Friday, December 17, 2021

రాజయోగం లో ‘ఎనిమిది శక్తులు’ లభించును.చాలా ముఖ్యమైనవి. మహిమ కలిగినవి.

రాజయోగం
➖➖➖

రాజయోగం లో ‘ఎనిమిది శక్తులు’ లభించును.చాలా ముఖ్యమైనవి. మహిమ కలిగినవి.

మొదటిది ‘సంకీర్ణశక్తి’. తాబేలు తన అవయవములను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకొని తిరిగి బయటకు తేగలిగిన విధంగా రాజయోగి తన సంకల్పానుసారము తన కర్మేంద్రియములతో కర్మచేయగలడు. లేదా అంతర్ముఖుడై(విదేహిస్థితి) అనంతమైన శాంతి అనుభవించగలడు. ఈ ప్రకారమైన ఆత్మ స్వరూప స్థితిలో ఉండుటచే అతడు మాయకు ఏమాత్రమూ లోబడడు.

రెండవశక్తి ‘సమీకరణశక్తి’. ఈ ప్రపంచము ఒక సత్రము వంటిదని అందరు ఒప్పుకుంటారు. కానీ వ్యావహారిక జీవితమునందు ఎన్నో బాదరబందీలు తగిలించుకొని వీని నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడ మరలించు కొనలేరు. కాని యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచము నందు తగుల్కొన నీయకుండా పరమపిత శివ పరమాత్మతో ఆత్మిక సంబంధమును కలిగి ఉండుటలోనే తన బుద్ధిని వినియోగిస్తాడు. అతడు ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టె, దివ్యగుణములు అనే బెడ్డింగు సర్దుకొని నిరంతరం తన స్వగృహమైన పరంధామమునకు పయనించుటకు తయారుగా ఉంటాడు.

మూడవశక్తి ‘సహనశక్తి’. చెట్టు రాళ్ళురువ్విన వానికే మధుర ఫలముల నిస్తుంది. యోగి కూడా అపకారికి ఉపకారమే చేస్తూ వారిపట్ల సదా శుభభావన శుభకామన కలిగి ఉంటాడు. యోగము వలన లభించును.

నాల్గవ శక్తి ‘ఇముడ్చుకొనుశక్తి’ యోగాభ్యాసము వలన బుద్ధి విశాలమై మానవునకు గాంభీర్యత, మర్యాదా స్వభావము అలవడుతుంది. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు. ఎంతటి అవమానమునకైనా కృంగి కృశించడు. అతడు సముద్రమువలె ఉన్న తన ఉద్వేగమును దైవీకుల మర్యాద అనే చెలియలి కట్టను దాటనీయడు. గంభీరుడై ఇతరుల అవగుణములను చూడకుండా వారిలోని సుగుణాలనే రత్నాలే స్వీకరిస్తాడు.

ఐదవశక్తి గుణదోషములను ‘పరిశీలించు శక్తి.’ కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించునట్లు యోగి తన సాంగత్యంలోనికి వచ్చినవారి గుణదోషములను వెంటనే గ్రహించగలుతాడు. అతని ముందు వారిలోని సత్యాసత్యములు దాగవు. సదా జ్ఞానరత్నాలు మాత్రము స్వీకరించి అజ్ఞానమనే గులకరాళ్ళపై తన బుద్ధిని పోనీయడు.

యోగికి లభించే ఆరవశక్తి ‘నిర్ణయ శక్తి’. అతడు ఉచితానుచితములను వెంటనే గ్రహించగలుతాడు. వ్యర్థ సంకల్పములు, పరచింతన విడిచి ఎల్లపుడు పరమాత్మ స్మృతిలో నిమగ్నమై ఉంటాడు.

ఏడోవ శక్తి ‘ఎదుర్కొనే శక్తి’. యోగాభ్యాసముచే ఏడోవ శక్తి ‘ఎదుర్కొనే శక్తి’ లభిస్తుంది. మన కళ్ళముందు ఆత్మీయులు మరణించినప్పటికి తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టిముట్టినప్పటికి అతను ఏనాటికి చలించడు. నిరంతరము ఆత్మ దీపము ప్రకాశిస్తూ ఉండగా ఇతరులకు జ్ఞాన ప్రకాశమును వ్యాపింప చేస్తాడు.

ఎనిమిదవశక్తి ‘సహకార శక్తి’. యోగి తన తనువు, మనస్సు, ధనములను ఈశ్వరీయ సేవలో ఉపయోగించుటయేగాక ఇతరులకు కూడా సహకారమిస్తూ కలియుగమనే విషయవికారాల పర్వతమును లేవనెత్తుటకు తన పవిత్ర జీవితమనే వ్రేలు నిచ్చి స్వర్గస్థాపన అనే అత్యున్నత కార్యములో సహ యోగి అవుతాడు.*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment