ కయ్యం పెట్టుకునేవారు. అలాంటి తరహా మనుషులూ ఉంటారని అప్పుడు తెలిసింది. మా అదృష్టం బాగుండి వాళ్లకు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయారు. శని వదిలి పోయింద అని అభిప్రాయపడ్డాం మేము.

“ఈసారైనా మంచి వాళ్లు వస్తే బావుణ్ణు" అన్నాను."అదే నేను కోరుకొనేదీను. మొన్న అద్దె కోసం వచ్చినప్పుడు ఓనరుతో చెప్పాను.ఈసారి మంచివారికైతేనే ఇస్తానని భరోసా ఇచ్చాడు" అంది శ్రీమతి.

    అంతలో అమ్మ గదిలోంచి బయటకు వచ్చింది. ప్రణవి కిచెన్ లోకి నడిచింది."ఏమ్మా! ఎలా ఉంది. ఒంట్లో!" అనిఅడిగాను. అమ్మ సమాధానం చెప్పలేదు.చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో జీవంలేదు.
అమ్మ నాకెదురుగా కూర్చుంది.మా ఇద్దరి మధ్య కొంతసేపు మౌనం.ఏదో మాట్లాడాలి అనుకున్నాను.
“రామాయణం చదవడం ఎంతవరకువచ్చిందమ్మా?" అని అడిగాను. నా ప్రశ్న నాకే కృతకంగా అనిపించింది.

“సుందరకాండవరకు వచ్చింది" అని బదులిచ్చింది అమ్మ. తరువాత ఏం మాట్లాడాలో తోచలేదు. అదే నాకంతుపట్టదు. నా భార్య ప్రణవితో గంటల తరబడి మాట్లాడే నాకు అమ్మ దగ్గరకు వచ్చేసరికి మాటలు
కరువవుతాయి.

అమ్మంటే నాకు కొండంత ప్రేమ. అమ్మ నన్నెంత ప్రేమగా పెంచిందో నాకు తెలియనిది కాదు. మరిచేది కాదు. నాన్న లేని నన్ను ఆ లోటు తెలీకుండా పెంచింది అమ్మ. పెళ్ళి అయ్యేంతవరకు అమ్మతో ఎంతో చనువుగా  ఉండేవాడిని. అమ్మ ఒడిలో తల
పెట్టుకు పడుకునేవాడిని. అమ్మ చేత్తో గోరుముద్దలు తినేవాడిని. అమ్మ కొంగుపట్టుకు తిరుగుతూ అల్లరి చేసేవాడిని.

పెళ్ళి అయ్యాక నాలో మార్పు వచ్చింది.ఆ మార్పు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేను పెళ్లాడిన ప్రణవి నిస్సందేహంగా మంచిపిల్ల, నేనంటే ప్రేమ. అమ్మను కూడా గౌరవంగా చూస్తుంది. సహజంగానే
నేను ప్రణవిపట్ల అమితమైన ప్రేమ పెంచుకున్నాను. జీవితం పూలపానుపులా ఉంది నాకు.

అయితే అంతవరకు నా ప్రేమ పంచుకున్న అమ్మ... నా ప్రేమతోనే బ్రతుకుతున్న అమ్మ... ఒంటరితనం అనుభవించసాగింది. నేను చాలా ప్రయత్నించాను. అమ్మతో మునుపటిలా ఉండాలని. కానీ అలా ఉండలేక పోయాను. అదే నాకు అంతుపట్టలేదు. చాలా రాత్రులు ఆలోచించాను. ఎందుకు
అమ్మతో మునుపటిలా ఉండలేకపోతున్నానా? అని.

     సుదీర్ఘంగా ఆలోచించిన తరువాత తెలిసింది. అంతరాంతరాల్లోకి వెళ్ళి ప్రశ్నించు కుంటే తెలిసింది. ఎంతో అంతర్మథనంజరిగిన తరువాత తెలిసింది. నేను ప్రణవితో ఉండగా అమ్మ చూపులో కదలాడే భావం. చాలా సన్నటి... అస్పష్టమైన భావం... అదే
అసూయ! అంతవరకు తనది అనుకున్న దాన్ని మరెవరో పొందినప్పుడు కలిగే ఫీలింగ్.

   నా దృష్టిలో అమ్మ ప్రేమమూర్తి, అనురాగ దేవత! అమృతవర్షిణి. ఆమెలో నేనటు వంటి భావం ఊహించలేదు. అయినా సర్ది చెప్పుకున్నాను. ఎంతయినా తనూ మనిషే! తనకూ రాగద్వేషాలు ఉంటాయని.. కానీ ఎంత ప్రయత్నించినా అమ్మమీద మునుపటిలా ప్రేమ చూపించలేకపోయాను.
అలా అని అమ్మకు నేనే లోటు చేయలేదు.
ప్రతి చిన్న అవసరం గుర్తు ఉంచుకుంటాను.
అయితే మునుపటిలా ఆమెమీద ప్రేమ
సంపూర్ణమైన ప్రేమ మాత్రం వర్షించలేకపోతున్నాను.
అమ్మ నా దగ్గర చాలాసార్లు బాధపడింది.

   "నీవు చాలా మారిపోయావు" అని. నేను మౌనాన్నే ఆశ్రయించాను. అమ్మ ఇంటికొచ్చే చుట్టాల దగ్గర "బాబు నాతో మనసు విప్పి మాట్లాడడు" అని వాపోయేది.అందరూ ఏదో హితోపదేశం చేస్తున్నట్లు
గా నాతో, "అమ్మను ప్రేమగా చూసుకోఅనేవారు. నేను నవ్వుకునేవాడిని. నాకు చెప్పేవాళ్లు వాళ్ళ తల్లులకు గంజినీళ్లు కూడా పోయరని నాకు బాగా తెలుసు.

    అమ్మకు, నా భార్య ప్రణవికి మధ్య కూడా సన్నటి పొరలాంటి మౌనం మంచులా పేరుకుంది. ఆ అడ్డుగోడ అమ్మ కట్టుకున్నదే! అయితే ప్రణవి దాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయింది.

    ప్రణవితో చెప్పాను, “అమ్మతో కొంచెం ఎక్కువగా మాట్లాడు" అని.“నన్నేం చేయమంటారు? నేనెంత మాట్లాడినా తను మౌనంగా ఉంటుంది. ఒక్కత్తినే డబ్బాలా ఎంత సేపు మోగను?" అని ప్రణవి వాదన. అందులోనూ నిజముంది.మాకు పిల్లలు పుడితే అమ్మకు కాస్తంత కాలక్షేపం అవుతుందని తలపోశాను. అయితే ప్రణవి కడుపు ఇంకా పండలేదు.

పక్క పోర్షన్లోకి దిగేవారిలో ముసలివాళ్లు ఎవరైనా ఉంటే బావుణ్ణు. అమ్మకు కాలక్షేపం అనుకున్నాను.
మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చేసరికి ప్రక్క పోర్షన్ సందడిగా ఉంది. అందులోకి ఎవరో అద్దెకు దిగినట్లు అర్ధమయింది.

     స్నానంచేసి టీ తాగుతుండగా ప్రణవి పక్క పోర్షన్ వారి సంగతులన్నీ చెప్పేసింది. అతను బ్యాంక్ ఉద్యోగి.పేరు శ్రీధరం. అతని భార్య శారద ఎల్.ఐ.సిలో పనిచేస్తున్నది. పిల్లలు లేరు.ఇద్దరూ ఉదయం వెళ్ళి, సాయంత్రం వస్తారు. బహుశా వారినుంచి మనకే సమస్యాఉండకపోవచ్చు" అంది ప్రణవి.

    మరికొంచెం సేపటికి శ్రీధరం వచ్చి కలిశాడు. మాటల్లో సంస్కారం ఉట్టిపడుతోంది."తక్కువ సామానే కాబట్టి ఇల్లు మారడం పెద్ద కష్టమేం కాలేదు” అని చెప్పాడు.కొంచెం సేపు మాట్లాడి తను వెళ్ళిపోయాడు.

నేను ఆశపడ్డట్లు వాళ్ళింట్లో ముసలివారు లేనందుకు బాధపడ్డాను. అమ్మకు ఒంటరి తనం తప్పదు అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం ఆరింటికి రోజులానే మెలకువ వచ్చింది. మంచంమీదే కళ్లు మూసుకొని అలానే ఉన్నాను. అంతలో మ్యావ్....
మ్యావ్... అనే శబ్దం వినిపించింది. కళ్లు తెరిచి చూశాను. ఎదురుగా నల్లపిల్లి!

    లేవగానే పిల్లి ముఖం చూస్తే అపశకున మని ఎప్పుడో విన్నాను. “ఇదెక్కడినుంచి ఊడిపడింది?" అనుకున్నాను.

   “అంతలో ప్రణవి వచ్చి “పక్క పోర్షన్ వారి పిల్లి. బాగుందికదూ!" అంది. పిల్లి! అందులోనూ నల్లపిల్లి! దీనిలో ప్రణవికి ఏం అందం కనిపించింది అనుకున్నాను.

    ఆ నల్ల పిల్లి నావైపు ఒకే ఒక్కసారి చూసింది. నాకు దానిమీద ఎటువంటి ఆసక్తి కలగలేదు. అదిగమనించిందేమో! వెనుతిరిగి వెళ్లి పోయింది. అది వెళ్తూ ఉండగా గమనించాను.దాని నడకలో గొప్ప ఠీవి ఉంది.

   ఆరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి అమ్మ రోజులా రామాయణం చదవడంలేదు. బయట చల్లగాలికి కుర్చీ వేసుక్కూర్చుంది. ఆమె ఒడిలో నల్లపిల్లి! అమ్మనన్ను గమనించలేదు. పిల్లితో కబుర్లాడుతోంది.నన్ను చూడగానే "చెందూ! ఇది నా
మాటలను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నదో' అంది ఎంతో సంతోషంగా.

    అప్పుడు అమ్మ అచ్చం చిన్న పాపాయిలా అనిపించింది నాకు. 'అలానా!' అన్నట్లు
నవ్వి లోపలకు నడిచాను.

    ప్రణవి నవ్వుతూ ఎదురువచ్చి "అత్తయ్యకు మంచి ఫ్రెండ్ దొరికింది. ఉదయం మీరు ఆఫీస్ కి వెళ్లినప్పటినుంచి దానితోనే కాలక్షేపం చేస్తున్నారు" అంది.

     ఆ రాత్రి నేను శ్రీధరం దగ్గరకు వెళ్ళాను.అతని భార్య శారద ఆప్యాయంగా పలకరించింది. మాటల్లో “ఇక్కడకు వచ్చేముందు మా పిల్లి గురించి వర్రీ అయ్యాం.మేం ఆఫీస్ కి వెళ్లినప్పుడు ఎలా? అని. కానీచిత్రంగా అది చాలా త్వరగా మీ అమ్మగారి
దగ్గర మాలిమి అయిపోయింది" అంది.కొంచెం సేపు మాట్లాడి వచ్చేశాను.

శ్రీధరం మా పక్క పోర్షన్లోకి దిగి అప్పుడే నెలరోజులు అయిపోయింది. ఈ నెల రోజుల్లో నల్ల పిల్లి అమ్మకు బాగా అలవాటైపోయింది. దానికి పాలు పోయడం....
తిండి పెట్టడం వంటివి అన్నీ అమ్మే చూసుకునేది. అయితే ఆశ్చర్యకరంగా నేను ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేది కాదు.అదంటే నాకిష్టం లేదని దానికెలా
తెలిసిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే!

     ఆ నల్లపిల్లిని నేనులేనప్పుడు అందరూ ముద్దు చేసేవారు. అమ్మ, ప్రణవి మాత్రమే  కాక మా ఇంటికి వచ్చేవాళ్లందరూ దాన్ని ముద్దు చేసే వారు. సాయంత్రంపూట నేను, ప్రణవి మాట్లాడుకునే మాటల్లో నల్లపిల్లి ప్రసక్తి తప్పకవచ్చేది. దానికెంత క్రమశిక్షణో! మంచాలమీదకుగాని, సోఫామీదకుగాని పొరపాటున కూడా ఎక్కదు. ఏ గిన్నే ముట్టదు. పిలిచి తాగమంటేనే పాలు తాగుతుంది అని ముచ్చట పడేది ప్రణవి.

    నల్లపల్లి ప్రతి ఉదయం మాత్రం ఒక్కసారి తప్పక నాకు దర్శనమిచ్చేది. అదెలాగంటే, అమ్మ ప్రతిరోజూ దేవుడికి పూజచేస్తుంది. ఆ సమయానికి నల్లపిల్లి వచ్చేది.

    అది అమ్మ గదిలోకి వెళ్ళాలంటే నా బెడ్రూమ్ దాటి వెళ్ళాలి. అప్పుడు కనిపించేది అది. అప్పుడు అది నా వంక ఎలా చూసేదంటే... నీకు నేనంటే ఇష్టం లేకపోయినా ఈసారికి తప్పదు అన్నట్లు చూసేది.

    అమ్మపూజ చేస్తుంటే మౌనంగా అమ్మ పక్కనే
కూర్చునేది. పూజ పూర్తికాగానే నిశ్శబ్దంగా నిష్క్రమించేది. వెళ్ళేటప్పుడు మాత్రం నావంక చూసేది కాదు. 'నీతో నాకేంటి పని?' అన్నట్లు వెళ్ళిపోయేది.

    అమ్మ ఒక రోజు నాతో అంది. "చెందూ!నీవు గమనించావో, లేదో ఇది నన్ను 'అమ్మా! అని పిలుస్తుంది" అంది. తరువాత గమనించాను. అమ్మ చెప్పింది నిజమే! దాని పిలుపు విన్నాను. అది
మ్యావ్.... మ్యావ్ లా  లేదు." అమ్ మ్ మ్మ్మా!'లానే ఉంది.

   తరువాత అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.  నేను మాట్లాడ్డం లేదని బాధపడడం లేదు. తనకసలు నా విషయమే పట్టడం లేదు.ఎంతసేపూ నల్ల పిల్లితోటే ఆటలు...పాటలు...కబుర్లు.

    శ్రీధరం దంపతుల దగ్గర మీ పిల్లివలన మాఅమ్మకు మంచి కాలక్షేపం అవుతున్నదని  సంతోషం ప్రకటించాను. అందుకు వాళ్లు ఈ  విషయంలో వేమే మీ అమ్మగారికి చాలా రుణపడివున్నాం.దాని పనులన్నీ స్వయంగా ఆవిడే చూస్తున్నారు" అని తమ కృతజ్ఞత చెప్పారు.

     ఆరాత్రి మధ్యలో అమ్మ గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. వెళ్ళి చూశాను.అమ్మ రామాయణం చదువుకుంటోంది.

   “ఏం అమ్మా! నిద్రపట్టలేదా?" అని అడిగాను. నా స్వరంలో అంతులేని ప్రేమ తొంగి చూసింది.
"లేదురా బాబూ! ఎందుకో గుండెలో తెలియని అలజడి. సీతారాములతో మాట్లాడితే మనశ్శాంతి దొరుకుతుందని రామాయణం తెరిచాను"
అంది అమ్మ.

    నా మనసులో ఏదో మూల అశాంతి లీలగా మెరిసింది. “కళ్లు మూసుకొని పడుకో అమ్మా! అదే నిద్రపడుతుంది" అని నా గదిలోకి నడిచాను. కొంచెం సేపటికి నాకు నిద్రపట్టేసింది.

    ఉదయమే ప్రణవి తట్టిలేపుతుంటే కళ్లు తెరిచాను.“ఏమండీ! ఉదయాన్నే కాఫీ ఇవ్వడానికి అత్తయ్య గదికి వెళ్ళాను. ఎంత పిలిచినా పలక లేదు.ఒళ్ళు మంచులా చల్లగా ఉంది" అని చెప్పింది.

   తన ముఖంలో కంగారు చూడగానే నాకు విషయం అర్థమయింది. ఒక్కుదుటున లేచి అమ్మ గదిలోకి వెళ్ళాను. ఎప్పుడుపోయిందో ప్రాణం. ప్రశాంతంగా నిద్రపోతున్నదానిలా ఉంది అమ్మ.చివరిగా, రాత్రి మధ్యలో అమ్మతో మాట్లాడిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. హృద యంలో ఉవ్వెత్తున ఆవేదనా తరంగాలుఎగసిపడ్డాయి. కళ్ళనుంచి కన్నీరు ధారా
పాతంగా కురియసాగింది. భుజంమీద ప్రణవి
చేయి ఓదార్పుగా పడింది.

     విషయం తెలిసి శ్రీధరం దంపతులు వచ్చారు. నల్లపిల్లి అమ్మ దగ్గర చేరి  'అమ్ మ్ మ్ మ్మా' అని పిలుస్తున్నది.ఆ పరిస్థితిలోనూ నాకు దానిమీద జాలి కలగలేదు.

     శ్రీధరం ప్రణవిని అడిగి బంధువుల ఫోన్ నంబర్లు తీసుకొని అందరికి ఫోన్లుచేశారు.ఇరుగు పొరుగువారు, చుట్టాలు ఒక్కొక్కరే రాసాగారు. నల్లపిల్లి అమ్మ శవం చుట్టూ గిరికీలు కొడుతూనే ఉంది.విషయం తెలియగానే మధ్యాహ్నానికి
ఇద్దరు అక్కయ్యలు, చెల్లి వచ్చారు. అందరి ముందూ ఏడ్చారు. ఆ ఏడుపులో, అందరూ వాళ్లకు అమ్మంటే ఎంత ప్రేమ ఉందో గమనించాలి అన్న తపన ఉంది.

'అమ్మకు సుస్తీగా ఉంటే మాకు మాట మాత్రంగానైనా కబురెందుకు చేయలేదు?'అని ముక్కులు చీదారు. ఎవరో పొరుగింటమ్మ చెప్పింది."ఆమెకు సుస్తీ చేయడం ఏమిటి? మహా పుణ్యాత్మురాలు. నిద్రలోనే కన్ను మూ సింది. అలాంటి చావు అందరికీ వస్తుందా?"అని.

    అప్పటికే శవదహనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాస్తమయంలోపే అమ్మ బూడిదైపోయింది. రాత్రి రామాయణం చదివిన అమ్మ, తెల్లారేసరికి శవం! సాయంత్రంఅయ్యేసరికి భస్మం! జీవితం క్షణభంగురమని ఎందుకంటారో తెలిసింది.

    ఆరాత్రే అక్కయ్యలు, చెల్లి అమ్మ ఒంటి మీది నుంచి తీసిన బంగారం గురించి వాదు లాడుకోసాగారు.వారి మాటలు అస్పష్టంగా నా చెవిన పడుతూనే ఉన్నాయి. ప్రణవి నాకు పాలు పట్టుకొచ్చింది. “ఉదయంనుంచీ ఏమీ తీసుకోలేదు. పాలైనా తీసుకోండి" అంది. నేను మౌనంగా గ్లాసు
అందుకున్నాను.

    “ఆడపడుచులు అత్తయ్య బంగారం కోసం వంతులు వేసుకుంటున్నారు" అంది ప్రణవి ఉపోద్ఘాతంగా.'ఎంతయినా ఆడదికదా! ఆ బంగారం
తనకే చెందాలంటుందేమో అనుకున్నాను
ప్రణవిని అంచనా వేస్తూ."బంగారం అలాంటి అత్తయ్యే పోయారు.ఆ బంగారం మన కెందుకు? వాళ్ళనే తీసుకోమని చెప్పండి" అంది.ప్రణవి వంక
అపురూపంగా చూసాను.

ఉదయాన్నే అక్కయ్యలు, చెల్లి నా చుట్టూ చేరారు. “చెందు మరోలా అనుకోకు.కొన్ని సంగతులు త్వరగా సెటిల్ చేసుకోవడమే మంచిది. అందుకే సమయం కాకపోయినా చెప్పవలసివచ్చింది. తల్లి ఒంటిమీది
బంగారం కూతుళ్లకు చెందుతుంది. అందుకే అమ్మ నగలు మేం తీసుకుంటున్నాం. ఎలా పంచుకోవాలో మేం చూసుకుంటాంలే' అన్నారు. ఏదో మేలు చేస్తున్నట్లు.

నిన్న అమ్మ శవంమీద పడి ఏడ్చిన వాళ్లేనా వీళ్లు? ఆ చితాభస్మం ఇంకా గంగలోనైనా కలవకముందే బంగారం కోసం ఆరాటపడిపోతున్నారు అనుకున్నాను. చెల్లాయి “ఒరే అన్నయ్యా! అమ్మ గుర్తుగా తన ఉంగరం మాత్రం వదినకు ఇవ్వాల
నుకున్నాం" అంది.ప్రణవికి మరిక వాటా లేదనే చెల్లి భావంగ్రహించాను. "మీ ఇష్టం" అన్నాను. అక్కడి
నుంచి వెళ్లిపోయారు.

మరునాడు బ్యాగులు సర్దుకొని బయలు దేరుతూ “పిల్లల చదువులు పోతాయి.దినంనాటికి వచ్చేస్తాం" అని చక్కాపోయారు. జన్మనిచ్చిన తల్లి మరణాన్ని అంత తేలికగా తీసుకోగలిగిన వారి రాతి హృదయాలను చూసి జాలిపడ్డాను. 

అప్పుడు నా హృదయం ప్రశ్నించింది. అమ్మ బ్రతికి ఉండగావాళ్లు కపట ప్రేమ అయినా చూపించారు.
మరి నీవో! మౌనంతో ఆమెను చిత్రవధ చేయలేదూ! అని, హృదయం ముందు దోషినయ్యాను.

కన్ను తెరిచినా, మూసినా అమ్మ రూపమే జ్ఞాపకానికి రాసాగింది. “బాబూ! ఇక నీకు నాతో బలవంతంగా మాట్లాడవలసిన పనిలేదుకదూ!" అని అమ్మ ప్రశ్నిస్తున్నట్లు అనిపించసాగింది.హృదయాన్ని సమాధానపరుచుకోలేక పోయాను.ఆబాధ బలంగా క్షణక్షణాన బలపడుతూ హృదయమంతా పరుచుకుని పదునైన కత్తిలా మారి హృదయాన్ని ముక్కలుగా తురమసాగింది.

   వ్నా హృదయంలోని బాధ ప్రణవి గుర్తించింది. తను ఎన్నో రకాలుగా నన్నుఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా నేను సమాధానపడలేకపోయాను.
అమ్మ కర్మకాండ ముగిసింది. చుట్టాలు...
అక్కయ్యలు... చెల్లి వెళ్లిపోయారు.అమ్మ బంగారం కోసం కనీసం దినమైనా ఆగలేకపోయిన అక్కయ్యలు, చెల్లాయి... దినం ఖర్చు ఎంతయిందిరా?డబ్బుందా? కొంచెం సర్దమంటావా? అనిమాట వరసక్కూడా అడక్కపోవడం గమ
నించి నవ్వుకున్నాను. 
    
    ఒకవేళ వాళ్లు అడిగినా నేను పైసా పుచ్చుకునేవాడిని కాదు.ప్రాణప్రదమైన తల్లి ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను? జీవితంలో ప్రతి విషయాన్ని
డబ్బుతో ముడివేసి మంచి చెడ్డలు బేరీజు వేసేవారి అల్పత్వానికి జాలిపడ్డాను.

    మరునాడు చాలా ఉదయాన్నే మెలకువ వచ్చింది. రాత్రంతా అమ్మ జ్ఞాపకాలతో నిద్రపట్టలేదు. తెలతెలవారుతుండగా నిద్రపట్టి, కలత నిదురలోనే మెలకువ వచ్చింది.నిద్రలేకపోవడంతో కళ్లు మండుతున్నాయి.

ఫ్రెష్ గా ఉంటుందని స్నానం చేశాను. ప్రణవి కిచెన్లో కాఫీ కలుపుతున్నది.అంతలో వచ్చింది నల్లపిల్లి. ఎప్పటిలానేనావంక ఒక్కసారి చూసి అమ్మ గదిలోకి
దూరింది.

    "అమ్మ చనిపోయిన సంగతి మరచిపో యినట్లుంది"అనుకున్నాను. అయినా అదేం చేస్తున్నదో చూడాలనిపించింది. ఒక్క నిముషమాగి వెళ్లాను.

   అక్కడ నేను చూసిన దృశ్యం అద్భుతమైనది. చేష్టలుడిగి అలానే ఉండిపోయాను.అమ్మ గదిలో తను రోజూ పూజచేసేచోటనల్లపిల్లి నిశ్చలంగా కళ్ళు మూసుకొని కూర్చుంది.క్షణం తరువాత కళ్లు తెరిచి అక్కడినుంచి కదిలింది. 

   వెళ్లేటప్పుడు ఎప్పటిలా నన్ను గమనించనట్లు వెళ్లిపోలేదు. నా దగ్గరఆగి, నా కళ్లలోకి చూస్తూ 'అమ్ మ్ మ్ మ్మా'అంది. 

   నాకు నా అక్కయ్యలు, చెల్లాయిజ్ఞాపకానికి వచ్చారు. వాళ్లు అమ్మ జ్ఞాపకాలను వదిలి, నగలు మూట కట్టుకుపోయారు. జ్ఞానం లేని పిల్లి అమ్మ జ్ఞాపకాలనింకా మూట కట్టుకునే ఉంది. నేను నల్లపిల్లిని ప్రేమగాఎత్తుకుని ముద్దాడి వదిలాను. అది తృప్తిగావెళ్లిపోయింది.

నేను నిశ్శబ్దంగా అమ్మ ఫొటో దగ్గరకు నడిచివెళ్ళాను. ఆ ఫొటో ముందు పద్మాసనం
వేసుక్చూర్చొని కళ్లు మూసుకున్నాను. క్షణం తరువాత మనసు నిశ్చలంగా మారింది. మనోనేత్రం ముందు అమ్మ ఆత్మ ఉజ్వలంగా కనిపిస్తోంది. నా హృదయం మౌనంగా అమ్మతో మాట్లాడసాగింది.

 ఇదివరకటిలా కాక అమ్మ శాంతంగా నా మౌనాన్ని
వింటోంది. అర్థం చేసుకుంటోంది. నా హృదయ నివేదన సంపూర్ణంగా అమ్మ స్వీకరించింది.

    నాలోని ఆవేదన కొంచెం కొంచెంగా కరిగిపోసాగింది. అమ్మ ఆత్మ మెల్లమెల్లగా మాయమయింది. నా హృదయంలో ప్రశాంతతఅలుముకుంది.

    కొంచెం సేపటి తరువాత కళ్లు తెరిచి చూశాను. అమ్మ ఫొటోలోని కళ్లు జ్యోతుల్లా మెరుస్తున్నాయి.
 నాకు కాఫీ అందించడానికివచ్చిన ప్రణవి వంక ప్రేమగా చూశాను.

    బహుశా పైలోకం నుంచి అమ్మ మా ఇద్దరి వంక తృప్తిగా చూస్తూ ఉండి ఉంటుంది. ఆ కన్నులలో మరిక అసూయ ఉండదు. అనురాగం అమృత ధారలుగా వర్షిస్తూ ఉంటుంది!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment