Friday, January 1, 2021

నిత్యానిత్య వస్తు వివేకం

నిత్యానిత్య వస్తు వివేకం
🕉🌞🌎🌟🏵🌼🚩

జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు మనం ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి? అన్ని అంశాలకూ. జీవితంలో అప్రధానమైన అంశం అంటూ ఏదీ లేదు. మన జీవన విధానం ఏదో, దానికై అనుసరించాల్సిన పద్ధతులేవో అలాంటి అంశాలన్నీ ముఖ్యమైనవే. మనది కాని విధానం పట్ల ప్రాధాన్యం, ఏకాగ్రత మన అవసర ప్రాధాన్యాన్ని దెబ్బతీస్తుంది. మన జీవన విధానం ఒక వర్తులం అనుకుంటే- అందులోని ప్రతి అంశం ప్రతి అణువు మనకు ప్రధానమైనదే, పవిత్రమైనదే. ఇంట్లో కనిష్ఠ వస్తువైన చీపురు ఎంత ప్రధానమైనదో మనకు తెలియనిదేమీ కాదు. మన జీవన పరిధిలోని ప్రతి కనిష్ఠ అంశమూ అంతే. చీపురు కంటే ప్రధానమైన వస్తువు మన గృహాల్లో మరొకటి ఉండదు. వస్తువు ద్రవ్యరూప విలువను బట్టి ఎప్పుడూ దాని విలువ మారదు. దాని విలువ... మిగిలినవాటితో దాని మమేకం, దాని అవసరం, దాని తోడ్పాటు- అన్నింటిపైనా ఆధారపడుతుంది. మొత్తంమీద దేని విలువ దానిదే. దేని ప్రాధాన్యం దానిదే.

అలా అని అన్ని అంశాలు, వస్తువులు, పనులు ప్రధానం కావు. ఎంపిక ఉంటుంది. అవసర ప్రాధాన్యం ఉంటుంది. అభిరుచుల ప్రమేయం ఉంటుంది. ముఖ్యంగా అవి మనకు తగినవేనా, అంత అవసరమైనవేనా అనే విచక్షణ అవసరం. ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని ‘నిత్యానిత్య వస్తు వివేకం’ అంటారు. ఈ మాటల అర్థం, లోతు అత్యున్నతం. అవి నిగూఢమేఅయినా ప్రాపంచిక విషయాలతోనూ కొంతవరకు పోల్చుకోవచ్చు. సంగీతజ్ఞుడికి సమ్మెట పనిమీద ఆసక్తి కాలహరణం తప్ప మరోటి కాదు. పూజారికి పాల వ్యాపారంమీద అనురక్తి అర్థంలేని వ్యధ తప్ప ఇంకోటి కాదు. మన జీవితానికి సంబంధించి మనం ఎన్నుకున్న అంశాల మీదే మన ఆసక్తులు, అధ్యయనాలు, అన్వేషణ ఉంటేనే అది మన రంగంలోని పురోభివృద్ధికి తోడ్పడుతుంది. కొన్నిసార్లు మన ప్రధాన ప్రవృత్తికి పూర్తి వ్యతిరేక వ్యవహారాన్ని నిర్వహించవలసిన అగత్యం కలిగినప్పుడు దానిపట్ల తామరాకు మీది నీటిబొట్టు చందాన మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది. పరమ భక్తుడైన ధర్మవ్యాధుడు కటిక వృత్తిని నిర్వహించడమే ఇందుకు సరైన ఉదాహరణ.

ఇలా అభిరుచికి, కర్మఫల సంక్రమణకు అనువైన వ్యవస్థలో జీవించే మనం వీలైనంత ఉత్తమ జీవన పద్ధతిని ఎన్నుకోవాలి. చూపుపడిన ప్రతిదాన్ని ఆశించకుండా, ఆశపడిన ప్రతిదాన్ని అందుకోవాలని అర్రులు చాచకుండా నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగిఉండాలి. ఆ వివేకం కోసం మళ్ళీ సాధన చేయాలి. అల్ప విషయాల్లోని, అతి సూక్ష్మ అంశాల్లోని జాగ్రత్తే మనకు ఉన్నత అంశాలమీద అంతటి శ్రద్ధ వహించే క్రమశిక్షణను అలవరుస్తుంది. విజ్ఞులు చెప్పినట్లు చిన్న పనులమీద మనం చూపే శ్రద్ధ, పనితనంద్వారా- మనం పెద్ద విషయాలను, ఉన్నత అంశాలను ఎంత ఉత్తమ ప్రమాణాలతో నిర్వహించగలమో గ్రహించవచ్చు అంటారు. నిజమే. చిన్న బీజాన్ని శుభ్రపరచుకుని క్రిమిరహితం చేసి క్షేత్రంలో నాటుకుంటేనే ఉత్తమ వృక్షం మనచేతికి అందుతుంది. చిన్నపనుల ప్రాధాన్యం పెద్ద విజయాలకు బీజసూత్రం, విజయ సూత్రం. సూక్ష్మాంశాల ప్రాధాన్యాన్ని మనం గ్రహించాలి. పర్వత శిఖరాన్ని చేరుకోవాలన్నా పర్వతపాదం మీద మొదటి అడుగు వేయాల్సిందే. అడుగు అడుగునా ఆరోహణ చేయాల్సిందే* .

🕉🌞🌎🌟🏵🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment