Tuesday, April 8, 2025

 కుటుంబ కథలులో నా మొదటి పోస్ట్, మొదటి కథ. నాకు నచ్చిన నా కథలలో ఒకటి... నాకు ఇష్టమైన కాఫీ తాగుతూ రాసిన కథ.

 *Immaneni* *Sritulasi* 

చాలామంది మహిళలకి ఈ  కథ ఎన్నోసార్లు అనుభవం లోకి వచ్చే ఉంటుంది. ప్రతిరోజూ కాదు, కానీ  చాలాసార్లు ఇలా ఫీల్ అయ్యి ఉంటాము.. ప్రత్యేకించి కాఫీ ప్రియులకి అర్ధమవుతుంది..! 
చదివి మీ అభిప్రాయాలను తెలియచేస్తారు కదూ..

అలా  కాఫీ తాగాలంటే...!!!

ముఖంపై  చల్లటి నీళ్లు  చిలకరించుకుని, వచ్చి  ఉయ్యాల బల్లపై  కూర్చున్నాను.

సూర్యకిరణాలు 🌞 

లేలేతగా, నులివెచ్చగా  వంటిని తాకుతున్నాయి. ఎవరైనా వేడివేడిగా కాఫీ కలిపిస్తే  బాగుణ్ణు...!

కాఫీ అలా ప్రశాంతంగా  తాగితేనే  బాగుంటుంది. ఎత్తిన  కప్ దించేవరకు, చివరి సిప్  అయ్యేవరకు ఎలాంటి  అవాంతరాలు ఉండకూడదు  అనుకుంటాను. 

దూరంగా వేణు గోపాలస్వామి గుడినుండి చిన్నగా ఎం.స్. సుబ్బు లక్ష్మిగారి 
విష్ణు సహస్రనామం 
📢 
వినపడుతోంది. కళ్ళు  మూసుకుని వింటూ  ఉండిపోయాను. 

ఎవరో టపటపా చెయ్యిమీద  చురుక్కుమనేలా కొడుతున్నారు... ఎవరదీ అంటూ లేచేసరికి మా వారు పక్కనే  పడుకుని లేవవేంటి ఆరవుతోంది అన్నారు.

 అయ్యో, మళ్లీ కలేనా 🤦🏻‍♂️

పగలు వచ్చే కలలు  నిజమవుతాయి  అంటారు  కదా ..మరిక్ నాకేంటి  ఈ  కల నిజం  కావట్లేదు 
🤔
అనుకుంటూ బద్దకంగా  లేచాను. అలవాటుగా టైమ్  చూసాను, 
ఆరు అయ్యింది అంతే. త్వరత్వరగా బ్రష్ చేసుకుని కొన్ని నీళ్లు గొంతుకలో పోసుకుని వంట మొదలుపెట్టాను.

అన్నం, పప్పు, చారు, వంకాయ కూర పొయ్యిమీద వేసాను .. ఏది త్వరగా అవుతుందా అని చూస్తున్నా...!

నాలుగు బర్నర్లు కాకుండా ఐదు బర్నర్లు ఉన్న స్టవ్ వస్తే కొనుక్కోవాలనుకుంటాను... పాలు కాగబెట్టి కాఫీ కలుపుకోవచ్చన్న ఆశతో...! 😆

ఆ...అయ్యిందోచ్ ... చారు ఐపోయిందోచ్....!!

పాలు పెట్టేసా...అవి వేడి అవుతుంటే ఒక గ్లాస్ లో చక్కర, నెస్కేఫ్ పొడి వేసుకున్నా...ఇంతలో మా పెద్దమ్మాయి అంజనా లేస్తూనే తుమ్ముకుంటూ వచ్చి, "అమ్మా...వేడిగా కాఫీ ఇయ్యి.. బాగా తుమ్ములు వస్తున్నాయి" అనింది.
"రెడీగా ఉంది నాన్నా  తీస్కో" అని చక్కర, కాఫీపొడి వేసిన గ్లాస్ లో వేడి పాలు పోసి కలిపి కప్ లో వేసి ఇచ్చేసాను. కాఫీ తీసుకుని తాను రూమ్ లోకి వెళ్ళిపోయింది..! 
😐

టైమ్ అయిపోతుందని పప్పులో టొమేటో వేసి తాలింపు పెట్టేసాను.

పాలు చల్లారిపోయేలోపు కాఫీ కలుపుకోవాలని మళ్ళీ గ్లాస్ లో అన్నీ  వేసుకున్నాను...!!
మావారు బయటకు వస్తూనే "టీ  అయ్యిందా" అడిగారు...

ఓహో, మళ్ళీ అవాంతరం అనుకుంటూ పాలగిన్నె తీసి పక్కన పెట్టి టీ కి రెడీ చేసేసాను. 
😕
చిన్నమ్మాయి సంజన "అమ్మా నేనొచ్చేసా...పాలు కలుపు.."గట్టిగా అరిచింది...గబగబా పాలల్లో బూస్ట్ కలిపి ఇచ్చాను. 
😐

వాళ్ళు ముగ్గురూ రెడీ అయ్యి వచ్చేసరికి ముగ్గురి లంచ్ బాక్సులు తీసి పెట్టి, ఎవరికి  ఎలా కావాలో అడిగి సర్దేశాను.
ఇడ్లీ పెట్టి, అల్లం పచ్చడి చేసిస్తే ముగ్గురూ తినేశారు. పిల్లలిద్దరికీ మధ్యలో ఎపుడు  గ్యాప్ దొరికితే అపుడు జడలు  వేస్తున్నాను.

పనిమనిషి పని చేసుకుంటూనే "అమ్మా..ఛాయ్" అరిచింది. మళ్లీ  స్టవ్ దగ్గరకి ఉరికి టీ  పెట్టి జడలు వెయ్యటానికి వచ్చాను. ఆ పని అయ్యేసరికి పనామె "ఎంతకాలమాయె ఛాయ్ అడిగి" అని గులుగుతా వుంది ...
నేను మనసులో "ఛీ ...జీవితంలో ఎవ్వరికీ  ఇంతలా భయపడలేదు" అని తిట్టుకుంటూ...బయటకు మాత్రం చాలా శ్రద్ధగా టీ  ఇచ్చాను. 
🤭😏

నా నటనా కౌశలం గమనించి మావారు,పిల్లలు విచిత్రంగా చూస్తారు....!! 
🤫

చూడరా మరి, పొట్టనిండా పాలు, టీలు, టిఫిన్లు ఉంటే  నవరసాలు ఎన్నైనా పండించచ్చు ...
😎
పొట్టలో కాఫీ కూడా పడకపోతే ఆ ఆరాటం, ఆ నీరసం తెలిస్తేగా... ఆ ...అయినా చూస్తే చూడనీ.. నేనేమన్నా పట్టించుకుంటేగా... నా టెన్షన్లు నాకున్నాయి మరి.. ముగ్గురూ  ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు కాఫీ తాగాలి...అది కూడా ప్రశాంతంగా...!! 
🤩

పిల్లలు కాలేజీ వెళ్లిపోయారు. మావారు ఆఫీస్ కి బయలుదేరుతుంటే...
ఎప్పుడూ అనుకుంటూ అప్పుడప్పుడు వేసే ప్రశ్న వేసాను "ఎప్పుడు రిటైర్  అవుతారు" అని.. ఆయన  ఎప్పటిలానే నవ్వేసి, "ఇంకొక్క 10 సంవత్సరాలు ఆగితే సరిపోతుంది" అన్నారు. 

అందరూ వెళ్ళగానే 'ఇక ఇప్పుడు నా సంగతి చూడు' అన్నట్లు లేచి, పాలకోసం తన బౌల్ తెచ్చుకుని రెడీ అయిపోయింది...మా కుక్క రాంబో 
🐕...
లోపలకి  వెళ్లి పాలు తీసుకువచ్చి వేసాను. అది నా చేతులు నాకి, నాకి థాంక్స్ చెప్పింది... అదే నయం...రోజూ  థాంక్స్ చెప్తుంది...!! 
😍

లోపలకి వెళ్లి పాలు వేడి చేద్దామని స్టవ్ మీద పెట్టాను. పెరట్లో పిట్టలు కిచకిచ అంటూ, కాకులు కావుకావుమంటూ ఒకటే గోల..! 
పెరటి గోడమీద అన్నం పెట్టగానే అన్నీ ఒక్కసారిగా వచ్చి చేరాయి. వాటి పని కూడా అయ్యాక కాఫీ కలుపుకుని హాల్లో  కూర్చుని తాగేసా..!! 
😁

- ఏ టెన్షన్లు,హడావుడి లేకుండా బయట ఉయ్యాల బల్ల మీద కూర్చుని, ప్రకృతిని ఆస్వాదిస్తూ , ప్రశాంతంగా కాఫీ తాగే  టైమ్ లో కాఫీ ఎప్పుడు తాగుతానో.....!!! 
- 😋

ఇలా కాఫీ తాగాలంటే అదృష్టం కావాలా...!!!

- టైమ్  రావాలా...!!! 🤔

No comments:

Post a Comment