Tuesday, January 28, 2020

ధనార్జన

ధనార్జన

🤔 ప్రతి మనిషీ సాధించవలసిన పురుషార్థాలు నాలుగు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ నాలుగింటిలో మొదటిది ధర్మం.

ఓ కుటుంబానికి యజమానిగా మనిషి తన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడమే కాకుండా ఉద్యోగ విధులనూ సక్రమంగా పాటించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా కర్తవ్యాలను నిర్వర్తించాలి. ఇలాంటి ధర్మ జీవనమే మనిషికి నిశ్చింతను కలగజేస్తుంది.

నేటి మనిషి అర్థ, కామాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. వీటివల్లే సుఖ శాంతులు కలుగుతాయని భ్రమిస్తున్నాడు. ఈ సుఖాల కోసం ధనానికి దాసుడవుతున్నాడు. ధన సంపాదన కోసం అధర్మ, అక్రమ మార్గాలను అనుసరిస్తున్నాడు. చివరికి తన జీవితాన్ని తానే నాశనం చేసుకొంటున్నాడు.


భోగభాగ్యాల వల్ల కలిగే సుఖశాంతులు మనిషికి క్షణికమైన ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. శాశ్వతమైన ఆత్మానందాన్ని ఇవ్వలేవు. ఈ సుఖాల కోసం అర్రులు చాస్తూ మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. నీతి, ధర్మ, సత్య మార్గాలను విడిచిపెట్టకూడదు.

అక్రమార్జన మనిషికి అశాంతిని కలిగిస్తుంది. నిజాయతీతో కూడిన నీతిమంతమైన సంపాదన ఎనలేని తృప్తినిస్తుంది.

నిజాయతీ దైవాంశ. ఎన్ని కష్టాలు కలిగినా నిజాయతీని, ధర్మాన్ని వీడని ధర్మవీరులు మన ప్రాచీన గాథలలో కనిపిస్తారు. వారు ఆదర్శ పురుషులు మాత్రమే కాదు, మనకు దిశానిర్దేశం చేసే రుషులు కూడా.


చాణక్యుడు ఒక రాత్రిపూట ప్రభుత్వ జమా ఖర్చులు రాయవలసి వచ్చింది. ఒక దీపాన్ని వెలిగించి, ఆ కాంతిలో వాటిని రాశాడు. పని అయిపోగానే ఇంకో దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని ఆర్పేశాడు. అతడికి సమీపంలో ఉన్న వ్యక్తి ఇది చూసి ‘ఆ దీపాన్నెందుకు ఆర్పారు, ఈ దీపాన్నెందుకు వెలిగించారు?’ అని అడిగాడు. దానికి సమాధానంగా చాణక్యుడు ‘ఆ దీపంలో నూనె ఖర్చు ప్రభుత్వానిది. అందుకే దాని కాంతితో ప్రభుత్వ సంబంధమైన పని చేశాను. ఇప్పుడు నా సొంతపనుల కోసం నా సంపాదనతో కొన్న నూనె పోసిన దీపాన్ని వెలిగించాను’ అన్నాడు. అర్థశాస్త్రం పరమార్థాన్ని ఆచరించి చూపించిన చాణక్యుడి నిజాయతీ అందరికీ ఆదర్శం కావాలి.

మనిషి తాను ధర్మంగా జీవించడమే కాకుండా అధర్మాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ కూడదీసుకోవాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ మనల్ని వెన్నంటి కాపాడేది ధర్మమే. సమున్నత వ్యక్తిత్వం ముందు ఎంత సంపదైనా సాటిరాదు. ప్రతి వ్యక్తీ మానవీయ విలువలు పెంపొందించుకుంటూ, పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలి.

ధనార్జన కూడనిది కాదు. ఆ ఆర్జన ధర్మార్జన కావాలి. అక్రమార్జన మనిషికి చెడ్డపేరును తెచ్చి అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. సక్రమార్జన మనిషికి మంచిపేరును తెచ్చి సంఘంలో గుర్తింపునిస్తుంది. అసలైన మనిషి నోట్ల కట్టలకంటే నైతిక విలువలకే కట్టుబడి ఉంటాడు. అతడికే సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.


సిరిసంపదలు కొబ్బరి కాయలోకి నీరు వచ్చినట్లు తెలియకుండా వస్తాయి. అవి పోవడం ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె కానరాకుండా హరించిపోతాయి. అందుకే ఈ ఐశ్వర్యాదులు శాశ్వతమని నమ్మి మనిషి విర్రవీగకూడదు.
ఏ మనిషైనా తనకున్నదానితో తృప్తిపడాలి. సత్యధర్మాలను ఆలంబనగా చేసుకోవాలి. తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అలాంటివారు సమాజంలో ఆదర్శమూర్తులుగా నిలిచిపోతారు.🌹

No comments:

Post a Comment