Sunday, February 1, 2026

 😊❤ సుమతీసత్యం ❤😊

భోజనం వడ్డించింది సుమతి.. 

" ఏం కూరోయ్ ఇది , బహుశా బీరకాయ్ , ఊ కాదులే .. సొరకాయ్ , కాదు కాదు బీరకాయ్... బాగానే ఉంది కానీ కాస్త నీరు ఇంకొంచెం ఇగిరాక స్టవ్ మీద నుంచీ దించుంటే బావుండేదేమో.." అన్నాడు సత్యమూర్తి... 

అతని మాటలు వింటూ మౌనంగా అన్నం తింటోంది సుమతి, అదే బీరకాయ్ కూరతో.. 

భార్య తన కామెంట్స్ విని కూడా, కామ్ గా ఉందిలే అనుకున్నాడు సత్యమూర్తి , పిచ్చి మానవుడు.. 
" చాల్లెండి వంకలూ , బానేఉందిగా కూర , తినండి.." అని భార్య వెంటనే ఓ సమాధానం చెప్పేస్తే , కాస్తలో కాస్త నయం.. 

అదే ఆవిడ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉందంటే అర్థం .. పులి దాడి చేసేముందు నెమ్మదిగా సవ్వడి చేయకుండా నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది అంటే , మరింత వేగంగా, బలంగా ,.. విడిచిన బాణంలా ముందుకు వెళ్ళి గాయపరచడానికే... అని అప్పటికి సత్యమూర్తికి ఇంకా అనుభవంలోకి రాలేదు పాపం...

" పదండీ " అంటూ బయటికి వెళ్ళేందుకి తయారయి వచ్చింది అదేరోజు సాయంత్రం సుమతి ,... " ఇప్పుడెక్కడికీ " అన్నాడు సాగదీస్తూ సత్యమూర్తి... 
" ఇందాక మనమేమీ బయటకు వెళ్దామని అనుకున్నట్లు లేమే .. " అని కూడా సందేహం వెలిబుచ్చాడు...

" వెళ్ళాలని నేను అనుకున్నాలెండి ఇందాక.., మీతో ఇప్పుడు చెబుతున్నాగా , పదండి పదండి.." అంది సుమతి శాసనం జారీ చేస్తున్నట్లుగా... 

" ఓ .. ఏదైనా సినిమాకి వెళ్దామా , పద పదా .. వచ్చేటప్పుడు దారిలో మల్లెపూలు తీసుకుందాం , .. " అన్నాడు చిలిపిగా నవ్వుతూ సత్యమూర్తి...

స్కూటర్ మీద బయలుదేరారు ఇద్దరూ... అరగంట తరువాత సామాన్ల షాప్ ఒకటి పెద్దది , అక్కడ బండి ఆపమంది సుమతి.. షాప్ లోకి వెళ్ళి , మందంగా , పెద్దగా ఉన్న బాండీలు , గిన్నెలూ చూస్తోంది ..

" ఇప్పుడెందుకు ఇవన్నీ.. ఇంట్లో బొచ్చెడు సామాన్లు ఉండగా " అన్నాడు సత్య... " ఆ ఆ.. ఉన్నాయ్ సామాన్లు , ఆవిడకి ఊరిలో ఇంట్లో మోతబరువు అనుకున్న సామాన్లు తెచ్చి , నా మొహాన పడేసారు మా అత్తగారు , ఆ అరిగి కరిగిపోయిన బాండీలో వంట చేస్తుంటే , మద్యాహ్నం చూసారుగా , కూరలు రుచిగా కుదరటంలేదు కూడానూ.." అంటోంది సుమతి...

" కూర రుచిగా రావాలంటే , మనకి వంట బాగా చేయటం వచ్చుండాలి , అంతేగానీ .. " అని అంటున్న సత్య వైపు ఉరిమినట్లుగా చూసింది సుమతి... 
" అవునా , సర్లేండి , పోనీ మా ఫ్రెండ్ చెప్పింది మైక్రోవేవ్ లో ఒకేసారి , గిన్నెలో అన్నీ పెట్టేసి టైమ్ సెట్ చేసి పెట్టేస్తే , హాయిగా మధ్యమధ్యలో కలపకుండా ఉన్నా సరే కూర చక్కగా తయారయిపోతుందిట.. పోనీ మైక్రోవేవ్ కొనుక్కుంటా.. " అంది సుమతి , భర్త వైపు చూస్తూ ,  నవ్వు నవ్వుతూనే పళ్ళు నూరుతూ...

" హబ్బే.. వద్దొద్దు నాకు సరిపడవు అలా వండితే , చక్కగా పొయ్యి మీద వండుకుందాం మనం.. కరెంటు ఖర్చు పెట్టి మరీ , ఎందుకు వండుకోవడం.. నీకు నచ్చిన బాండీ కొనుక్కో బంగారం.." అనేసాడు గబగబా సత్య ఒక పిచ్చి నవ్వు బలవంతంగా మొహానికి అతికించుకుంటూ...

సుమతి ఇందాక సత్యతో మాట్లాడే ముందు నడుము దగ్గర దోపిన చీరకొంగు బయటకు తీసి , సత్యను చూస్తూ ఒకసారి చీరకొంగును దులిపి మామూలుగా వెనక్కి  వదిలేసింది చీరకొంగుని... 
" ఒహో కయ్యానికి కాలు దువ్విందా ఇందాక మన మీద, నా సత్యభామ , ఈ సత్యకి దొరికిన భామ " అని సత్య , సత్యం తెలుసుకున్నాడు , ఇహపై ముందుముందు భార్య దగ్గర ఎలా మెలగాలో , మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడకపోతే , జేబు బరువు అమాంతంగా ఎలా తగ్గిపోతుందో బాగా తెలిసొచ్చింది...

అలా అలా సత్యమూర్తి నోరు ఆగక ఏదో ఒకటి అనెయ్యటం, తరువాత సత్యగారి భామగారు ఆ అనేసిన భర్త మాటలకు భారీగా జరిమానాలు అందిపుచ్చుకోవడం జరుగుతూనే ఉంది...

ఇడ్లీపప్పు తేవయ్యా అంటే పెసరపప్పు, ఇడ్లీరవ్వ ఏదయ్యా అంటే బొంబాయిరవ్వ తేవటం, సత్యమూర్తి తప్పిదాలు... 

తిక్కరేగిన సుమతి, మతి తిరిగి ఒకరోజు, తనే షాపుకెళ్ళి ఇడ్లీరవ్వ తెచ్చి, రాత్రికి అదే రవ్వతో ఉప్మా చేసి పెట్టింది సత్యమూర్తికి...

ఉప్మా మొదటిముద్ద తిన్నాడు సత్య, అబ్బే రుచి బాలేదే,.. అమ్మో బయటికి చెబితే, మళ్ళీ  ఎంత పెనాల్టీ కట్టాలో అనుకుని , గుటుక్కున ఒక ముద్ద మింగేసి, ఒక గ్లాసుడు నీళ్ళు తాగుతున్నాడు...

అలా భర్త ఓ నాలుగు ముద్దలు తిప్పలు పడి తిన్నాక, " ఇహ చాల్లే, మీ శిక్ష పూర్తయ్యింది, ఇడ్లీరవ్వతో ఉప్మా ఇంకెంతసేపు తింటారూ,.." అని సుమతి మంచితనం చూపించి, భర్తకి ఇష్టమైన జీడిపప్పు టమోటాభాత్ పళ్ళెం, సత్యమూర్తికి ఎదురుగా పెట్టింది...

" ఒసే రాక్షసీ.." అని మనసులోనే గట్టిగా అరుచుకుని, కోపంతో మొహం ఎర్రగా చేసుకుని, బహు రుచిగా నోటికి ఆనుతున్న జీడిపప్పు ఉప్మా, చకచకా తినేసాడు సత్యమూర్తి...

ఇలాంటి ఎన్ని శిక్షలు పడినా,  అయ్యగారికి సరుకుల విషయంలో అయోమయం మాత్రం పోనే పోలేదు...

అసలే అంతంతమాత్రం మన సత్యం షాపింగూ , ఇహ పిల్లలు పుట్టి పెద్దాళ్ళయ్యాక, సత్యమూర్తికి అటూఇటూగా ఓ యాభై యేళ్ళు వచ్చేసాయి.

ఓ రోజు పులిహోర చేస్తోంది సుమతి.. " అయ్యో వేరుశెనగ గుళ్ళు అయిపోయాయే, పిల్లలకు అవి వేయనిదే పులిహోర నచ్చదు " అంది సుమతి...

" నేను తెచ్చేస్తాగా, ఎంతసేపు, .. నువ్వు అన్నం, పసుపు కలిపి రెడీగా పెట్టుకో, తిరగమోతకి పొయ్యి మీద బాండీ పెట్టేసుకో.." అంటూ సత్యమూర్తి ధీమాగా భార్యకు భరోసా ఇచ్చి బయటకు వెళ్ళాడు...

ఐదు నిముషాల్లో రావల్సిన మనిషి పావుగంట అయినా రాడాయే... " హూ, ఇంకా రాలేదేమిటీ ఈయనా.." అనుకుంటూ టీ వీ లో సీరియల్ చూస్తోంది సుమతి..భర్త నుంచీ ఫోన్ వచ్చింది , 
" హెలో.." అంది..

" అవునోయ్ , బంగాళదుంపలు తీసుకున్నా, మ్యారీ బిస్కెట్లు తీసుకున్నా, ఈనో ప్యాకెట్లూ తీసుకున్నా.. ఇంకోటేదో అసలుదే మరిచిపోయినట్లున్నాను అనిపిస్తోంది, హేవిటదీ.." అన్నాడు అయోమయంగా...

ముసలాయన మతిమరుపుకి, సుమతికి బాగా నవ్వొచ్చేసింది, " ఓరి నీ మతిమరుపు దొంగలు తీసుకెళ్ళా, అసలు వెళ్ళిందే వేరుశేనగపప్పులు కోసం, అవే మరిచిపోయారా.. " అని నవ్వుతూ చెప్పింది...

" ఆ.. అవును కదూ వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలి, సరే సరే ఫోన్ పెట్టేయ్, త్వరగా తీసుకొస్తా.." అని ఫోన్ పెట్టేసాడు పెద్దాయన సత్యం..

అలా అలా ఒకరినొకరు, తిప్పలు పెట్టుకుంటూ ఏళ్ళు గడిచాయి..

ఆ రోజు ఇద్దరికీ షష్టిపూర్తి మహోత్సవం... స్టేజీ మీద సత్యమూర్తి ఒహటే జోకులు, చిలిపిదనం, అల్లరి.. ఇహ రమ్మనండర్రా సుమతిని దండలు మార్చుకుంటారు, షష్టిపూర్తి దంపతులు.. అన్నారు పెళ్ళి జరిపించే అయ్యవారు...

స్టేజీ మీదకి వస్తోంది గులాబీచీరకు ఆకుపచ్చని జరీ అంచుతో విమల, సుమతి చెల్లెలు... దూరం నుంచీ వస్తున్న విమలను చూసాడు సత్యం, ఇంతలో ఎవరో పలకరించారు ఇటుపక్కనుంచీ సత్యంని, వారితో మాట్లాడి అటు తిరిగి తలనిండా పూలతో కిందకి వంగి సర్దుతున్న విమలతో చెప్పాడు, మా పెళ్ళిరోజున ముఫ్ఫైరెండేళ్ళ క్రితం గులాబీరంగు వోణీలో ఎంతందంగా ఉన్నావో విమలా, ఈ రోజున కూడా ఈ గులాబీ చీరలో అంతే బావున్నావు, మీ అక్క కంటే ముందే నిన్ను చూసుంటే, నిన్నే పెళ్ళి చేసుకునేవాడిని.." అని చిలిపిగా, సరసంగా చెబుతున్నాడు సత్యం...

" అవునా, "..అంది.. తన గులాబీ రంగు పట్టుచీర కొంగును, నడుము దగ్గర దోపుకుంటూ సుమతి, తల పైకెత్తి భర్తని సూటిగా చూస్తూ...

" బావోయ్, మా అక్కచెల్లెళ్ళం అందరం కలిసి, ఇవ్వాళ గులాబీరంగు చీరలే కట్టుకున్నామోచ్.." అంది విమల బావని ఆట పట్టిస్తూ...

" అదే సుమతి , మీ అందరినీ ఇలా చూసి నా మతి పోయి.." అని సత్యం తడబడుతుంటే.. 

" మతి అనేది అసలు ఉంటే కదా మహానుభావా మీకు.." అంది సుమతి మూతి మూడు వంకర్లు తిప్పుతూ , సత్యంకి మెడలో దండ వేస్తూ, తన చేతిలో రెడీగా పట్టుకుని ఉన్న పిన్నీసుతో సత్యం చేయి మీద గుచ్చుతూ... " కెవ్ .." అని నొప్పితో కేక వెయ్యబోయి, " తప్పదులే, భార్యని అనవసరంగా బాధపెడితే శిక్ష తప్పదుగా " అనుకున్నాడు సత్యం, ఎప్పటికయినా భరించేవాడు భర్త కదా.. అని అనుకుంటూ...
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment