Monday, July 20, 2020

సుశనుడు

#సుశనుడు

అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతినే శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేకానేక పురాణకథలలో కనిపిస్తుంటుంది.

రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది.

పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటుండేవాడు అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుశనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకుని తీసుకువెళ్ళాడు.

ఆ విషయం తెలిసిన కుబేరుడు తను సుశనుడి చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు పరమేశ్వరుడినే శరణువేడాడు. శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు.

అయితే ఈ విషయం తెలిసిన సుశనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు.

శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురయింది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవం. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు. ఆనాటినుండి అలా వంగిన శూలం శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది.

అల్లరి చేష్టలు లాగా తనను చీకాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగివేశాడు. అలా సుశనుడు పరమేశ్వరుడు గర్భంలో తిరగడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి గర్భగోళంలో వుండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆముని ఈశ్వరుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు. అయినా చాలాకాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు.

సుశనుడు మరీమరీ ఆర్థ్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోమార్లు వేడుకున్న మీదుట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి వుంచి ఆ రంధ్రం నుండి సుశనుడిని బయటకు రమ్మనమని చెప్పాడు. చేసేది లేక ఈశ్వర శుక్లం వెలవడే ఆరంధ్రం నుండే సుశనుడు బయటకు వచ్చాడు. ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు.

బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. శివుడికి అప్పటికీ అతడిమీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడినవాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతడిని రక్షించమని ప్రార్ధించింది.

పార్వతీదేవి ప్రార్ధన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచి పెట్టాడు. శుక్రుడు కూడా తనమీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుశనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు.

ఈ శుక్రాచార్యుడు కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా కనిపిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment