మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయతీ
రెండవది దార్శనికత
చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్దత
రెండవది పారదర్శకత
ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం
రెండవది తత్వం
ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం
రెండవది వివేకం
ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ
రెండవది నేర్పు
ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం
రెండవది నీడ వీడిన చైతన్యం
గెలవడం వేరు
గెలిపించడం వేరు
మొదటిది నేను
రెండవది మేము
సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం
రెండవది చైతన్యం
మొదటిది కావాలో...
రెండవది కావాలో ఆలోచన మనదే ...
ఆచరణా మనదే ...
No comments:
Post a Comment