Thursday, June 25, 2026

 *🌺నేటి విశేషం🌺*
*🌻 జ్యేష్ఠ శుద్ధ దశమి – దశపాపహర దశమి 🌻*

*🌊 గంగావతరణం*

శివునికి సంబంధించిన విషయాలలో అత్యంత పవిత్రమైన ఘట్టాలలో గంగావతరణం ఒకటి. ఈశ్వరుని అపారమైన కారుణ్యానికి ఇది గొప్ప నిదర్శనం.

సగర చక్రవర్తి కుమారులు అహంకారంతో ప్రవర్తించి, కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. తమ యాగాశ్వం అక్కడ కనిపించడంతో, ఆయనే దానిని అపహరించారని భావించి, చేతికి దొరికిన కర్రలతో ఆయనను నిందిస్తూ దాడి చేయడానికి పరుగెత్తారు.

మహాత్ముల సంకల్పమే ఎంతో శక్తివంతమైనది. కపిల మహర్షి వారి కోలాహలం విని కళ్లు తెరిచి చూశారు. సగర కుమారులు తనపైకి దూసుకొస్తుండగా, ఆయన కోపంతో హుంకరించారు. వెంటనే వారి అహంకారం అగ్నిగా మారి, అరవై వేల మంది సగర కుమారులు అక్కడికక్కడే భస్మమయ్యారు.

అంశుమంతుడు ఈ సంఘటనను చూసి, వారికి జలతర్పణం చేయడానికి నీరు తీసుకొచ్చాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అన్నాడు

“మహాత్ముల క్రోధాగ్నిచేత మరణించిన వారిని సాధారణ జలాలతో ఉద్ధరించలేరు. వారి భస్మరాశులపై స్వర్గం నుండి గంగాదేవి ప్రవహించినప్పుడే వారికి సద్గతి లభిస్తుంది.”

ఈ మాట విని ఇక్ష్వాకు వంశీయులు తీవ్రంగా విచారించారు. సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు గంగను భూమికి తీసుకురావడానికి ప్రయత్నించినా ఫలితం పొందలేకపోయారు. చివరకు భగీరథుడు ఈ మహాకార్యాన్ని చేపట్టాడు.

భగీరథుడు దక్షిణ భారతదేశంలోని గోకర్ణంలో బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు.

అప్పుడు భగీరథుడు రెండు వరాలు కోరాడు
ఇక్ష్వాకు వంశం ఎల్లప్పుడూ కొనసాగాలి.
తన పూర్వీకులైన సగర కుమారులకు సద్గతి కలగడానికి గంగను భూమిపైకి తీసుకురావాలి. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు:

“గంగ ప్రవాహాన్ని భూమి భరించలేదు. ఆమెను ముందుగా స్వీకరించగలవాడు పరమేశ్వరుడే. కాబట్టి నీవు శివుని గురించి తపస్సు చేయాలి.”

భగీరథుడు మళ్లీ పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, గంగను తన జటాజూటంలో ధరించేందుకు అంగీకరించాడు.

గంగాదేవి తన వేగంతో శివుని కూడా పాతాళానికి తీసుకెళ్లగలనని గర్వించింది. కానీ శివుడు ఆమె ప్రవాహమంతటినీ తన జటాజూటంలో బంధించాడు. గంగ ఆశ్చర్యపోయింది.

గంగ బయటకు రాకపోవడంతో భగీరథుడు మళ్లీ తపస్సు చేశాడు. శివుడు కరుణించి గంగను విడుదల చేశాడు. గంగ మొదట బిందుసరోవరంలో పడింది. అక్కడి నుండి ఏడు పాయలుగా విడిపోయింది. వాటిలో ఒక ప్రవాహం భగీరథుని వెంబడి సాగింది.

ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి దేవతలందరూ తమ తమ వాహనాలపై వచ్చి ఆకాశమంతా నింపేశారు.

గంగ భూలోకానికి వచ్చిన తరువాత, అనేక మంది పాపాత్ములు ఆమెలో స్నానం చేసి పాప విముక్తులై స్వర్గలోకాలకు చేరుకున్నారు.

భగీరథుని వెంబడి ప్రవహిస్తున్న గంగ మార్గమధ్యంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. దీనికి కోపించిన జహ్ను మహర్షి గంగ ప్రవాహమంతటినీ త్రాగేశాడు.

గంగ కనిపించకపోవడంతో భగీరథుడు జహ్ను మహర్షిని ప్రార్థించాడు. మహర్షి కరుణించి తన చెవుల ద్వారా గంగను తిరిగి వెలువరించాడు. అందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది.

తరువాత గంగ భగీరథుని వెంట పాతాళలోకానికి చేరుకుంది. అక్కడ భగీరథుడు తన పూర్వీకుల భస్మరాశులను చూపించి వాటిపై ప్రవహించమని ప్రార్థించాడు.

గంగాదేవి ఆ భస్మరాశులపై ప్రవహించగానే సగర కుమారులందరికీ సద్గతి లభించి, వారు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నారు.
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథుని ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు

“భగీరథా! భవిష్యత్తులో ఎవరైనా అసాధ్యమైన కార్యాన్ని సాధించడానికి చేసిన మహాప్రయత్నాన్ని ‘భగీరథ ప్రయత్నం’ అని పిలుస్తారు. నీవు తీసుకువచ్చిన ఈ గంగాప్రవాహానికి ‘భాగీరథి’ అనే పేరు ప్రసిద్ధి చెందుతుంది.”
ఇలా చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు.

వాల్మీకి మహర్షి సాధారణంగా కథలకు ఫలశ్రుతి చెప్పలేదు. కానీ గంగావతరణ కథకు మాత్రం ప్రత్యేక ఫలశ్రుతి చెప్పారు.
గంగావతరణాన్ని భక్తితో విన్నవారు, గంగాధరుడైన పరమేశ్వరుని స్మరించి నమస్కరించినవారు

పాప విముక్తులు అవుతారు.
సమస్త కోరికలు నెరవేరుతాయి.
దీర్ఘాయుష్షు పొందుతారు.
అపమృత్యు దోషం తొలగుతుంది.
మంచి కీర్తి, సద్బుద్ధి లభిస్తాయి.

భగవంతుని వైపు మనస్సు మళ్లి సత్కర్మలలో ప్రవృత్తి కలుగుతుంది. అందువల్ల గంగావతరణ ఆఖ్యానం అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది.

🙏 గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ।
నర్మదే సింధు కావేరి జలేऽస్మిన్ సన్నిధిం కురు ॥ 🙏

*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*
            *_📿శుభమస్తు📿🙏*

No comments:

Post a Comment