Tuesday, December 14, 2021

వర్తమానం ఒక బహుమానం🍁

🍁వర్తమానం ఒక బహుమానం🍁

✍️ మురళీ మోహన్

👌 ఙీవితం సాఫీగా సాగాలంటే మనిషి ఏం చేయాలో రుషులు, తత్వవేత్తలు, దార్శనికులు ఏనాడో బోధించారు. ప్రస్తుతంపైనే దృష్టి నిలపాలని, 'జరుగుతున్న క్షణం'లోనే మనిషి ఉండాలని వారు హితవు పలికారు. అప్పుడు వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందన్నది వారు అనుభవానికి తెచ్చుకున్నారు. అదే, అందరికీ తెలిసేట్లు చేశారు.

జీవనయానం సవ్యంగా జరగాలంటే, మనిషి ప్రతిక్షణం నిలకడగా ఉండాలి. ఎప్పుడూ గత జ్ఞాపకాలతోనో, భవిష్యత్తు గురించిన భయాలతోనో బతుకు వెళ్లదీసే వ్యక్తి- నిత్య శంకితుడిగా మిగిలిపోతాడు. అలాంటివాళ్లు కష్టాలను అదేపనిగా తిట్టుకుంటారు. సుఖాలు కలిగితే తెగ ఆనందపడతారు. ఒక విధమైన అగమ్యగోచర స్థితిలో వాళ్లు బతుకు యాత్ర కొనసాగిస్తుంటారు.

బతకటం వేరు, జీవించడం వేరు. సదా వర్తమానంలోనే గడిపేవాడు కష్టాలకు బెదరడు. సుఖాలకు పొంగిపోడు. అతడు జరుగుతున్న అన్నింటినీ సాక్షితత్వంతో గమనిస్తుంటాడు. ప్రశాంత చిత్తంతో ఉంటాడు. జీవించడం అంటే అదీ!బాధ లేని ప్రతి క్షణమూ మనిషికి ఆనందమే. అందువల్ల అతడు వర్తమానంలోనే జీవించడం నేర్చుకుంటే, ప్రతి క్షణమూ ఆనంద వీక్షణం సాధ్యపడుతుంది.

🍁 ఇద్దరు వ్యాపారులు పనిమీద ఓ ఓడలో ప్రయాణమయ్యారు. సముద్రం మధ్యలో ఎదురైన తుపాను కారణంగా వారు దారితప్పారు. దూరంగా గుర్తుతెలియని ఒక దీవికి చేరుకున్నారు. అక్కడే గుడారం వంటిది వేసుకుని, ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. ఒకరోజు రాత్రి చలి కాచుకోవడానికి కట్టెలు కాల్చారు. ఆ గుడారానికి నిప్పంటుకొని అంతా కాలిపోయింది.వారిలో ఒక వ్యాపారి 'ఇక్కడే ఉంటే దారీతెన్నూ తెలియకుండా పోతుంది' అనుకున్నాడు. తాను దిక్కులేనివాణ్ని అవుతానని భయపడ్డాడు. లోగడ ఇతరులకు జరిగినవాటిని తలచుకుని బెంగపడ్డాడు. భవిష్యత్తు కనిపించని స్థితిలో అతడు తన మిత్రుణ్ని 'సముద్రంలో ఈదుకుంటూ వెళ్లిపోదాం' అని తొందరపెట్టాడు. 'అనవసర భయాల నుంచి బయటపడు. అంతా మంచే జరుగుతుంది' అని రెండో వ్యాపారి సర్దిచెప్పాడు.

అయినా వినకుండా, తొందరపడి అక్కడినుంచి వెళ్లిపోవాలని సముద్రంలోకి దూకాడు మొదటి వ్యక్తి. ఈదలేక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.భగవంతుడిపై భారంవేసిన రెండో వ్యాపారి, ఎవరైనా అక్కడికి వస్తారని ఎదురుచూస్తూ ఆ రాత్రి గడిపాడు. గుడారం అంటుకోవడం వల్ల చెలరేగిన మంట, పొగ- అక్కడికి దూరంలో ఉన్న మరొక ఓడ సరంగుకు కనిపించాయి. సహాయం అందించడానికి, అతడు ఆ దీవి వైపు తన ఓడను మళ్లించాడు. ఫలితంగా రెండో వ్యాపారికి సహాయం అందింది. 🍁

ఈ కథ వల్ల తెలిసేదేమిటి? మనిషి వర్తమానంలో జీవించాలి. అప్పుడే, లౌకిక ప్రపంచానికి ఆవల ఉన్న అలౌకిక ఆనందం ఎలా అందుతుందన్నది అతడికి బోధపడుతుంది. మార్గం తెలుస్తుంది. అది పూజ, ప్రార్థన- ఏదైనా కావచ్చు. చివరికి అదే ధ్యానం అవుతుంది. యోగం సిద్ధిస్తుంది.అలాంటి యోగం సిద్ధించాలంటే, మనిషి తన లోపల పరుగులు తీసే ఆలోచనలను ఒకచోట నిలబెట్టాలి. వాటిని గమనించి మసలుకోవాలి. ఆ గమనింపు, అతడిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అవగాహన కలిగిస్తుంది. ఆ శ్వాస లోలోపలి లోతుల్లోకి చేరుతుంది. శరీరంలోని ప్రతి కణాన్నీ తాకుతుంది. ఆ అద్భుతమే 'తురీయ స్థితి'. దాన్ని దైవానుభూతి అంటారు. మనిషి సమత్వ స్థితి పొందాడనడానికి అదే తార్కాణం. శరీరం, మనసు దాటి- మనిషి లోపలి స్థితిని తెలియజేసే అది ఒక నిరంతర శక్తి ప్రవాహం. గతం నుంచి పాఠం నేర్చుకొని ప్రస్తుతంలో జీవించేవాడే, భవిష్యత్తును ఆనందంగా మలచుకోగలడు. వర్తమానం అంటే, ఆంగ్లంలో 'ప్రెజెంట్‌'. తెలుగులో దానికి అర్థం- బహుమానం. అందువల్ల, వర్తమానం ఒక బహుమానం! 💐

సేకరణ

No comments:

Post a Comment