Tuesday, May 26, 2020

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

” అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? “

అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

👉చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా …
‘ నేను మాత్రం చావను ’ అనుకుంటాడు మనిషి.
అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. ” అని జవాబిస్తాడు ధర్మరాజు.

మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా
పసిప్రాయంలోనే ” అకాల మృత్యువాత ” పడి మరణించే వారిని.
అలాగే యవ్వనంలో, ప్రౌఢ ప్రాయంలో ఉన్నవారి దగ్గరనుండి
వృద్ధాప్యంలో ఉన్న వారి వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు
రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు.
ఇన్ని చూస్తూనే ఉన్నా. ” మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు ” అన్న
భ్రమలో ఉంటూంటాం మనం.

చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి,
ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి.
” చావు అన్నదే లేని ఇంటినుంచి కొన్ని ఆవగింజలు తెస్తే,
వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను ” అంటాడు బుద్ధుడు.
” ఇంతేనా, వెంటనే తెస్తా ” అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి …
తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది.

పుట్టినవారు చావక తప్పదు ; చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు.
వచ్చేవారు పోక తప్పదు ; పోయేవారు రాక తప్పదు.

చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది మీదకి వస్తుంది.
మీదనున్నది క్రిందకి వస్తుంది.
భూలోకంలోని వారు స్వర్గలోకం లోకి వెళ్తారు.
స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు.

ఈ చక్రభ్రమణానికి ఏడవడం ఎందుకు?
ఇది మనకోసం మనం ఏర్పరచుకున్న చక్రభ్రమణం.
చిన్నప్పుడు మనం పాఠాశాలలకు వెళ్ళి తరగతి తరువాత తరగతి పూర్తిచేశాం కదా.

అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠాశాల.
ఇక్కడికి వస్తాం. కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం.

క్రొత్తక్రొత్త పాఠాలు నేర్చుకోడానికి అనువుగా ఉండే
వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం.
ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం;

కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు.
జన్మపరంపరలో పుట్టుకకు సంతోషం …
మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే …

” మనం సత్యాన్ని తెలుసుకోలేదు ” అని అర్థం.
” ఇంకా అజ్ఞానం పోలేదు ” అని అర్థం.
ఏ క్షణంలోనైనా చావు రావచ్చు …
కనుక ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించాలి.

ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని …
ఒకానొక పండితుడు,
మన రాకలు, మన పోకలు మన చేతుల్లోనే వున్నాయి.
వాటికి మనమే సృష్టికర్తలం.

” అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది” …
” నా పోక పైవాడి చేతుల్లో ఉంది ” అనేవి స్థూలదృష్టిలోనే సత్యాలు.
కానీ సూక్ష్మదృష్టిలో, దివ్యదృష్టిలో అవి అసత్యాలు. 🤔


No comments:

Post a Comment