Tuesday, January 28, 2020

కాలజ్ఞానం

కాలజ్ఞానం

👌 కాలం ఎంతో శక్తిమంతమైనది. అత్యంత వేగంగా, చురుకుగా కదులుతూ ఉంటుంది. ఓ సుశిక్షితుడైన సైనికుడిలా కదను తొక్కుతూ ఎవరికోసం ఆగక, దేనికోసం ఎదురుచూడక నిశితదృష్టితో ముందుకు సాగుతుంది. యుగాలు మారినా తరాలు మారినా అది తన పథమూ మార్చదు, పంథానూ మార్చుకోదు. కాలం ఓ అధ్యాపకుడు, వైద్యుడు, జీవిత సత్యాల సారాన్నెరిగిన ఓ మహర్షి- వెరసి ఓ జ్ఞాని, వేదాంతి. సృష్టిలోని సకల కార్యకలాపాలకు ఓ మౌన సాక్షి.

కాలం తన గమనంలో ఎన్నో ఉత్పాతాలను, విపత్తులను చూసింది. చీకటి యుగాలను, అనాగరిక సమాజాలను గమనించింది. నాగరిక సొబగులను నేర్చుకుంటూ సంస్కరించుకుంటూ అభివృద్ధి పథంలో నడిచిన ప్రజలను చూసి సంతోషించింది.
మహా సామ్రాజ్యాలను, చక్రవర్తులను వారి సామ్రాజ్య విస్తరణ కాంక్షను, సాగించిన యుద్ధాలను కాంచింది. తరతరాలుగా బానిసత్వంలో మగ్గి, చనిపోయిన ప్రజలను చూసింది.

పశుప్రాయ దశనుంచి మానవుడు తనను తన ఆలోచననను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగడం చూసి అబ్బురపడింది. మేధావులు తమ మేధతో, శాస్త్రజ్ఞులు జిజ్ఞాసతో చేసిన నూతన ఆవిష్కరణలు, కొత్త విషయాలు మానవుడి జీవితాన్ని మానవ నాగరికతను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న తీరుకు ఆనందించింది. అదే మానవుడు ఉచ్చనీచాలు మరచి అమానవీయంగా అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును చూసి ఖిన్నురాలవుతూ వడివడిగా అడుగులు వేసింది.

కాలం పక్షపాతి కాదు. ఒకరి మీద అవ్యాజమైన ప్రేమను చూపదు. మరొకరిమీద అకారణమైన ద్వేషాన్ని కనబరచదు. రాజు, పేద, పండితుడు, పామరుడు... ఎవరైనా ఒకటే. ఎవరి మీదైనా సమదృష్టే. బాల్య, కౌమార, యౌవన వృద్ధాప్యాలను అందరికీ వర్తింపజేస్తుంది. అలాగే మరణాన్నీ! మరిన్ని ప్రాణులకు ఊపిరిపోస్తుంది. రాగద్వేషాలకతీతంగా ఉంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుంది.

ఈ అనంత విశ్వపయనంలో మనం నిర్దేశించుకున్న కాలప్రయాణం, దానిలో మానవజీవిత కాలవ్యవధి- అత్యంత పరిమితమైనవి. ఎవరికైనా అవే గంటలు, అవే నిమిషాలు... సరైన యోచనతో విభాగించుకుని మనకు, ఇతరులకు ఎంతెంత వినియోగించుకోవాలో నిర్ణయించుకోవాలి.


కాలానికున్న మరొక ధర్మం ‘శీఘ్రగతి.’ అలా సాగకపోతే మానవులు వారి బాధలనుంచి దుఃఖాల నుంచి వేదనల నుంచి తేరుకోలేరు. అలా జరగనంతకాలం వారి జీవితం స్తంభించిపోతుంది. ఆ జీవితంలో ఆనందమే ఉండదు. కాలం ప్రవహిస్తూ ఆ వ్యధ వారు మరచేటట్లు చేస్తుంది. కార్యోన్ముఖులను చేసి వారి జీవితాలను గాడిలో పెడుతుంది. కాల శీఘ్రగమనం ఒంటి దెబ్బలకే కాక, మానసిక గాయాలకు సాంత్వన ఇచ్చే ఓ చల్లనిపూత.

అలసట ఎరుగని తన రెక్కలతో కాలం నిరంతరం ఎగురుతూనే ఉంటుంది. దాన్ని నియంత్రించే సత్తాగాని, దాని వేగాన్ని మందగింపజేసే శక్తిగాని ఎవ్వరికీ లేదు. ఎవరు గమనించినా, గమనించకున్నా దానిది ఎప్పుడూ ముందుచూపే.

కాలగమన ప్రభావం శరీరం మీద పడని వారుండరు. ఎప్పుడూ కొత్త స్నేహితులు, కొత్త ఊసులు, కొత్తవారితో నెయ్యం కొనసాగిస్తూనే- పాతవారి మేధతో, సృజనతో, దార్శనికతతో, మానవీయ విలువలతో మైత్రిని కొనసాగిస్తూనే ఉంటుంది.


గడిచిన క్షణాన్ని పొందలేం. దాని తాలూకు అనుభవాన్ని మాత్రమే పొందుపరచుకోగలం. పంచుకోగలం. దాని ఉపయోగ నిరుపయోగాలను బట్టి చేదు, తీపి జ్ఞాపకాలు మిగులుతాయి. గడచిన కాలం గురించి వగచటమంటే దాన్ని వ్యర్థం చేశామనే అర్థం.🙏

No comments:

Post a Comment