ఏకం సత్
"పట్టపగటి వెలుగు పరమాత్ముడు
ఎట్ట ఎదుటనే ఉన్నాడు పరమాత్ముడు..."
అన్నాడు అన్నమయ్య.
మనం చూసేదంతా దేవుణ్ణే.
కానీ దేవుణ్ణి చూడాలని వ్యర్థప్రయత్నాలు చేస్తుంటాము.
"ఇందుగలడందు లేడని సందేహము వలదు..."
"హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు..."
అన్న అద్వైతవాక్యములను వల్లె వేస్తూనే ఉంటాము.
మరో ప్రక్క దేవుణ్ణి వెతుకుతూనే ఉంటాము.
నాకు దైవదర్శనం కాలేదని వాపోతూనే ఉంటాము.
* * *
సర్వత్రా ఉన్న దైవాన్ని మనకు దర్శింపజేయడానికి 'గురు' రూపంలో ఈ లోకంలోకి అప్పుడప్పుడు visit చేస్తుంటుంది మాయాశక్తి.
ఏ దివ్యసందేశాన్ని మనకు అందించడానికి గురువులు అవతరించారో ఆ సందేశాన్ని మనం తీసుకోగలిగితే చాలు...వారి అవతారప్రయోజనం పూర్తయినట్టే.
కాని మనం అది వదిలేసి, వారు ఏ పాంత్రంలో పుట్టారు? ఏ తేదీన పుట్టారు? వారి తల్లిదండ్రులెవరు? వారు ఏ మతస్తులు? అన్న అనవసరమైన శోధనలతో కాలాన్ని వ్యర్థం చేస్తుంటాము...
పోస్ట్ మేన్ ఎక్కడ ఎప్పుడు ఎవరికి పుట్టాడో; అతని మతమేమో మనకు అనవసరం. పోస్ట్ మేన్ మనకు చేరవేసే 'లెటర్స్' ప్రధానం.
అలాగే షిరిడీబాబా, రమణమహర్షి, వివేకానంద, సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు దైవసందేశాన్ని మనకు అందజేయడానికి వచ్చిన దైవదూతలు.
వారి సందేశాన్ని తీసుకొని, వాళ్లని వదిలేయడమే వాళ్లని నిజంగా గౌరవించినట్లు.
కానీ మనం చేస్తున్నదేమిటి?
వాళ్లకి పటాలు కట్టి, మఠాలు కట్టి సందేశాన్ని పారవేసుకుంటున్నాము...
తత్త్వం తగ్గింది...
తతంగం పెరిగింది...
సంప్రదాయాలు ఇప్పుడు షోబిజినెస్ లు....
భక్తి ఇప్పుడు ఫ్యాషన్...
ఛారిటబుల్ ట్రస్ట్ లు ఇప్పుడు స్టేటస్ సింబల్స్...
* * *
మనం ఉద్ధరింపబడడానికి ఉద్గ్రంథాలు అవసరం లేదు.
తతంగాలు అవసరం లేదు.
"భగవంతుడే యజమాని" అన్న షిర్డీబాబా సందేశం ఒక్కటి చాలు.
"నీవు నీవుగా ఉండు" అన్న రమణమహర్షి సందేశం ఒక్కటి చాలు.
"దేనికీ భయపడవద్దు" అన్న వివేకానందుల సందేశం ఒక్కటి చాలు.
* * *
డీప్ గా ఆలోచిస్తే దేవుని పేరుతో మనం చేసేదంతా దేవుని కోసం కాదేమో అనిపిస్తోంది...
దేవుని "ద్వారా" మరేదో పొందాలనేదే...
ఆ "మరేదో" అనేది వదిలేస్తే...
దేవుడు స్వచ్ఛంగా, పూర్ణంగా, ఉన్నపళంగా మనకు దొరికిపోతాడు.
'దేవుని కోసమే దేవుణ్ణి కొలువు' అంటారు గురువుగారు...
అలా దేవుని కోసమే దేవుణ్ణి కొలవడం...
అదే నిజమైన కర్మ, భక్తి, జ్ఞానం...
ఎవరు చెప్పారు అన్నది ముఖ్యం కాదు...
ఏం చెప్పారు అన్నదే ముఖ్యం.
అందరూ చెప్పింది ఒక్కటే -
"ఏకం సత్" అనేదే.
ఆ ఏకాత్మస్వరూపంలోనే సదా సంస్థితమై ఉండడం కన్నా జీవిత పరమార్థం మరొకటి లేనేలేదు.
* * *
No comments:
Post a Comment