Saturday, February 6, 2021

సాధనకు సోపానాలు

సాధనకు సోపానాలు

🍁🍁🍁🍁

భగవంతుని పట్ల భక్తుడు చూపే నిస్వార్థమైన ప్రేమే భక్తి.ప్రేమ నిండిన హృదయంతో భగవంతుని కృపకు అర్హత సాదించగలుగుతాం.ఆధ్యాత్మిక జగతిలో వేసే ప్రతి అడుగు భగవంతుని వైపే కావడంతో ఆ సర్వాంతర్యామిని సులభంగా చేరుకునే మార్గాలు కూడా భక్తులకు,సాధకులకు భాగవతంలో నిర్దేశింపబడ్డాయి.
గమ్యం ఒక్కటే:-

మార్గాలు వేరైనా అందరూ చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే.ఎవరి అభిరుచి మరియు ఇష్టతతో స్వీకరించిన మార్గంలో వారు ఉమ్మడి మరియు పరమ పవిత్రమైన పరమాత్ముని చేరుకొనే గమ్యం వైపుకు సాధనతో సోపానాలు ఏర్పరుచుకోవడం విశిష్టమైనది మరియు అనుసరణీయమైనది.
నవవిధాలుగా మార్గాలు:-
తొమ్మిది మార్గాలు భగవంతుని చేర్చే పెన్నిధులు గా మారాయి.ఈ మార్గాలు చేర్చే గమ్యం మాత్రం ఎప్పటికీ మార్పులేని పరమాత్మ సన్నిధి.అందుకు తగ్గ సాధన సుకృతంతో కూడిన దివ్యత్వ అనుభూతులను నిరంతరం అందిస్తుంది.

శ్రవణం:-

దైవం యొక్క లీలలు మరియు మహిమలు వినేందుకు ఎంతో ఉత్సాహం చూపడంతో పాటు తన శ్రవణ ఇంద్రియాలు(చెవులు)ద్వారా దివ్యత్వ విభూతులను వినడం గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తారు.భగవంతుని అమృతతుల్యమైన వాక్కును శ్రవణం ద్వారా తెలుసుకుని ఆచరించి సద్గతిని పొందిన భక్తులు ఎందరో ఉన్నారు.దైవం ఇచ్చిన అవయవాలు దైవం కోసం తపించడం అంటే మనిషి మనీషిగా మార్పు చెందే దిశకు శ్రీకారం చుడుతున్నట్లు అర్ధం.

కీర్తనం:-

భగవంతుని గుణ గుణాలను కీర్తించడం మరో మార్గం.శ్రవణం ద్వారా విన్నది అనుభూతిలోనికి తెచ్చుకుని ఆ వైభవాన్ని మరికొందరు భక్తులకు చెప్పడం ద్వారా భక్తి వ్యాప్తికి దోహదం చేస్తూ జిహ్వ (నాలుక) ద్వారా వాక్కును కీర్తించడం మరో మార్గం.

స్మరణం:-

విన్నది,అన్నది నిరంతరం స్మరించడం ద్వారా మనస్సు పవిత్రమై మంచికి వేదికగా మారుతుంది.పదే పదే చింతన ద్వారా దైవాన్ని స్మరించడం సాధనలో మరో సోపానం.

పాదసేవనం:-

పరమాత్ముని పాదాలను సేవించడం ద్వారా భక్తుడు తన లో ఉన్న అహంకార,మమకారాలను త్యజించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు.పాదాలను సేవించడం పరమాత్మునికి అత్యంత దగ్గరగా జరగడం.

అర్చనం:-

నిర్మలమైన చిత్తంతో తనకు అనుకూలమైన ద్రవ్యాలతో దైవాన్ని అర్చించడం మరో మార్గం.అర్చన ద్వారా అనుభూతిని పటిష్టపరుచు కోగలుగుతాం.

వందనం:-

మనస్సు,ఇంద్రియాలు,బుద్ధిని ఏకం చేస్తూ దైవానికి సమర్పణ భావంతో చేసే నమస్కారమే వందనం.అంతా పరమాత్మే నేను అన్నది లేదు అని గుర్తెరిగేలా చేసే సంస్కార క్రియ వందనం.

దాస్యం:-

అధికుడిని అన్న భావం సాధకునికి ఏ కోశాన మనస్సులో వచ్చినా చేసిందంతా చేజారినట్టే.దాస్య బుద్ధితో భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండగలగడం కూడా భగవంతుని చేర్చే మార్గమే.

సఖ్యం:-

దైవంను స్నేహితునిగా భావించి తన కష్టాలు, సుఖాలులో భాగం పంచడం సఖ్యంగా చెప్పుకోవచ్చు.స్నేహితుని ముందు భేషజాలుకు ఏ విధంగా తావు లేదో ఈ చెలికాడి ముందు ఏదీ దాపరికం లేకుండా చెప్పుకోవడం మరో మార్గంగా సూచించబడింది.

ఆత్మనివేదనం:-

తొమ్మిదవ మార్గం ఆత్మ నివేదనం. ఆత్మయే పరమాత్మ చైతన్యమని గుర్తెరిగి సర్వస్య శరణాగతిని పొంది సంపూర్ణ సమర్పణ భావంకు ప్రతీకగా ఆత్మను నివేదనగా అర్పించడం మరో మార్గం.

ఈ రకంగా తొమ్మిది మార్గాలులో ఏదో ఒకటి సాధనకు సోపానంగా మార్చుకోగలిగితే దైవం యొక్క ఉనికిని నిరంతరాయంగా అందుకోగలం.మార్గం మరియు ప్రయాణ సాధనంలో మార్పు ఉండచ్చు గాని నిర్దేశిత గమ్యం మాత్రం ఒక్కటే.మంచిని మాట్లాడి,మంచిని విని,మంచిని కోరుతూ,మంచికోసం నిరంతరం తపిస్తూ మంచిని ఆచరిస్తూ మంచిగా జీవించడం లోనే కలియుగంలో నవవిధ భక్తిమార్గాలు ఉన్నట్లు భావనచేయవచ్చు.భగవంతుని వాక్కును అనుసరించడమే భక్తి మార్గాలకు ఇంధనాన్ని అందించడం.తొమ్మిది మార్గాలు ఆధ్యాత్మిక సాధనా సోపానాలు. ఆచరిద్దాం ఆనందానికి చిరునామాగా మనల్ని మనం మార్చుకుందాం.... 🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment