Tuesday, February 9, 2021

మాటలాడేముందు ఆలోచించి మాట్లాడాలి

మాటలాడేముందు ఆలోచించి మాట్లాడాలి ప్రతి ఒక్కడూ సత్యమే పలకాలని విధించబడింది. అందుచేత ఎవరైనా ఒక విషయం మరొకరికి తెలియచేసేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి. చెప్పదలచిన విషయం సత్యమే అయినా దానివల్ల వినేవానికి కష్టం కలిగేటట్లు అయితే ముందు జాగ్రత్త పడడం మంచిది. ఉదాహరణకి - ఒక వ్యక్తి ఏదో ఒక వైదికమైన కర్మ చేస్తున్నాడు. మంచి ఉత్సాహంతో ఉన్నాడు. అతనికి ఏదో దుర్వార్త చెప్పవలసి ఉంది. తిన్నగా వెళ్ళి ఆ వార్త అతనికి చెప్పి ఆతని ఉత్సాహానికి, మానసిక శాంతికీ మనం భంగం కలిగించవచ్చునా? మనం అలా చేసిన పక్షంలో మనం సత్యం పలికాం అనే సంతృప్తి మనకుంటే ఉండవచ్చును. అయితే మనం ఈ వార్త చెప్పడం వలన జరుగుతున్న ఆ కార్యం సగంలో నిలిచిపోతుంది అనే విషయం కూడ మనం ఆలోచించాలి. అందుచేత వార్తను తరువాత అనుకూలమైన సమయంలో అతనికి తెలపడం మంచిది. సత్యం పలకడంలో కూడ మనం మన వివేకాన్ని ఉపయోగించి, అది సహింపశక్యం కానిదయే పక్షంలో శక్యమైనంత వరకు సున్నిహితంగా చెప్పి దానిని సహ్యంగా చేయడం మంచిది. ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం అసత్యం కూడా పలకకూడదు. ప్రియమైన అసత్యం అతనికి ఆనందం కలిగించవచ్చు. అయితే ఆ ఆనందం తాత్కాలికమే. నిజం ఏమిటో తెలిసిన తరువాత అతడు చాలా బాధపడిపోతాడు. అందుచేత ఏ అపాయానికీ దారితీయకపోయినా తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించేదయినా అసత్యం పలకకూడదు. అందుచేత ఏది సత్యమో, ఏది లాభకరమో, ఏది ఆనందజనకమో అలాంటి సత్యాన్నే పలకాలి. ఇలాంటి వర్తనం సముచితమైనది, ధర్మసమ్మతమైనది. ఇదే ఒక పుణ్యకార్యం. తపస్సు చేసుకొనడానికి అడవులలోనికి వెళ్ళవలసిన పని లేదు. ప్రీతి జనకమైన సత్యాన్నే చెపుతాను, ఇతరులను సంతోషపెట్టడానికి కూడ అసత్యం పలకను అని నిశ్చయించుకొని ఆవిధంగా ప్రవర్తించేవాడు ఋషికి ఏమాత్రమూ తీసిపోడు. జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment