Saturday, February 6, 2021

మనందరికీ తెలుసు గజేంద్రమోక్షం గూర్చి - ఒకసారి ఆ కథలోని అంతరార్థం గూర్చి తెలుసుకొందాము!!!

నేటిమాట

మనందరికీ తెలుసు గజేంద్రమోక్షం గూర్చి - ఒకసారి ఆ కథలోని అంతరార్థం గూర్చి తెలుసుకొందాము!!!

విముక్తి పోరాటమే - గజేంద్రమోక్షం
మదించిన ఏనుగు చేసే భీకర ధ్వనిని ఘీంకారం అంటారు,
మొసలి కోరల్లో చిక్కిన ఓ ఏనుగు ఘీంకారాన్ని విడిచిపెట్టి, ఓంకారాన్ని అందుకోగానే, ఆదిదేవుడు పరుగున వచ్చి ఆదుకొన్న కథే- గజేంద్రమోక్షం...
ఈ కథలో మొసలి కోరలు- మనిషి భవబంధాలకు ప్రతీక...

ఈ సృష్టిలో ఎవరి కర్మలు వారివే, ఎవరి పాపపుణ్యాలు వారివే, ఆ విషయంలో ఒకరితో ఒకరికి పోలిక లేకున్నా, ఒకరి కర్మానుభవం మరొకరి ద్వారా పూర్తి కావడం భగవంతుడి లీల.
ఎవరి కర్మ ఎవరి ద్వారా తీరాలో నిర్ణయించి, ఆ ఇద్దరినీ ఒక చోట కూర్పు చేసే నేర్పరి భగవంతుడు...
గజేంద్రమోక్షం కథలో జరిగిందదే...
మొసలి, ఏనుగుల కర్మలు పరస్పరం తీరవలసినవి, ఘర్షణకు ముందు వాటి మధ్య చంపుకొనేంత ద్వేషం లేనేలేదు, కూర్పు ఆ విధంగా జరిగిందంతే...

కర్మానుభవం పూర్తయ్యే ఈ క్రమంలో ఆపదనేది మనిషికి గొప్ప సంపాదన అంటుంది వేదాంతం.
గజేంద్రుడికి, మొసలి ద్వారా ఆపద ఏర్పాటయింది, అది పెద్ద సంకటంగా మారింది, చివరకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.
తన స్వశక్తిని నమ్మి తొలుత కరిరాజు మకరితో ఘోరంగా పోరాడాడు, క్రమంగా నీరసించాడు, చావుకు దగ్గరయ్యాడు, తన స్వీయ సామర్థ్యంపై విశ్వాసం సడలిపోయింది.
అరుపులు ఆగిపోయి ఆర్తి ఆవరించింది. అహంకారం క్షీణించి ఆవేదన అంకురించింది.

మృత్యుసదనం మునివాకిలి స్ఫురించినప్పుడే జీవికి గాఢమైన తత్పరత స్థిరపడుతుంది.
‘నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు’ అన్న నిశ్చయబుద్ధి కలుగుతుంది.
గజేంద్రుడికి ఆలా కలిగింది, పరమాత్మ సాక్షాత్కారానికి అది అర్హతను ఆపాదించింది, జీవాత్మకు, పరమాత్మకు మధ్య దూరాన్ని చెరిపేసింది, తనను ఆదుకునేందుకై ఆపన్న ప్రసన్నుడు ఆగమేఘాల మీద పరుగెత్తుకొచ్చేలా చేసింది.

వచ్చీరాగానే విష్ణువు తన ఎడమ చేతిని చాచి ఏనుగు తొండాన్ని అందుకొన్నాడు, సర్పయాగం సమయంలో ఇంద్రుడి సింహాసనంతో సహా తక్షకుడు ఒక్కసారిగా వచ్చి హోమగుండంలో పడిపోయినట్లుగా, మొసలితో పాటు గజేంద్రుడు తటాలున ఒడ్డున వచ్చి పడ్డాడు.
చక్రాయుధంతో శ్రీహరి మకరి తల తరిగేశాడు, గజేంద్రుడి కారణంగా మొసలికి కర్మ విమోచనం జరిగి మోక్షం సిద్ధించింది...

విష్ణు సాక్షాత్కార దివ్యానుభూతి గజేంద్రుడి స్వభావ, సంస్కారాలను మార్చేసింది, అతడు ఎన్నో గజసమూహాలకు అధిపతి. వేలాది ఆడ ఏనుగులతో కలిసి విశృంఖలంగా విహరించడానికే ఆ సరస్సులో దిగాడు.
మొసలి నోట చిక్కాడు, ఆపదలో ఇరుక్కున్నాడు, తీరా విపత్తు తొలగిపోయేసరికి అతడిలో మార్పు చోటు చేసుకొంది.
తిరిగి తన మాయదారి భోగ ప్రపంచంలోకి ప్రవేశించడానికి మనస్కరించలేదు, మొసలితో సుదీర్ఘ పోరాటం - జీవి నిరంతర జీవనసమరానికి ప్రతీక...
మొసలి కోరల నుంచి బయట పడటం- కర్మపాశాల నుంచి విముక్తికి సూచిక. భగవంతుడి దర్శనం గజేంద్రుడిలో దాగి ఉన్న ‘జీవుడి వేదన’ను తీవ్రంగా రగిలించింది.
మొసలి కోరల నుంచి బయటపడేందుకై మొదలైన ఆరాటం- ఆర్తి కారణంగా మొత్తం జన్మ పరంపరల నుంచి శాశ్వతంగా బయటపడాలన్న స్థితికి ఎదిగింది.

ఇది గజేంద్రుడి ఒక్కడి తపన కాదు... సృష్టిలోని ప్రతి జీవుడి వేదన... ఇంద్రద్యుమ్నుడు అనే గంధర్వుడు చేసిన దోషానికి ప్రతిఫలమే ఏనుగుజన్మ. శ్రీహరి దర్శనంతో పూర్తయిందా కర్మ.

ఏ తల దైవానికి వంగి నమస్కరిస్తుందో ఆ తలకు కర్మ తలవంచుతుంది,
అదే ఈ కథలో సందేశం!

🌺శుభమస్తు🌺
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏🌺🌺🌺🌺ఓం గం గణపతయే నమః🌺🌺🌺🌺

Source - Whatsapp Message

No comments:

Post a Comment