Sunday, January 10, 2021

మాటలకేం.... కవిత

పద సోపానాలు!
---------------------------
మాటలకేం
మహా గొప్పగా మాట్లాడవచ్చు
మహా చప్పగానూ మాట్లాడవచ్చు
మాటలతో మనసులు కలపవచ్చు
మాటలతో గొడవలు పెంచవచ్చు
మాటలతో వదరవచ్చు
మాటలకు బెదరవచ్చు
నానార్ధాలు,సమానార్ధాలు,
పర్యాయపదాలు,వ్యతిరేకార్ధాలు!!
మాటలెన్నో ఉన్నా
వాస్తవం ఒక్కటే
ఆ ఒక్క వాస్తవాన్ని తెలిపేందుకు
మాటలెన్నో కావాలి కదా మరి!!
వాస్తవాన్ని ప్రతిబింబించే మాటలు
వాస్తవాన్ని వక్రీకరించే మాటలు
వాస్తవానికి ఎన్నో దృక్కోణాల మాటలు
వాస్తవాన్ని విభిన్న రీతుల్లో
వ్యాఖ్యానించే మాటలు!
ఆ వ్యాఖ్యానాలను సమర్ధించేవి కొన్ని,
వ్యతిరేకిస్తూ ఘర్షించేవి మరి కొన్ని!
మాటలకేం
అవి కోటలు దాటతాయి!
కోటానుకోట్లుగా పెరుగుతాయి!!
కొన్ని మాటలు
వీణలు మీటినట్లుంటాయి!
కొన్ని
శరాఘాతాలై గుండెను చీల్చుతాయి!!
కొన్ని ఆలోచింపజేస్తాయి
కొన్ని ఆవేశింపజేస్తాయి
కొన్ని ఉత్తేజింపజేసి
కార్యాచరణకు ఉద్యుక్తులను చేస్తాయి
కొన్ని ఉద్రేకింపజేసి
కదం తొక్కిస్తాయి
కొన్ని మాటల అర్ధాలు వేరు
అవి అనర్ధాలకు దారితీస్తాయి
నోరు పలికే మాటలు కొన్ని
నొసలు పలికే మాటలు కొన్ని
మొసలి కన్నీరు కార్చే మాటలు
మరి కొన్ని!
లౌక్యంతో కూడిన మాటలు
అబద్దాలు సమర్ధించే మాటలు
అపార్ధం కలిగించే మాటలు
మాటలొక్కోసారి నీటి మూటలు
మాటలు కత్తి వేటులు
మాటలు అగ్ని జ్వాలలు
మాటలు మల్లె మాలలు
మాటలకేం వేనవేలు
మాటలకు వేవేల దండాలు!!
--- దండమూడి శ్రీచరణ్
9866188266

Source - Whatsapp Message

No comments:

Post a Comment