Monday, January 11, 2021

ఆత్మస్థితిలోనే ఆనందం

ఆత్మస్థితిలోనే ఆనందం
🌻🌞🌼🌞🌻🌞🌼🌞🌻🌞🌼
పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.

సాధువుతో పాటు శ్రీమంతుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. సాధువుతో.. ‘‘స్వామి! మా ఇంట్లో పాయసం అమృత సమానంగా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి’’ అని అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. రెండు గ్లాసుల్లో పాయసం తెచ్చి అక్కడుంచారు. శ్రీమంతుడు ఒక గ్లాసు తీసుకుని అపురూపంగా పాయసం తాగాడు! ఇది గమనించిన సాధువు.. ‘‘పాయసం ఎలా ఉంది నాయనా!’’ అన్నాడు. ‘అమృత సమానంగా ఉంది’ అన్నాడు శ్రీమంతుడు. వంటవాడు రెండో దఫా పాయసం తెచ్చాడు. శ్రీమంతుడు మళ్లీ తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు సాధువు. ‘‘ఫర్వాలేదు’’ అన్నాడు. సాధువు వంటవాడిని పిలిచి మరో గ్లాసు పాయసం తేవాల్సిందిగా చెప్పాడు. శ్రీమంతుడితో దానిని కూడా తాగమన్నాడు. అయిష్టంగానే తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘విష తుల్యంగా’’ ఉందన్నాడు శ్రీమంతుడు. భోజనాలు పూర్తయిన తర్వాత సాధువు, శ్రీమంతుడు బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు. శ్రీమంతుడు మాత్రం ఇందాక చేసిన భోజనంలోని వంటకాల విశేషాల గురించి చెప్పసాగాడు. సాధువు కల్పించుకొని.. ‘‘నాయనా! మొదట పాయసం తాగినపుడు అమృతంగా ఉందన్నావు. రెండోసారి ఫర్వాలేదన్నావు. మూడోసారి విషంగా ఉందన్నావు! పాయసం అమృతం అయితే.. ఎన్నిసార్లు తాగినా అమృతంగానే ఉండాలి కదా! కాబట్టి విషయం బాహ్య వస్తువులో లేదు. మన భావనే వస్తువులలో సుఖాన్ని కల్పిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఒకసారి గొప్పగా కనిపిస్తాయి, మరోసారి వృథాగా అనిపిస్తాయి. జీవుడు బాహ్య వస్తువులపై విరాగం కలిగి ఉండి.. ఆత్మస్థితిలో ఆనందాన్ని కలిగి ఉండాలి’’ అని బోధించాడు.
🌸🎈🌼🎈🌻🎈🌸🎈🌼🎈🌻🎈

Source - Whatsapp Message

No comments:

Post a Comment