Monday, June 15, 2020

ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలపై చిన్న విశ్లేషణ

ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలపై చిన్న విశ్లేషణ -

నిన్న జరిగిన ఒక సంఘటన కొంత బాధ కలిగించింది. సినిమా హీరో " సుశాంత్ సింగ్ రాజపుత్ " గారి ఆత్మహత్య . ఇదొక్కటే కాదు ఇలాంటి చాలా సంఘటనలు నిత్యం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనల వెనక ఉన్న ప్రధాన కారణం మనుషులు మానసికంగా ఎంత బలహీనంగా తయారవుతున్నారో మనకి అర్థం అవుతుంది. నాగరికత పెరుగుతున్న కొలది మనుషుల మధ్య బంధాలు , అనుబంధాలు తక్కువ అవుతున్నాయి అన్న నిజాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే . ముఖ్యంగా కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమలు పోయి ఆ స్థానంలో వ్యక్తిగత స్వార్థం ఎప్పుడైతే వచ్చి చేరిందో ఆరోజే మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయింది .

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వారిమధ్య ఒకరికోసం ఒకరు బ్రతికేంత గొప్ప అనుబంధాలు ఉండేవి. ఈరోజు ఎవరికి వారి యమునాతీరే అనేరీతిలో వ్యవహరిస్తున్నారు. "మనది "అనే మాట స్థానంలో "నాది "అనే స్వార్థం పెరిగిపోయింది . ప్రస్తుత సమాజంలో తల్లితండ్రులే చిన్నతనం నుంచి పిల్లలకు ఈ వ్యక్తిగత స్వార్థం నూరిపోస్తున్నారు. ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను. ఒక తల్లి పిల్లవాడిని చదువుకోవడానికి పాఠశాలకు పంపేప్పుడు ఒక బాక్స్ లో తినేపదార్ధాలు పెడుతూ " ఎవ్వరికి పెట్టకు నువ్వొక్కడివే తిను " అనే మాటలు చెప్పినదగ్గర నుంచి వాడికి స్వార్థం నూరిపోయడం మొదలవుతుంది. ఆ బాలుడు పెరుగుతున్న కొలఁది అతనిలో స్వార్థం పాలు పెరుగుతూనే ఉంటుంది.

ఇక్కడ మీకు వ్యకిగత స్వార్థం గురించి చెప్పడానికి ప్రధాన కారణం . స్వార్థంతో ఉన్న మనిషి తన చుట్టూ తాను గిరిగీసుకొని బ్రతకడం మొదలు పెడతాడు. ఏ రోజైతే అలా బ్రతకటం మొదలవుతుందో అప్పుడే మనలోని నిజాయితీ , ఆప్యాయత, ప్రేమలు అనేవి చనిపోతాయి. అవి లేనప్పుడు మనం మన సొంతవారితో గాని బయటవారితో గాని మన మనోభావాలను పంచుకోలేం . మనలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మనలో మనమే కుమిలిపోయి చివరకి రోగాలపాలు కావలసి వస్తుంది. మరికొంత మంది సున్నిత మనస్కులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దం అయ్యి తమ జీవితాన్ని అంతం చేసుకుంటారు.

మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనలోని మానవత్వం , మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. " కష్టాలు మనుషులకేగా మానులకు కాదుగా " అని ఆలోచించి పోరాడండి. ఎదిరించి బ్రతకండి. ఈరోజు నీది కాకపోవొచ్చు రేపు తప్పకుండా నీది అవుతుంది. నీ ఓపిక , నీ సహనం ఏదో ఒకరోజు నిన్ను గొప్పస్థానానికి తీసుకెళ్తాయి . ఇవన్నీ మీ పిల్లలకు చిన్నతనం నుంచే నూరిపోయండి . రేపు వారి భవిష్యత్ లో ఎంతపెద్ద కష్టం వచ్చినా తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని పొందుతారు. ప్రస్తుతం పిల్లల పెంపకం ఎలా ఉంది అంటే చదువుల మోజులో పడిన తల్లితండ్రులు వారిని మానసికంగా చంపేస్తూ ఈ రోజూ మేము పెట్టుబడి పెడుతున్నాం రేపు ప్రతిఫలం రావాలి అనే స్వార్ధపు ఆలోచనతో వారిని తీవ్ర మనసిక వేదనకు గురిచేస్తున్నారు. చివరికి వారి పెంపకం ఎలా ఉంది అంటే బాయిలర్ కోళ్లు వీళ్ళు ఒకటే అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇలా పెరిగిన వాళ్లలో వారి మానసిక స్థాయి ఎంత దిగజారిపోయి ఉంటుందో మనం ఈరోజు నిత్యం పేపర్లలో , టీవీ వార్తల్లో చూస్తున్నాం చదువు ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు అని ఈ సంఘటనల్లో ప్రధాన నేరగాళ్లు తల్లితండ్రులు మాత్రమే . మొక్కని ఎదగనివ్వండి. అది ఎలా స్వేచ్ఛగా పెరగనివ్వండి.

పుస్తకాలు చదివినంత మాత్రాన విజ్ఞానం రాదు . సమాజాన్ని చదవాలి. అప్పుడే మనలోని ఆత్మస్థైర్యం పెరుగుతుంది . తిరగండి బయట మీరు గీసుకున్న గిరి నుంచి బయటకి వచ్చి సమాజాన్ని చూడండి . ప్రతి ఒక్కరితో మాట్లాడండి . సంతోషంగా పలకరించడం నేర్చుకోండి. నవ్వండి. ఒకరికి మీదగ్గర ఉన్నదాంట్లో నుంచి కొంత పెట్టడం నేర్చుకోండి . అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో , ఇక్కడ మీకేం కావాలో , ప్రపంచం చాలా విశాలమైనది ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. నువ్వు ఏరోజైతే ప్రతి ఒక్కరితో స్వార్ధాన్ని వదిలి ప్రేమగా మాట్లాడతావో నీకు కావలసిన , దక్కవలసిన అవకాశం నీకు తప్పకుండా దక్కి తీరుతుంది. అంతా ఆనందంగా ఉన్నప్పుడు నీలో మానసిక సంఘర్షణకు చోటెక్కడ ఉంటుంది . ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉంటుంది.

మనిషి జీవితమే చిన్నది దానిలో సగభాగం నిద్రకి , పనులకే సరిపోతుంది. ఉన్న కొంత సమయాన్నైనా మీ సంతోషం కోసం కేటాయించండి . అందరిని కలుపుకుని వెళ్ళండి. భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఈ జీవితం . దీనిని వృథా చేసుకుని జీవచ్ఛం లా బ్రతకొద్దు. మీకు 70 సంవత్సరాల వయస్సు వచ్చినపుడు కూర్చుని ఆలోచిస్తే మీజీవితంలోని మధురస్మృతులు తలచుకొన్నప్పుడు ముఖం మీద చిరునవ్వు వచ్చేలా ఉండాలి.....

కాళహస్తి వేంకటేశ్వరరావు

Source - whatsapp sandesam

No comments:

Post a Comment