Friday, January 1, 2021

స్థిత ప్రజ్ఞుడు

స్థిత ప్రజ్ఞుడు
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

ఏ విషయాన్నైనా మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే దాని గురించి పూర్తి వివరాలు తెలిసుండాలి. అంతేకాదు, ఆ విషయం గురించిన అనుభవం కూడా పొందాల్సి ఉంటుంది. మనిషి మంచి నడవడిక కలవాడు కావాలంటే మంచి లక్షణాలను తెలుసుకోవాలి. దానితోపాటు అటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.


దట్టమైన మోహారణ్యాన్ని దాటే బుద్ధి కలిగినపుడు సమస్తం శుభకరమే అవుతుందని శ్రీకృష్ణుడు చెప్పగానే అటువంటి దివ్యమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అర్జునుడికి తెలుసుకోవాలని అనిపించింది.


ఆ విషయాన్నే అడుగుతూ ‘కృష్ణా! స్థితప్రజ్ఞుడైన వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అతడెలా మాట్లాడతాడు? అతడి భాష ఎలా ఉంటుంది? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు’ (భగవద్గీ 2.54) అని ప్రశ్నలు కురిపించాడు. అంటే అర్జునుడు స్థితప్రజ్ఞత కలిగిన ఆదర్శమూర్తికి గల లక్షణాలేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కాని రాబోయే కాలాలలో తానే ఒక ఆదర్శవంతుడిని కాబోతున్నానని అతడు ఊహించలేకపోయాడు. సంపూర్ణ శరణాగతుడైన భక్తుని భగవద్గీత నిశ్చయంగా రాబోయే తరాలకు ఆదర్శవంతంగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


సాధారణంగా ప్రజ్ఞ అనే పదానికి బుద్ధి అనే అర్థం చెబుతారు. ప్రజ్ఞ కలవాడే ప్రాజ్ఞుడు. కాబట్టి బుద్ధిమంతులందరు ప్రాజ్ఞులనే భావన అందరికీ వచ్చేసింది. కాని అర్జునుడు తన ప్రశ్నలను శ్రీకృష్ణుడికి విన్నవిస్తున్నప్పుడు స్థితప్రజ్ఞుడు అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే సుస్థిరమైన ప్రజ్ఞ కలవాడిని గురించి అడిగాడు.


ప్రతి మనిషికీ కర్మానుసారం ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా అతడు జీవన కలాపాలను కొనసాగిస్తుంటాడు.


అయితే మనిషి ఆత్మ స్థితిలో నిలువనంత వరకు బుద్ధి ఏ క్షణంలోనైనా మనసు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. కేవలం ఆత్మస్థితిలో ప్రవేశించి తద్వారా బుద్ధిని జాగృతం చేసుకున్నవాడే మానసిక క్లేశాలకు దూరం అవుతాడు. అంటే ఆత్మస్థితిని గురించిన పరిచయం వలన జాగృతమయ్యే బుద్ధి ద్వారానే ఎవరైనా మోహారణ్యాన్ని, చింతల అడవులను దాటగలుగుతారు. ఆ విధంగా ఆత్మస్థితిలో అనుభవం ద్వారా పదునెక్కిన బుద్ధినే ప్రజ్ఞ అనాలి. అటువంటి ప్రజ్ఞలో సుస్థిరుడైన వ్యక్తి లక్షణాలేమిటో తెలుసుకోవాలని అర్జునుడు ఉవ్విళ్లూరాడు.


శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ.. ‘పార్థా! మనిషి ఎప్పుడైతే మనసు ద్వారా కల్పించబడే అన్ని విధాలైన కోరికలను విడిచిపెడతాడో, ఎప్పుడైతే ఆ విధంగా కోరికలు తొలగిన అతని మనస్సు ఆత్మస్థితిలో తృప్తి చెందుతుంది అపుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు (భగవద్గీత 2.55)’ అని అన్నాడు. మనశ్శాంతి కరువైందని అందరూ వాపోతుంటారు.


కాని మనశ్శాంతి కేవలం రెండు స్థితులలోనే లభిస్తుంది. ఆ రెండు స్థితులే నిద్ర, మరణం. నిద్రలో ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. ఇక మరణం గురించి చెప్పనక్కర్లేదు. అయితే మనిషి జాగృతావస్థలో ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండే అవకాశమే లేదు. కాని ఆత్మస్థితి గురించిన ఎరుకతో జాగృతమైన బుద్ధిలో, అంటే ప్రజ్ఞలో స్థితుడైనపుడు (స్థితప్రజ్ఞుడైనపుడు) మానసిక కలాపాలు ఆగిపోతాయి.


అంటే అనవసరమైన భోగవాంఛలు ఆగిపోతాయి. దీని అర్థం స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి కోరికలు కలగవని కాదు. అయితే ఆ కోరికలు స్వీయభోగానికి అయి ఉండవు. అవన్నీ తన ఆత్మోద్ధారానికో లేదా జనుల, సకల జీవుల ఉద్ధారానికో అయి ఉంటాయి. సంపూర్ణ భగవదాశ్రయంలో అటువంటి మహాత్ములు, స్థితప్రజ్ఞులు సకల మానవాళికి ఆదర్శనీయులుగా మారుతారు. అటువంటి స్థితప్రజ్ఞులను అనుసరించినపుడే మానవులు నిత్యోత్సాహంతో జీవనాన్ని కొనసాగిస్తూ జన్మను సార్థకం
చేసుకొంటారు.

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment