Thursday, July 16, 2020

అనుభవాలు

అనుభవాలు
🕉️🌞🌎🏵️🌼🚩

జీవితంలో మంచి అనుభవాలు మరచిపోలేని మధురమైన అనుభూతులుగా మనిషి మనసులో నిక్షిప్తమవుతాయి. ఇవి అనుభవించడానికి మనిషికి ఏ రకమైన వేదాంతం కాని, శిక్షణ కాని అవసరం లేదు.

చెడు అనుభవాలు చేదు జ్ఞాపకాలుగా జీవితాంతం వెంటాడతాయి. ఈ అనుభవాలను ఏ మనిషీ కోరుకోడు. అయినా ఇవి ప్రతి మనిషికీ ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం, స్థితప్రజ్ఞతతో ఈ అనుభవాలను ఒకేలా స్వీకరించాలి.

అష్టావక్రుడు ఏమని ఉపదేశించాడు? ‘అసలైన జ్ఞాని తనను ఎవరైనా నిందిస్తే బాధపడడు. అలాగే, ఎవరైనా పొగిడితే ఉబ్బితబ్బిబ్బయిపోడు. దూషణ అనేది ఒక శబ్దం. దేహాభిమానం ఉన్నంతవరకు మనల్ని ఆ శబ్దం బాధిస్తుంది. నేను దేహాన్ని కాదు, ఆత్మను అని అనుకుంటే ఆ శబ్దం మనల్ని బాధించదు’!

మనువు ఇలా బోధిస్తాడు- ‘ఒక సాధకుడు ప్రశంసలను విషంగా భావించి భయపడాలి. అవమానాన్ని అమృతం అనుకుని ఆనందించాలి’. చెడు అనుభవం కలిగినప్పుడు బాధపడకుండా ఎలా ఉంటామని అనిపించక మానదు. అందుకే పెద్దలు బుద్ధుడిని, కబీరును ఉదాహరణలుగా చెబుతుంటారు. బుద్ధుడిని అవమానపరచడానికి కౌశాంబి రాణి ఒక యువతిని హత్యచేసి బుద్ధుడి నివాసం వద్ద పడేయమని భటులను ఆజ్ఞాపిస్తుంది. ఆమె భటులు అలాగే చేశారు. యువతిని హత్య చేసింది బుద్ధుడేనని ఎందరో భావించారు. తరవాత నిజం తెలియడంతో బుద్ధుడి కీర్తి ఇంకా పెరిగింది.

కబీరు ఒక సభలో ఉండగా ఓ మహిళ అక్కడికి వెళ్లింది. కబీరుకు తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పింది. ఆ మాటలు విన్న కబీరు దిగులుపడలేదు. ఎప్పటిలా స్థిరచిత్తం ప్రదర్శించాడు .

మనసును బలపరచుకుని నిందాస్తుతులను సరిసమానంగా భావించేవారు మంచి, చెడు అనుభవాలను ఒకేలా స్వీకరిస్తారు. సుఖాలకు పొంగిపోరాదని, కష్టాలకు కుంగకూడదని, అన్ని సమయాల్లో ధీరోదాత్తంగా మెలగాలని విదురనీతి చెబుతోంది.

కొన్ని అనుభవాలు కొందరి జీవితాలనే మలుపు తిప్పుతాయి. దారిదోపిడులు చేసే రత్నాకరుడికి తన పాప ఫలితాలు భార్యాబిడ్డలు పంచుకోరని తెలియగానే జ్ఞానోదయం కలుగుతుంది. వెంటనే అతడు ఘోర తపస్సు చేసి వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని జాతికి అందించాడు.

లక్ష్యసాధన కోసం అవతార పురుషులూ ఎన్నో చెడు అనుభవాలను ఎదుర్కోవలసి వచ్చింది. పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు తండ్రి మాటకు తలవంచాడు. కానలకు ప్రయాణమయ్యాడు. అలాగే, శ్రీకృష్ణుడు- చేయని నేరానికి అవమానాలను, అపనిందలను భరించాడు. చివరికి నిందావిముక్తుడు కావడం కోసం శమంతకమణి జాడ తెలుసుకున్నాడు. జాంబవంతుడితో యుద్ధం చేసి శమంతకమణిని, జాంబవతిని దక్కించుకున్నాడు .

చేదు అనుభవాలు ఎదురైనా అవతార పురుషులు ఆత్మస్థైర్యం, ధీరత్వంతో ముందుకు సాగి అవతార లక్ష్యాలను పూర్తిచేస్తారు.

ప్రతికూల పరిస్థితులు, చెడు అనుభవాలు ప్రతి మనిషికీ ఎదురవుతాయి. విజ్ఞులైనవారు ఈ అనుభవాల నుంచి కొన్ని సందేశాలు నేర్చుకుంటారు. ప్రతీ అనుభవం ఒక పాఠంలా భావిస్తారు.

సత్సాంగత్యం వల్ల ధర్మాచరణ, విద్య ద్వారా వివేకం కలుగుతాయి. అనుభవం వల్ల కలిగిన పాఠం మాత్రం మనసులో గాఢంగా ముద్ర వేస్తుంది. అది జీవన మార్గాన్ని నిర్దేశిస్తుంది. మనిషి వ్యక్తిత్వాన్ని పటిష్ఠం చేసి అతడిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది.

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment