Sunday, March 7, 2021

శ్రీ సూక్తమ్ విశిష్టత

శ్రీ సూక్తమ్ విశిష్టత

(ప్రతి రోజు శ్రీ సూక్తము తో అమ్మవారికి రెండు పూటలా కుంకుమ అర్చన చేయండి. మీ ఇంట్లో ఇంక ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు, దారిద్ర్యము అప్పుల బాధలు ఉండవు.చాలా శక్తివంతమైనది శ్రీ సూక్తము)శ్రీ చక్రం ఉన్నవారు శ్రీ సూక్తము తో రోజు ఈ విధంగా చేయవచ్చు).

శ్రీ చక్రం లేని వాళ్ళు కూడా మామూలుగా
ఒక తమలపాకు మీద శ్రీ సూక్తం తో కుంకుమార్చనలు చేయవచ్చు
శ్రీ సూక్తం, అర్దం 🙏
-
వేదాలలో, పురాణాలలో ఉన్న మహాలక్ష్మీ స్తుతుల కూర్పే శ్రీ సూక్తం. మన దక్షిణ భారత పూజా విధానంలో ఇది బహుళ ప్రాచుర్యం సంతరించుకున్నది. ఆ శ్రీమహాలక్ష్మి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా కలగటానికి దీని పారాయణ శ్రద్ధగా చేద్దాము.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్
ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా
పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్
అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే
పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే
చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్
ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా
శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్
శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

తాత్పర్యము:-
ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.

గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.

చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!

ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.

సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.

ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము.

కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.

మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు.

ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము.

ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత.
పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు.

గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు.
పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము.

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు.

చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను.

ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ!

పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి.
నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక!

పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.

పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో, సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక!

భాగ్యానికి నిలయమైనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.

సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!

వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.

శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.

పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు.

విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను.

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!
మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!.

శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు.
మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి.

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

Source - Whatsapp Message

No comments:

Post a Comment